Saturday, July 29, 2023

17. ధ్యానించడం ఎలా

17. ధ్యానించడం ఎలా?  శిష్యుడు : నేనెలా ధ్యానం చేయాలో సెలవియ్యండి స్వామి : నీ ఇష్టదేవత పాదపద్మాలపై మనస్సును సుస్థిరంగా కేంద్రీకరించు. శిష్యుడు : హృదయస్థానంలోనా? సహస్రారంలోనా ఏ కేంద్రంలో? స్వామి : ధ్యానాన్ని ఈ రెండు కేంద్రాల్లోను ఆచరించవచ్చు. కాని మొదట హృదయాన్నే కేంద్రం చేసుకోవాలి. అదే నీకు శ్రేయస్కరం. శిష్యుడు : స్వామీ! 
ధ్యాన విధానాన్ని సెలవియ్యండి. స్వామి : హృదయ కమలాన్ని కేంద్రం చేసుకొని నీ ఇష్టదైవాన్ని ధ్యానించు. (ధ్యాన వివరాలు శిష్యుడు స్వయంగా గురువు ద్వారానే నేర్వాలి). శిష్యుడు : కాని హృదయం రక్తమాంసభూయిష్టం కదా! అట్టి ప్రదేశంలో భగవద్ధ్యానమా స్వామీ? స్వామి : శారీరక శాస్త్ర సంబంధిత హృదయం అని కాదు బాబూ! హృదయానికి చేరువన ఉండే అనాహతం ఆధ్యాత్మిక కేంద్రం, విశుద్ధచక్రస్థానంలో ధ్యానించాలి. ప్రారంభదశలో దేహభావనతో ఇష్టదైవాన్ని గురించి ధ్యానిస్తావు. కాని త్వరలోనే దేహస్ఫురణ కోల్పోయి, అంటె బాహ్యస్మృతి కోల్పోయి పరమానందమయమైన నీ ఇష్టదేవతా స్వరూపమే నీకు గోచరమవుతుంది. శిష్యుడు : అంటె చిత్రపటాల్లోను, విగ్రహాల్లోను కనబడే స్వరూపాన్ని ఆరాధించవచ్చా? స్వామి: చిత్రపటాలు, విగ్రహాలు సజీవ చైతన్యమయమై దీపించే నీ ఇష్టదైవస్వరూపాన్ని నీ మనస్సులో తలపింప చేయడానికి మాత్రమే సహకరిస్తాయి అని గుర్తుంచుకో. శిష్యుడు : మంత్రార్థాన్ని ధ్యానించడమంటే ఏమిటి స్వామి : మంత్రార్థమా? అది భగవన్నామం. నీకో పేరు ఉంది కదా! ఆ పేరున నిన్ను పిలిచేటప్పుడు నీ రూపం కూడ నా మనస్సులో మెదలుతుంది. అదే విధంగా భగవద్ధ్యానం చేస్తూన్నప్పుడు మంత్రోచ్చారణతో బాటు ఇష్టదైవస్వరూపాన్ని కూడ ధ్యానించాలన్నమాట. శిష్యుడు : మంత్రాన్ని మానసికంగా ఉచ్ఛరించాలా? లేక పైకి వినవచ్చేట్లు చెప్పాలా? స్వామి : ఒంటరిగా అంటే ఏకాంతంగా ఉన్నప్పుడైతే పైకి వినబడేట్లు చెప్పవచ్చు. అలా కాని పక్షంలో మానసికంగా జపించవచ్చు. శిష్యుడు : స్వామీ! ఇటీవల కొన్ని రోజులుగా ధ్యాన సమయంలో 
కళ్ళు మూసుకొన్నప్పుడు మంత్రాక్షరాలన్నీ మిలమిలా మెరుస్తూ కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి. అప్పుడు నాకు నా ఇష్టదేవతా స్వరూపం మరుగైపోతున్నది. ఏం చెయ్యాలి? 
