27. సాధనలో ఒకే నియమావళి వర్తించదు
సాధన విషయంలో ఎల్లరకూ ఒకే తీరు బోధనలు
వర్తించవు. శిష్యుడి మనోభావాలను, వైఖరిని పరిశీలించి
తదనుగుణంగా గురువు బోధించవలసి ఉంటుంది.
కొన్ని సర్వసామాన్య నియమాల గురించి తప్ప
శిష్యుడు అవలంబించవలసిన ప్రత్యేక నియమావళి
గురించి గురువు అందరి ముందు ఉపదేశించరాదు.
శ్రీరామకృష్ణులు తమ ప్రతి శిష్యునికి ఏకాంతంలో అతడికి
అవసరమైన ప్రత్యేక ఉపదేశాలను ఎలా గోప్యంగా
బోధించేవారో స్వయంగా నేను చూశాను. అదే విధంగా
శిష్యుడు కూడ తన సాధనల పరమైన సంశయాలను
ఏకాంతంలోనే గురువుని అడిగి నివృత్తి చేసుకోవాలి.
ఆ సంగతి అలా ఉంచు. సర్వులూ సామాన్యంగా
పాటించవలసిన కొన్ని నియమాలను తెలుపుతాను విను.
మొదటిది : భగవంతుడు ఉన్నాడని ప్రగాఢ విశ్వాసం కలిగి
భగవత్సాక్షాత్కారమే పరమ గమ్యమని
దృఢనిశ్చయంతో ఉండాలి. బ్రహ్మజ్ఞానం వలననే
అమరత్వమూ, అఖండానందమూ పొందగలుగుతారు. ఆ
పైన సమస్త సంశయాలు తొలగిపోతాయి.
రెండవది: బ్రహ్మచర్యం పాటించడం. కఠోర
బ్రహ్మచర్యం పాటించనిదే పరమార్థ ప్రయోజనం
ఒనగూరదు; పరమ పురుషార్థ సిద్ధికైన నియమావళినీ
ఆచరించలేరు. 'మనశ్శరీర మస్తిష్క పోషణకు, వాటి
పరిపూర్ణ వికాసానికి బ్రహ్మచర్యం అత్యవసరం. '
బ్రహ్మచర్యం పాటించే వ్యక్తిలో ఒక ఆధ్యాత్మిక నాడి
పెంపొందుతుంది. అందువల్ల అతడి ధారణాశక్తి, ఆధ్యాత్మిక
విషయ గ్రహణశక్తి, భగవద్విశ్వాసం పురోభివృద్ధి
చెందుతాయి. ఇంద్రియాతీతమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని
అతడు అనుభూతి చేసుకోగలడు. బ్రహ్మచర్యాశ్రమాన్ని
గురించి మతాచార్యులు అంతగా నొక్కి వక్కాణించడానికి
కారణం ఇదే.
మూడవది: ఆహార నియమం. తేలికగా
జీర్ణమయ్యేది, పౌష్టికమైనది అయిన ఆహారాన్నే
తీసుకోవాలి. ప్రాలుమాలును పురిగొల్పే, శరీరానికి
సరిపడుతుందా లేక వికటిస్తుందా అనే సంశయంలో
పడవేసే ఆహారాన్ని విడిచిపెట్టాలి. సూర్యాస్తమయ
అనంతరం స్వల్పంగా ఆహారం పుచ్చుకోవాలి. ధ్యానానికి
అనువుగా ఉండటానికి మనస్సును ప్రశాంతంగా
ఉంచుకోవాలి కదా! 'శరీర మాద్యం ఖలు ధర్మసాధనమ్'
అన్నారు. అందుకు తగ్గట్లు ఆరోగ్యదాయకమైన ఆహారాన్నే
స్వీకరించాలి. సాధన విషయంలో ఆరోగ్యం ఎంతో ముఖ్యం
కదా! నువ్వు అనుష్ఠిస్తూన్న సాధనలను బాహాటం చేయకు;
గోప్యంగా ఉంచు.
ప్రాతఃకాలం, సాయం సమయం, సంధ్యాకాలాలు,
అర్థరాత్రి ధ్యానప్రార్థనలకు ఎంతో అనువైనవి. పగటి వేళ
అనేక చిత్త విక్షేపాలు కలుగుతుంటాయి; నిలకడ ఉండదు.
రాత్రివేళ ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది.. అందుచేత
రాత్రివేళ ధ్యానాదులకు ఎంతో అనుకూలంగా
ఉంటుందంటారు. అర్ధరాత్రివేళ అయితే స్వల్ప
ప్రయత్నంతోనే మనస్సు భగవంతుని మీద లగ్నమైపోతుంది.
