Wednesday, July 26, 2023

ధ్యాన పోరాటం

ధ్యాన పోరాటం శిష్యుడు : స్వామీ! ఎంత ప్రయత్నించినా నా మనస్సు స్థిరంగా ఉండడం లేదు. అది నిలకడగా ఉండాలంటే ఏం చేయాలి? దాన్నెలా నియంత్రించాలి? దయచేసి చెప్పండి. స్వామి : నియమంగా జపధ్యానాదులు అనుష్ఠించడమే మార్గం. ఒక్కరోజు కూడ మానరాదు సుమా! అల్లరి పిల్లవాని వంటిది మనస్సు, నిమిషం ఊరకే ఉండదు. అందుకని నీ ఇష్టదైవంపై మనస్సును తరచులగ్నంచేసి దాన్నిఅదుపులో ఉంచడానికి ప్రయత్నించు. ఇలా చేయగా చేయగా నీకు భగవధ్యానంలో ఆసక్తిజనిస్తుంది, దాన్లో నిమగ్నుడవవుతావు. అలా రెండు మూడేళ్ళ పాటు సాధన సాగిస్తే అపరిమిత ఆనందాన్ని అనుభవించగలవు. అప్పుడు మనస్సు స్థిరపడుతుంది. ప్రారంభ దశలో జపధ్యానాలు నిస్సారంగా, నీరసంగా కనిపిస్తాయి. చేదు ఔషధంలా వెగటు అనిపిస్తుంది. బలవంతంగా భగవచ్చింతన అనే అరఖు (ద్రవరూప ఔషధం) నీ మనస్సుకు పట్టాలి. దీక్షబూని సాధన సాగించేకొద్దీ ఆనందం అతిశయిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణుడవడానికి విద్యార్థి ఎన్నిపాట్లు పడతాడో, మనస్సులో ఎంత బాధపడతాడో కదా! కాని అంతబాధను అనుభవించకుండానే భగవంతుని తెలుసుకోవచ్చు. ఎప్పుడంటావా? మనసారా భగవంతుని ప్రార్థించినప్పుడు. శిష్యుడు : స్వామీ! మీ మాటలు మాకెంతో ప్రోత్సాహదాయకంగా ఉంటాయి. కాని నేనే ప్రయత్నించినా ఎలాంటి మనోవికాసం కానరావడం లేదు. అంతా ఏదో మిథ్యగా కానవస్తున్నది. నిరాశ నన్ను ఆవరించింది. ఏం చెయ్యమంటారు? స్వామి : నేను అంగీకరించను. నిరాశకు తావు లేదు. భక్తి ఉన్నా లేకపోయినా జపం చేస్తే ఫలితం కనబడి తీరుతుంది. క్రమంగా భక్తి జనిస్తుంది. నియమం తప్పక సాధన కొనసాగించు; నీకు ఎంతో మనశ్శాంతి చేకూరుతుంది. అంతేకాదు, ధ్యానం వల్ల ఆరోగ్యం కూడ బాగుపడుతుంది. ఆరంభంలో ధ్యానం, మనస్సుతో పోరాడుతూన్నట్లు అనిపిస్తుంది. గట్టిగా ప్రయత్నించి చపల చిత్తాన్ని 'నియంత్రించాలి. దాన్ని భగవంతుని పాదారవిందాలపై నిలపాలి. ప్రారంభదశలో ధ్యాన సమయాన మెదడుకు లేనిపోని ఒత్తిళ్ళు లేకుండా జాగరూకతతో ఉండాలి సుమా! నిదానంగా పురోగమించండి, క్రమంగా తీవ్రతరం చెయ్యండి. నియమపూర్వక సాధన వలన మనస్సు కుదుటపడి, నిలకడ చెంది ధ్యానం సులభతరమౌతుంది. అప్పుడు గంటల పర్యంతం ధ్యానంలో నిమగ్నుడవైనా నీకు ఏ ఇబ్బంది కనిపించదు. గాఢనిద్ర నుంచి లేచాక అలసట తీరి మనశ్శరీరాలకు ఆహ్లాదం కలిగే రీతిలో ధ్యానానంతరం నీకెంతో హాయిగా ఉండటమేకాక అపరిమిత ఆనందాన్ని చవిచూస్తావు. మనశ్శరీరాలు రెండూ పరస్పర సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి. శరీరానికి బాధ కలిగితే, మనస్సుకు కూడ బాధ జనిస్తుంది. అందుకని శరీరారోగ్యాన్ని కాపాడు కోవాలంటే ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధకుడు ఎన్నడూ కడుపారా తినరాదు, అర్ధాకలితో ఉండాలి; సగపాలే భుజించాలన్నమాట. ధ్యానం అనుకొన్నంత తేలిక కాదు. మితిమీరి ఆరగిస్తే భూక్తాయాసం వల్ల మనస్సు అదుపు తప్పుతుంది. కామక్రోధాదులను నియంత్రించనిదే మనస్సుకి స్థిరత్వం ఉండదు. పరిపరి విషయాలకోసం పరుగులెత్తే మనస్సుతో ధ్యానం కుదరదు అలాంటప్పుడు ఎలా ధ్యానించగలవు? అందుకే కఠోర నియమనిష్ఠలను పాటించాలి. నియమ నిష్ఠలంటే ఉగ్రమైన శారీరక తపశ్చర్యలు గాని, శారీరక హింసగాని కానే కాదు. కామక్రోధాదులను జయించడమే నిజమైన తపస్సు. ('తపస్సు' అధ్యాయం చూడండి) ప్రబలమైన ఎలాటి కోర్కెనుగాని, ఉద్వేగాన్ని గాని తలెత్తనివ్వకూడదు. ధర్మం, పరమార్థం అన్నవి నపుంసకుని కోసమో లేక కామాదుల నివారణకై శరీర జవసత్త్వాలుడిగిన వ్యక్తి కోసమో ఉద్దేశింపబడినవి కావని సదా గుర్తుంచుకో. ధ్యానం చేయకుండా మనస్సును నిగ్రహించలేవు. నిగ్రహశక్తిలేని మనస్సుతో ధ్యానించనూ లేవు. 'మొదట మనస్సును నియంత్రింప నేర్వనివ్వండి, ధ్యానం సంగతి పిదప చూసుకోవచ్చులే' అనుకొన్నావో, పారమార్థిక జీవితానికి ఇక అసలు అంకురార్పణే జరగదని చెప్పాలి. అందుకే మనస్సును కుదుట పరచుకోవడం, ధ్యానించడం ఏకకాలంలో జరగాలి. అదే పద్ధతి. ధ్యానానికి కూర్చునే ముందు మనస్సులోని ఉబలాటాలను, కోర్కెలను కేవలం కలలో విషయాలుగా భావించు. అవన్నీ వట్టివి, వాటికిక మనస్సులో స్థానం లేదనుకో, వాటిని మనస్సులో చొరనివ్వకు. అప్పుడు నీ మనస్సు నిర్మలంగా ఉంటుంది. ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు దివ్యతేజస్సును గాంచవచ్చు, లేదా ప్రణవనాదాన్ని ఆలకించవచ్చు. అలాంటి దివ్యానుభూతులెన్నో కలుగవచ్చు. అంతమాత్రానే వాటి పైనే నీ దృష్టిని కేంద్రీకరించరాదు. నువ్వు సక్రమ మార్గంలో ఉన్నావన్నందుకు అవి సూచనలు మాత్రమే, అంతకుమించి మరేమీ కావు. భగవత్సాక్షాత్కారం పొందగోరితే పట్టుదలతో, ఓరిమితో సాధన సాగించు. సకాలంలో సాక్షాత్కారం లభిస్తుంది, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. 'తరుణం చూసి కాని తల్లి పక్షి గుడ్డును పొదుగదు’ అనేవారు శ్రీరామకృష్ణులు. ఓర్పు ఉండాలి, తొందరపడి ప్రయోజనం లేదు. ప్రయత్నించాలి, వేచి ఉండాలి. ఎదురుచూడాలంటె ఎంతో ఓర్పు ఉండాలి కదా! లేకుంటె ఎంతో భారంగా తోస్తుంది. అట్టే ఆశ, ఇట్టే నిరాశ కలుగుతుంటాయి. దుఃఖం, ఆనందం ఒకదాన్కొకటి వెన్నంటే ఉంటాయి. ఇలా రోజులు, నెలలు, ఏళ్ళు గడవగా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.

No comments:

Post a Comment

#చింతన#గీతాజయంతి_సందర్భంగా_గీతామృతస్నానం#DR_VAISHNAVANGRI_SEVAK_DAS #9821914642

  చింతన  -  గీతా  జయంతి సందర్భంగా .. గీతామృత  స్నానం ' సకృద్  గీతామృత స్నానం సంసార మలనాశనం '    అని  ' గీతా  మహాత్మ్యం '  పల...