స్వామి : నీ ఇష్టదైవాన్ని నీ మనస్సు నుండి మరుగు కానివ్వరాదు. ధ్యానమూ, మంత్రజపమూ మేళవించి చేయాలి నాయనా! అయినా నీ మంత్ర అనుభవం నువ్వు సక్రమమార్గంలో ఉన్నావనే సూచిస్తూ ఉంది. అది శుభలక్షణమే. మంత్రం శబ్దబ్రహ్మం కదా! శిష్యుడు : ఇష్టదేవతా ధ్యానం ఎలా ప్రారంభించాలి స్వామీ? స్వామి : మొట్టమొదట ఇష్టదేవత పాదపద్మాలకు ప్రణమిల్లాలి. పిదప ధ్యానం మొదలు పెట్టాలి. ఇంతకు ముందు చెప్పినట్లు ధ్యానంతోబాటు జపం కూడ చేయాలి. మంత్రం అనేది ఆధ్యాత్మిక శక్తితో కూడుకొన్నది. సాధన చేస్తూన్నకొద్దీ దాన్లోని ప్రభావం నీకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. (రాబోయే ప్రకరణం చూడండి) శిష్యుడు : స్వామీ! భగవంతునిలో మనస్సు లగ్నం చేయడమంటే? స్వామి : నియమం తప్పక ధ్యానించడం. వేకువజాము ధ్యానానికి అనువైన తరుణం. ధ్యానానికి ముందు భక్తి ప్రబోధకాలైన స్తోత్రాలు పఠించు. మనస్సును భగవంతునిపై నిలపడానికి ఈ పద్ధతి నీకు సహాయపడుతుంది. ధ్యానానంతరం కనీసం ఒక అరగంట సేపన్నా నిశ్చలంగా కూర్చో. ఎందుకంటే ధ్యాన సమయంలో నువ్వు ఆశించిన ఫలితం కలుగకపోవచ్చు. ధ్యానానంతరం నువ్వు విశ్రాంతిగా ఉన్నప్పుడు, నీ మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికానుభవాలు అవగతమవుతాయి. కనుక ధ్యానం పూర్తికాగానే లోకాభిరామాయణంలో పడటం గాని, లౌకిక చింతనల్లో పడి కాలయాపన చేయడం గాని తగదు. అది ఎంతో హానికరం కూడ. గట్టిగా ప్రయత్నించి సాధన చెయ్యి. ఇష్టం లేకున్నప్పటికీ నీ సాధన క్రమాన్ని వీడకు. కేవలం యాంత్రికంగా, అనాలోచితంగా సాధన అనుష్ఠించినప్పటికీ ఎంతో కొంత ప్రయోజనకరంగానే ఉంటుంది. నిత్యం జపానికి కనీసం రెండు గంటలైనా వినియోగించాలి. రమణీయ ప్రకృతిలో, ఏకాంతస్థలంలో ఏ ఆలోచనా లేకుండా ఊరకే కూర్చున్నప్పటికీ లాభదాయకమే. శిష్యుడు : ఇష్టదేవతను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఇతర దేవతామూర్తులు గోచరమైతే ఏం చేయాలి స్వామీ? స్వామి : దాన్నీ ఒక శుభలక్షణంగా ఎంచాలి. నీ ఇష్టదేవతే వివిధ రూపాల్లో గోచరిస్తూన్నట్లు గ్రహించాలి. ఏకమూ అనేకమూ కూడ ఆయనే అని అర్థం చేసుకోవాలి. 
నీ ఇష్టదైవాన్ని ధ్యానించే వేళ మరో రూపం కనుక గోచరమైతే ఆ దివ్యదర్శన భాగ్యం కలిగినందుకు సంతోషించాలి. క్రమంగా సమస్త రూపాలు, కళలు ఇష్టదైవ స్వరూపంలో లీనమౌతూన్నట్లు చూడగలవు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, తదితర పర్వదినాలన్నీ సాధనకు అనుకూలమైన దినాలు. కాబట్టి అట్టి పర్వదినాలలో జపధ్యానాలకు మరింత సమయం వినియోగించు. 