శ్రీరామకృష్ణులు ఎన్నడూ రాత్రివేళలు నిద్రలో
గడిపేవారు కాదు. అంతేకాదు తమ బాలక శిష్యులను
సైతం ఎక్కువసేపు నిద్రపోనిచ్చేవారు కాదు. ఇతరులు
నిద్రలో ఉన్నప్పుడు, ప్రశాంతమైన ఆ అవకాశం చూసి
తమ శిష్యులను మేల్కొలిపేవారు. వారికి ప్రత్యేకమైన,
విశేషమైన ఉపదేశాలు చేసి పంచవటికిగాని,
కాళికాలయానికి గాని, శివాలయాలకు గాని వెళ్ళి
ధ్యానించమని పంపేవారు. గురూపదేశానుసారం వారు
రాత్రంతా ప్రార్థనాదులతో గడిపి వచ్చి, పగటి పూట
విశ్రాంతి తీసుకొనేవారు. ఈ తీరులో శ్రీరామకృష్ణులు
శిష్యులచే సాధనలు అనుష్ఠింపచేసి వారిని కృతార్థులను
గావించేవారు. “ముత్తెరగులవారు రాత్రిళ్ళు మేల్కొని
ఉంటారు; వారే యోగులు. భోగులు, రోగులు. మీరందరూ
యోగులు. కనుక రాత్రుళ్ళను మీరు నిద్రతో
గడిపివేయరాదు” అని తరచు ఆయన చెప్పేవారు.
మీరు యువకులు, బ్రహ్మానందాన్ని
చవిచూడవలసినవారు. తీవ్రంగా ప్రయత్నించండి,
నాయనలారా!
ఒక్కమారు ఆ దివ్యానందాన్ని అనుభవించారంటే,
ఆపైన మీకు భగవదేతర విషయాలన్నీ నిరర్థకంగా
తోస్తాయి.
28. సాధనలో అంతరాయం కలిగితే?
శిష్యుడు : స్వామీ! కొందరు హృదయకుహరంలోను,
మరికొందరు మస్తిష్కంలోని సహస్రారకమలంలోను
అంతర్ముఖులై ధ్యానిస్తారు. కాని నాకు బహిర్ముఖమైన
ధ్యానమే ఇష్టం. అంటే ఎట్టఎదుట మిమ్మల్ని
చూస్తున్నట్టుగానే నా ఇష్టదైవాన్ని చూడాలని నా కోరిక.
మీ దృష్టిలో సరి అయిన విధానం ఏదో సెలవియ్యండి స్వామీ!
స్వామి: ధ్యానం అన్నది సాధకుని వ్యక్తిగతమైన
మనోభావాలను బట్టి ఉంటుంది. సామాన్యంగా
హృదయాలయంలో ధ్యానించడమే ఉత్కృష్టమైనది. దేహమే
దేవాలయమని, దాన్లో దైవం ప్రతిష్ఠితుడై ఉన్నాడని భావించు.
ధ్యానమూలమైన ఏకాగ్రత కుదిరినప్పుడు సాధకుడు
ఏ ప్రదేశంలోనైనా భగవంతుణ్ణి ధ్యానించవచ్చు. ఏకాగ్రత
అంటూ కలగాలి. అప్పుడు భగవంతుడు తన ప్రక్కన,
తన వెనుక, హృదయస్థానంలో, లేదా మరేదో చోటనో
ఉన్నట్లుగా భావించి ధ్యానింపవచ్చు. మనస్సు ధ్యానంలో
మగ్నమై ఉన్నప్పుడు మొట్టమొదట దివ్యజ్యోతి దర్శనం
కలుగుతుంది. ఈ దివ్యదర్శనంతోపాటు వర్ణనాతీతమైన,
విలక్షణమైన ఒకానొక ఆనందానుభవం కలిగి, మనస్సు
ఆపైన దానిని విడిచి అవతలికి పోలేని స్థితి ఏర్పడుతుంది.
కాని సాధకుడు తన సాధనాపథంలో పురోగమిస్తే
ఇష్టదేవతారూపంతో మిళితమైన తేజో దర్శనం
కలుగుతుంది. అంతట మనస్సు దాన్లో లీనమైపోతుంది.
ఒక్కొక్కప్పుడు సాధకుడు దీర్ఘ ప్రణవనాదానుభూతి
పొందవచ్చు. మనస్సు అప్పుడు దానిలో లయిస్తుంది.
చెప్పపూనుకొంటే దివ్యదర్శనాలు, దివ్యానుభూతులు
కోకొల్లలు. నీ సాధనలో పురోగమించేకొద్దీ లెక్కలేనన్ని
దివ్యానుభూతులు పొందగలవు.
