Thursday, July 20, 2023

నమస్తే తెలంగాణ కుల దూషణను నిలదీయాలె! - వెంకట్ గుంటిపల్లి 949494100

కులాల పుట్టుపూర్వోత్తరాలు ఏవైతేనేమి ఈ రోజుల్లో కుల దురహంకార వ్యాఖ్యల్ని ఎవరూ సహించరు. మా కులమే గొప్ప అని ఎవరైనా అంటే ఆ కులం వారే హర్షించరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న కులదూషణలు వివాదాస్పదమవుతున్నాయి. దళిత, బహుజన వర్గాలవారు ఆయన తీరుపై మండిపడుతున్నారు. కులాలను దూషణలుగా ఉపయోగించే ధోరణికి అందరూ దూరం జరుగుతున్నారు. కులాలను ఎక్కువ తక్కువగా చేసి చూడొద్దనే విషయంలో స్థూలంగా అంగీకారం వ్యక్తమవుతున్న రోజుల్లో ఎవరైనా మా కులమే గొప్ప అనే ఆధిపత్య ధోరణిలో పోతే ఏం జరుగుతుంది? ఆ పని రాజకీయ నేతలు చేస్తే జనం ఊరుకుంటారా? ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేవలం తన కులమే గొప్ప అని చెప్పుకుంటూ మిగతా కులాలను కించపరిచే విధంగా మాట్లాడటం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ పార్టీ పట్ల, ఆ నేత పట్ల బీసీ, ఎంబీసీ సమాజంలో వెగటు కలుగుతున్నది. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పదే పదే బీసీ, ఎంబీసీ, సంచార జాతుల కులాల పేర్లు దూషణలకు వినియోగించడం పరిపాటి అయింది. ప్రతి తిట్టులో వెనుకబడిన కులాల పేర్లు తీసి ఆయా సామాజిక వర్గాలను మానసికంగా వేధించడం అలవాటుగా మారింది. నీ కులం గురించి నువ్వు గొప్పలు చెప్పుకో.. కానీ మిగతా కులాల పట్ల చిన్నచూపును, కుల వివక్షను ప్రదర్శించడాన్ని ఎలా చూడాలి? ఒక మంత్రి లేదా శాసనసభ్యుడు రాష్ట్ర ప్రజలందర్ని ఉద్దేశించి అందరికీ సమాన పరిపాలన అందిస్తానని, కుల, మత భేదాలు చూపనని రాజ్యంగం మీద ప్రమాణం చేస్తాడు. కానీ, సదరు ప్రజాప్రతినిధి కేవలం కులదృష్టితోనే మాట్లాడితే ఏమనాలి? రాజకీయాలు, పాలన, కుల ఆధిపత్య ధోరణి కాసేపు పక్కన పెడితే రేవంత్రెడ్డి ప్రతి సందర్భంలో బీసీ, ఎంబీసీ కులాలను మాత్రమే ఎందుకు కించ పరుస్తున్నారు? మరి ఆ కులాలకు ఆత్మాభిమానం ఉండదా? అందుకే ఆయా కులాల నుంచి రేవంత్కు ప్రతిఘటన ఎదురవుతున్నది. ఇలాంటి నేతను ముందు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లెందుకేయ్యాలె అన్న చర్చ అనివార్యమైంది. యాదవులు పేడ పిసుకుతుంటారని కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో పాటు యాదవ సామాజికవర్గాన్ని ఆకులం నుంచి ఎదుగుతున్న నాయకత్వం పట్ల రేవంత్ కారుకూతలు కూశారు. దీనికి గొల్లకుర్మలు తమ స్వాభిమానాన్ని చాటుకునే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దున్నపోతులతో వివిధ రూపాలలో నిరసన తెలిపారు. బలహీనవర్గాల వృత్తులను అవమానించడం తప్పని రేవంత్ కు అర్థం చేయించేందుకు ప్రయత్నించారు. యాదవులు శ్రీ కృష్ణుడి సంతతికి చెందిన వారని, ఉత్తరాదిన దైవంతో ఆ సామాజికవర్గాన్ని పోల్చుకుంటారు. తెలంగాణ బీసీల్లో యాదవులది రెండో స్థానం. ఒక క్యాబినెట్ మంత్రి, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక రాజ్య సభ, ఎమ్మెల్సీ సభ్యులు, ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు, ఒక ఫైనాన్స్ కమిషన్ సభ్యుడితో పాటు ఆ సామాజిక వర్గం నుంచి ఇంకా ఎందరో రాజకీయంగా ఎదుగుతు న్నారు. ఉత్పత్తి, శ్రామిక కులంగా ఉన్న గొల్లకుర్మలు ఇవాళ తెలంగాణ గొర్రెల ఉత్పత్తిలో, మాంసం ఎగుమతిలో, వ్యవసాయంలో దేశంలోనే టాప్ గా నిలుస్తున్నారు. ఆ కులాన్ని, ఎదుగుతున్న నేతల పట్ల అగ్రవర్ణ దురహంకారంతో అసభ్యంగా మాట్లాడిన ప్రతిసారి వారు తమదైన శైలిలో నిరసన తెలుపుతున్నారు. ఇక ప్రధానంగా ఇటీవల రేవంత్ రెడ్డి సంచార జాతుల పదాలను తిట్ల పదాలుగా వాడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పిచ్చకుంట్ల కులాన్ని తిట్టుగా వాడుతూ ఘోరంగా అవమానించారు. ఆయన ఈ కులం పేరును ప్రతిసారి వాడి కనీసం విచారం వ్యక్తం చేయకుండా కరడు గట్టిన దురహంకారంతో వెళ్తున్నారన్న భావన ఆ సామాజికవర్గంలో ఉంది. గత కొన్నేండ్లుగా రాజకీయ పార్టీలు పిచ్చకుంట్ల (పి చ్చుక కుంట్ల) కులం పేరుతో తిట్లు తిడుతున్నారని అనేక సందర్భాలలో నిరసన వ్యక్తం చేసిన నోరులేని ఆ బిడ్డలు ఏకంగా తమ కులం పేరును వంశరాజులుగా మార్చుకున్నారు. వంశరాజుల పేరుతో ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. ఆ తర్వాత గంగిరెద్దుల అనే కులం పేరును తరుచూ వాడుతున్నారు. సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా లోగిళ్లలో సంప్రదాయ బద్ధంగా బసవన్నలతో కనిపించే గంగిరెద్దుల వారిని కూడా తిట్ల పదాలుగా వాడి తమ అగ్రకుల అహంకారాన్ని చాటుతున్నారు. తెలంగాణలో గంగిరెద్దులు సంచారం చేయవద్దని ఆత్మగౌరవంతో బతుకాలని తెలంగాణలో వారికి ప్రత్యేకంగా ఇండ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా గతంలో, ఇప్పుడు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు బీసీ రుణాలు అందిస్తోంది తెలంగాణ సర్కార్. అదేవిధంగా దొమ్మరుల కులం పేరుతో ఉదాహరణలు ఉటంకిస్తూ చెలరేగిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దొమ్మరులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇక ట్రాన్స్ జెండర్లను కూడా రేవంత్ వదలలేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 21, భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 504, అలాగే లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టంలోని సెక్షన్ 18-డీ రేవంత్రెడ్డి ఉల్లంఘిస్తున్నారని ఆ సంఘ రాష్ట్ర నాయకత్వం నిరసన వ్యక్తం చేస్తున్నది. ఇలా పేదలను తూలనాడే అగ్రకుల ఆధిపత్య అహంకారం పట్ల బీసీ, ఎంబీసీ, సంచారజాతుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఓ కులసంఘం నాయకుడిగా ఎలా మాట్లాడుతారు? రెడ్లే పాలించాలని ఆ సామాజిక వర్గంవారు సైతం ఆమోదించని రీతిలో ప్రకటనలిస్తున్నారు. ఇతర కులస్తులను దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందని చరిత్రకు కుల విద్వేషాలు అంటగడుతున్నారు. అంటే ఆయన సెక్యులరేనా లేక ఆయన పార్టీ సెక్యులర్ పార్టీ యేనా? అన్నదానిపై బీసీ సంఘాలు చర్చిస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్లోని ఈ ధోరణి వల్ల మెజారిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్తున్నారు. మిడిమిడి జ్ఞానమున్న రేవంత్ వంటి నేతల పెత్తనాన్ని భరించలేక ఆ పార్టీలోని బీసీలు ఒక్కటై బీసీల ఆత్మాభిమానం దెబ్బతీయొద్దంటూ మీడియాకెక్కిన వాస్తవాన్ని గమనిస్తున్నాం. నిజానికి కాంగ్రెస్ విధానాల పట్ల బీసీ, ఎంబీసీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అరవై ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎంబీసీ, సంచార జాతులకు ఏం చేసిందో చర్చ పెట్టాలి. బీసీ కులగణన, సంచార జాతుల రిజర్వేషన్, ఓబీసీ వర్గీకరణ ఇత్యాదివన్నీ కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయిందన్న వాస్తవాలను జనాలకు విడమరిచి చెప్పాలి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సబ్బండ వర్ణాలు స్వాభిమానంతో వృత్తులను పరిరక్షించుకుంటూ ఆర్థిక ప్రగతిని సాధిస్తున్న వేళ దుష్ట కాంగ్రెస్, రేవంత్ లాంటి కుల దురహంకార నాయకత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. (వ్యాసకర్త: రాష్ట్ర ఎంబీసీ అధ్యక్షుడు)

No comments:

Post a Comment