శిష్యుడు : స్వామీ! భగవద్ధ్యానానికి ముందు గురుపూజ చేయాలని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి కదా! గురుపూజా విధానం ఎలాంటిది స్వామీ? స్వామి : గురువు, దైవం ఒక్కరేనని భావించి మొదట గురువును ధ్యానించు. తరువాత గురుస్వరూపాన్ని నీ ఇష్టదేవతా స్వరూపంలో లయం చేసి జపధ్యానాదులు కొనసాగించు. (గత అధ్యాయం చివరన చూడండి) 
శిష్యుడు : స్వామీ! పితృసేవ చేయమని సదా మీరు వక్కాణిస్తూ ఉంటారు కదా! కాని 
సన్న్యాసినై మిమ్మల్ని సేవించుకోవడం అంతకంటే ఉత్తమం కదా! స్వామి : కావచ్చు కాని 
కేవలం కాషాయవస్త్రధారణ మాత్రాన నువ్వు సన్న్యాసివి కాగలవా? వ్యాధిగ్రస్తుడైన నీ తండ్రికి సేవచేయడం నీ కర్తవ్యం. మొదట నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. దానితోబాటు నియమబద్ధమైన నీ సాధనలను కూడ కొనసాగించు. పితృసేవకూడ నీ ఆధ్యాత్మిక వికాసానికి చేదోడవుతుంది నాయనా! 18. నిష్టాపరుడవు కమ్ము! - స్వామి : నీకు ధ్యానంగాని, ప్రార్థనగాని చేసే అలవాటు ఉందా నాయనా? శిష్యుడు : లేదు స్వామీ? స్వామి : ప్రతి రోజు కొంత సమయాన్ని భగవత్పరమైన విషయాలకై వినియోగించడం మంచిది. భగవన్నామ జపం, సంకీర్తనం, ధ్యానం, మనోనిగ్రహం, మనశ్శాంతి వల్లనే సాధ్యపడతాయి. వీటిని మించి మరో మార్గం లేదు. శిష్యుడు : : ఆ ధ్యానాదుల ఆచరణ విధానం గురించి దయచేసి తెలుపండి స్వామీ? స్వామి : నీ హృదయమనే గుహాలయంలో భగవంతుని ప్రతిష్ఠించుకొని ధ్యానం చెయ్యి. లేదా సర్వమయుని చిన్మయరూపం నీ ఎట్టఎదుట ఉన్నట్లు భావించి ధ్యానించు. అదే మానసపూజ. ఆలయంలో అర్చకుడు ధూపదీప నైవేద్యాలు స్వామికి సమర్పిస్తూ ఏ రీతిలో పూజిస్తాడో అదే తీరులో నీ మనస్సున నిలిపిన అర్చామూర్తిని సేవించుకో. కాలాన్ని అనవసర విషయాలలో వ్యర్థం చేయకు. ఈ రోజే, ఈ క్షణంలోనే పూజ ప్రారంభించు. ఉదయ సాయం సమయాల్లో జపధ్యానాదులు అనుష్ఠించు. కనీసం రెండేళ్ళపాటు సాధన చేస్తే మహదానందాన్ని పొందగలవు. భావపారవశ్యంలో మునిగిపోగలవు. జ్ఞానదృష్టిని సంతరించుకోగలవు. రెండేళ్ళ నిరంతర సాధన వల్ల కొంత ఫలితం తప్పక అందుతుంది. కొందరు ఒక్క ఏడాది వ్యవధిలోనే ఆశించినంత ఫలితాన్ని సాధించగలుగుతారు. అయినా సాధన మానరాదు. కొంతకాలం గడిచాక ధ్యానాన్ని విడువలేనంతటి అనుబంధం పెనగొని తద్వారా అంతులేని ఆనందం కలుగుతుంది. ధ్యానం వేళ కూర్చోడానికి ఒక ఆసనాన్ని అమర్చుకో. దాని మీద నిటారుగా కూర్చోవాలి. ఎడమ అరచేతి మీద కుడి అరచేతిని ఉంచి, ఆ చేతులను ఎత్తి హృదయం చేరువన నిలపాలి. పవిత్ర గ్రంథాలను చదువుతూ ఉండాలి. ధ్యానానికి కూర్చోగానే సాధన నిష్టాపరుడవు కమ్ము! ప్రారంభించరాదు. మొదట కాస్సేపు ఇతర భావాలనన్నిటిని