దివ్యతేజస్సును చూడగానే కొందరు భగవత్ర్పాప్తి
పొందామని భావిస్తారు. అది భ్రమ మాత్రమే; అలా
పొరబడకండి. సమస్త ద్వంద్వాతీతమైన నిర్వికల్ప సమాధి
స్థితిని పొందాలి. కొందరు నిర్వికల్ప సమాధి స్థితిని
ఆత్మానుభూతికి పరమావధిగా భావిస్తారుగాని, దానిని
ప్రారంభ దశగా నేను పరిగణిస్తాను.
శిష్యుడు : సామాన్యంగా కొంత వికాసం కలిగాక
మనస్సు ఆ మీదట పురోగమింప విరమిస్తుందనుకొంటాను.
అందుకు కారణం ఏమై ఉంటుంది స్వామీ?
స్వామి : అది మనోదౌర్బల్య లక్షణం. మనోశక్తి
స్వయంగా పరిమితం. కాని అందరూ ఒకే పరిమిత
మనోశక్తిని కలిగి ఉండరు. అయితే దానిని
పెంపొందించుకోవచ్చు. బ్రహ్మచర్యం పాటించినందున
మనోశక్తి వికాసం పొందుతుందని శ్రీరామకృష్ణులు
చెప్పేవారు. అటువంటి మనస్సు కామక్రోధాదులకు
అతీతమై ఉంటుంది. కామక్రోధాదులు ఆ మనస్సుకు
తృణప్రాయమైనవి.
ఆత్మవికాస మార్గాన అనేక అంతరాయాలు
కలుగవచ్చు. దుష్టశక్తులు కొన్ని నీ వికాసాన్ని
నిరోధించవచ్చు. అందుకే ముద్ర, భూతశుద్ధి మొదలైన
విధులు పూజాకలాపంలో పేర్కోబడ్డాయి.
శిష్యుడు : స్వామీ! మీరు మమ్మల్ని పిలిచి మా
ఆత్మవికాసాన్ని గురించి బోధిస్తూ, మా ఇబ్బందుల గురించి
విచారిస్తూ, మా పురోగతిని సూచిస్తూ మాకు ఇంతగా
స్ఫూర్తిని కలిగిస్తున్నారు కదా! ఇందువల్ల మీకు....?
స్వామి : ఆ, చూశావా, నా ఆలోచన ఎప్పుడూ
ఒకే తీరుగా ఉండదు. ఒక్కోసారి సాధనలు సాగించమని
మిమ్మల్ని బ్రతిమాలుకోవాలనిపిస్తుంది. మధ్య నేనెవరిని?
భగవంతుడే కార్యం, కారణం, కర్త, ఉపకరణమూ అని
కొన్నివేళల తోస్తూంటుంది. అన్నీ భగవంతుడే, అన్ని
రూపాలూ ఆయనవే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎవరికి
బోధించాలి? అయినా బోధించడానికి నేనెవరిని? వాళ్ళు
నా బోధనలనెందుకు వినాలి? అనిపిస్తూ ఉంటుంది. కాని,
నాయనా! నీకు తెలుసో లేదో, భగవత్ప్రేరణ కలుగగానే
చెప్పవలసినవారు చెప్పడం, వినవలసినవారు విని
ఆచరించడం జరిగి తీరుతుంది. అదే భగవంతుని
వైచిత్రం.
శిష్యుడు : స్వామీ! అనుగ్రహం కలగాలంటే కూడ
కారణం ఏదో ఉండి ఉండాలి కదా!
స్వామి : భగవదనుగ్రహమనే పవనం సదా వీస్తూనే
ఉంటుంది. నువ్వు తెరచాపలను పూర్తిగా విప్పి తయారై
ఉండాలి అనేవారు శ్రీరామకృష్ణులు. ఆయన ఇంకా ఇలా
అనేవారు: 'ఉక్కపోస్తున్నప్పుడు విసనకర్ర కావాలి కాని
చల్లగాలులు వీస్తూన్నప్పుడు విసనకర్ర అవసరం ఉండదు.’
సాధనలో అంతరాయం కలిగేతే?
శిష్యుడు : సాధకునికి తన అనుభవాలు
దివ్యానుభూతులో లేక మనోభ్రాంతులో తెలుసుకోవడం
ఎట్లా స్వామీ?
స్వామి : నిజమైన దివ్యదర్శనం శాశ్వతానంద
దాయకం. అది వారివారి మనస్సుకే గోచరిస్తుంది.
శిష్యుడు : స్వామీ! పూజాకలాపంలో ముద్రాది
క్రియలవల్ల కలిగే ప్రయోజనం ఏమిటో సెలవియ్యండి.