వైదొలగించి మనస్సును భావరహితంగా, శుచి ప్రదేశంగా రూపొందించాలి. ఆ పిదపే ధ్యానం ఆరంభించాలి. మొదట్లో రెండేళ్ళపాటు ఇలా కాస్త శ్రమగానే ఉంటుందిగాని పోనుపోను సులభతరమవుతుంది. సమయం చిక్కినప్పుడల్లా ధ్యానం చేసుకోవచ్చు. పని ఒత్తిడి ఉన్న వేళ యథాశక్తిని ధ్యానించి, ఆ దేవదేవునకు ప్రణామాలర్పించు. ధ్యానం మాత్రం మానరాదు. ప్రత్యేక సందర్భాలలో, ఎంతో పనివల్ల తీరికలేని నాడు మాత్రమే. ఈ క్షణకాల ప్రార్థన. అంతేకాని ఎప్పుడూ కాదు సుమా! ధ్యానానికి కూర్చునే ముందు కాళ్ళు చేతులు ముఖం ప్రక్షాళన చేసుకో. సదా సత్యమే పలుకు. స్త్రీలనందరినీ జగన్మాతృ స్వరూపిణులుగా భావించాలి. ఈ రెండు నియమాలను ఎంతో జాగ్రత్తగా పాటించాలి. వీటిని పాటించగలిగితే ఇతర నియమాలన్నిటినీ అవలీలగా పాటించవు. నీ మనస్సు భగవంతునిపై కేంద్రీకరించు. భగవంతుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడా లేడా అని సందేహించకు. దేవుడు ఉన్నాడు. నా మాట విశ్వసించు. 
 19. భగవంతునిపై మనస్సు నిలుపు  మనస్సును సతతం భగవంతునిపై లగ్నం చెయ్యి. అప్పుడు నీలో ఉన్న దురాలోచనలన్నీ సమసిపోతాయి. నిత్యపూజకు విడిగా ఒక గదిని ఏర్పాటు చేసుకో. ఉదయ సాయంకాలాల్లో ఆ గదిని ఉపయోగించు. నియమానుసారం నిత్యం యథాశక్తి మేరకు జప ధ్యాన ప్రార్ధనలు ఆచరించు. భగవత్పరమైన విషయాల్లో నువ్వెంత సమయం వినియోగిస్తే అది నీ జీవితానికి అంత ఫలప్రదమని తెలుసుకో. నిస్సారమైన సాంసారిక విషయాలలో చిక్కుకుంటే, నీకు మనశ్శాంతి కరువవుతుంది. అందుకే తన అనంత కృపాకటాక్షంతో నిన్ను సన్మార్గగామిని చేయమని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను. చూడు నాయనా! భగవద్ధ్యానం చేయనిదే నీకెన్నటికీ మనశ్శాంతి కలుగదు. నిజమైన శ్రద్ధ భక్తి జ్ఞానం అనేవి ఎంతో కాలం నువ్వు నియమంగా చేసే సాధనకు ప్రతిఫలాలన్నమాట. భగవంతునిపై మనస్సు నిలుపు కొందరు నిలకడలేని వైరాగ్యంతో సాధనలు అనుష్ఠించి భగవత్కృపను పొందలేక, బ్రహ్మానందం లభ్యంకాక భగవద్విషయంలో సంశయాత్ములు అవుతూ ఉంటారు. అందుకు కారణం అలాంటి వారికి భగవద్విషయంలో నిజమైన, నిశ్చలమైన భక్తి, తాదాత్మ్యాలు కొరవడినవని తెలుసుకోవాలి. వారికి నియమబద్ధమైన సాధనానుష్ఠానం లేదని ఇప్పుడు స్పష్టమైంది కదా! దివ్యప్రేమానురాగాలు చిగురించని మనస్సు శుష్కమై నొందుతుంది. భగవత్ప్రప్తికై ఎంతగా పరితపిస్తావో చివరకు ఆ మేరకు శాంతి చేకూరుతుంది. 'సంతోషంగా నువ్వు దీక్ష పూనితే మధ్యన ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం తప్పదు సుమా!' అనేవారు శ్రీరామకృష్ణులు. కాబట్టి సాధనల్లో నిమగ్నుడవై వాటిని దీక్షతో సాగించు, ప్రాణాపాయం వాటిల్లినా బెదరిపోవద్దు. త్యాగాగ్ని రగుల్కోనిదే హృదయంలో భగవచ్చింతనను ప్రేరేపించడం సాధ్యం కాదు. ఈ త్యాగాగ్ని, వైరాగ్యాగ్ని అనేవి హృదయంలో ఎంతగా రగుల్కొంటే మనిషి అంతటి శాంతిని పొందగలగడం తథ్యం. శ్రీరామకృష్ణులను మూర్తీభవించిన వివేక వైరాగ్యాలుగా మేం కళ్ళారా చూశాం. కాలక్రమాన ఆయన తత్త్వం మనకు విశేషంగా అవగతమవుతుంది. చూడు నాయనా! నువ్వు అనుష్ఠిస్తున్న సాధనలను గోప్యంగా ఉంచాలే గాని, బయటకు వెల్లడించరాదు. పరమార్థంగాని, అంతరార్థంగాని అంతరంగంలో ఉన్నవే గాని బాహ్యంలో లేవు. భగవంతుడు అనంతుడు, అక్షయుడు అని తెలుసుకో. అందుకు దృష్టాంతాలే హిమాలయాలు, సాగరాలు, నీలాకాశమూ. భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు జనించని నాడు, బ్రహ్మపదార్థంలోగాని, ఆముష్మికాదులలోగాని నీకు విశ్వాసం కలుగని నాడు నిజమైన శీలం రూపొందదు, నీ నడతకు కుదురు, గుర్తింపు ఉండవు. గ్రంథ పఠనం చేసినంత మాత్రాన ఇంద్రియ నిగ్రహమూ, కామవిజయమూ చేకూరుతాయా? వట్టిది, అది గగన కుసుమం. కుండలినీశక్తి అధోగామియై ఉన్నంత వరకు మనస్సు నిమ్నస్థానాలకు సంబంధించిన విషయాలను పట్టుకొని ప్రాకులాడుతూ ఉంటుంది. కాని కుండలినీ శక్తి ఊర్ధ్వగామియైనప్పుడు మనస్సు ఆధ్యాత్మిక విషయాభిముఖంగా పయనిస్తుంది. మనశ్శాంతి పొందుతూన్నకొద్దీ మనిషి భగవద్దర్శనోత్కంఠుడై భగవంతుని ధ్యానసంకీర్తనలలో విశేషంగా మగ్నుడై బ్రహ్మానందం గ్రోలుతూ ఉంటాడు. సాధకుడు బుద్ధునిలా ధైర్యసాహసోపేతుడై ఉండాలి, నాయనా! ఆయన ఎంతటి అపూర్వ పరిత్యాగం ఒనరించాడు! భగవత్సాక్షాత్కారార్థం తన రాజ్యసుఖాలను అన్నిటినీ తృణప్రాయంగా విసర్జించాడు కదా! ఎంత కఠోర తపస్సు ఆచరించాడు. చివరికి ఎంత ఉగ్ర తపస్సు ఆచరించినా సాక్షాత్కారం కలుగకపోయేసరికి గయలోని పావన నీరాజనా నదిలో స్నానం ఆచరించి, “ఈ శరీరం శిథిలమైపోయినా సరే, ఆత్మబోధ జనించకుండా ఇక్కడ నుంచి కదలను” అని ప్రతిజ్ఞచేసి మరీ ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. అంతే, జ్ఞానోదయమైంది. '' 1. “ఇహాసనే శుష్యతు మే శరీరం త్వగస్థిమాంసం నిలయం చ యాతు అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభం నైవాసనాత్ కాయ మతశ్చలిష్యతే.” చర్మం, ఎముకలు, మాంసానికి ఆవాసమైన నా ఈ శరీరం ఇక శుష్కించుగాక. ఎన్నో జన్మలకు దుర్లభమైన ఆత్మదర్శనం పొందనిదే ఈ శరీరం కదల్చబడదు.

No comments:

Post a Comment

#చింతన#గీతాజయంతి_సందర్భంగా_గీతామృతస్నానం#DR_VAISHNAVANGRI_SEVAK_DAS #9821914642

  చింతన  -  గీతా  జయంతి సందర్భంగా .. గీతామృత  స్నానం ' సకృద్  గీతామృత స్నానం సంసార మలనాశనం '    అని  ' గీతా  మహాత్మ్యం '  పల...