స్వామి : పారమార్థిక జీవన ఆరంభ దశలో అవి విశేష
సహాయకారులు నాయనా! సాధకుని పురోగతిని నిరోధించే
దుష్ట బాహ్యశక్తుల నిర్మూలనకు అవి తోడ్పడతాయి.
ధ్యానానికి కూర్చునే ముందు నీ మనస్సు ప్రశాంతంగా
ఉంటూనే, మరుక్షణంలో దురాలోచనలు నీ మనస్సును
పెనగొని అశాంతికి గురిచేస్తాయి. నేను ఒకప్పుడు ఇలాంటి
బాధకు లోనయ్యాను. శ్రీరామకృష్ణులు అప్పుడు కాస్తదూరం
నుంచి చూసి నా మనోస్థితిని గ్రహించి వెంటనే నా వద్దకు
వచ్చి, “నిన్ను ఏదో కలవరపెడుతూ ఉన్నట్లుగా ఉంది”
అంటూ నా నాలుక మీద ఏదో వ్రాసి ఏవో అస్పష్టంగా
ఉచ్ఛరించారు. అంతే, నేనా బాధనుండి బయటపడ్డాను.
సాధకుడు పురోగమనం చెందితే ఈ దుష్టశక్తులు, వాటి
ప్రభావాలు అతణ్ణి ఏమీ చేయలేవు.
శిష్యుడు : అంతటి ఏకాగ్రచిత్తంతో జీవితం గడపడం
కష్టమే స్వామీ!
స్వామి : కష్టం అనుకొని మానరాదు. పదేపదే
ప్రయత్నించాలి. సాధన చేయాలి. సాధనలను అనుష్ఠిస్తే
సాధ్యం కానిది ఏదీ ఉండదు, నాయనా!
29. ప్రాణాయామం
భక్తుడు : మేం విశ్వవిద్యాలయ విద్యార్థులం. మా
విద్యార్థి లోకానికి మీ సందేశం ఏమిటి స్వామీ?
స్వామి: నాయనలారా! మీరు సదా సత్యసంధులై,
బ్రహ్మచర్యాన్ని సక్రమంగా అవలంబించండి. ఇదే నా
ఉపదేశం.
భక్తుడు : మేం ప్రాణాయామం అభ్యసిస్తున్నాము.
దాన్ని కొనసాగించవచ్చునా స్వామీ?
స్వామి : వద్దు. ప్రాణాయామ సాధనలు స్వయంగా
ఆచరించరాదు. అవి అపాయాన్ని కలిగించగలవు. మీరు
భగవనామాన్ని స్మరించండి, అదే చాలు. ప్రాణాయామం
మూలంగా కొన్ని ప్రమాదాలు వాటిల్లవచ్చు. అట్టి
ప్రమాదాలకు లోనుకాకుండా, చిత్తేకాగ్రతకు వలసిన
కుంభకస్థితిని జపధ్యాన సాధన వల్లనే మీరు పొందవచ్చు.
జపం చేస్తూ ఉండటం వలన క్రమంగా మీ శ్వాస అత్యంత
సూక్ష్మస్థితి పొంది, ప్రాణశక్తి మీకు సహజ మార్గాన
వశమవుతుంది. అది చాలు.
30. మనస్సును నియంత్రించడం ఎలా?
శిష్యుడు : మనస్సును నియంత్రించడం ఎలాగో
సెలవియ్యండి స్వామీ?
స్వామి : సక్రమమైన సాధన ద్వారా మనస్సును
భగవంతునిపై లగ్నం చేయాలి. తలవకూడని విషయాలు,
భగవతర విషయాలు, కలతలు మనస్సులో
ప్రవేశించకుండా సదా జాగరూకుడవై ఉండాలి. అలాంటి
విషయాలు మనస్సులో జొరబడాలని ప్రయత్నించే వేళ,
మనస్సును భగవంతునిపై కేంద్రీకరించి, భగవద్ధ్యానంతో
దాన్ని నింపివేయాలి. అలాంటి సాధనలు అనుష్ఠిస్తే
మనస్సును కొంత మేరకు నియంత్రించగలిగి ప్రశాంతత
చేకూరుతుంది. నువ్వు నిస్సహాయుడవనీ, ఏకాకివనీ,
భగవంతుడొక్కడే శరణ్యమనీ, వేరే గత్యంతరం ఏదీ లేదనీ
అనుభవపూర్వకంగా ఎరిగినప్పుడు గాని, నీలో భగవద్భక్తి
జనించదు.
మనస్సును నియంత్రించడం ఎలా?
నిరంతరం జపం ఆచరించు. నీ ప్రతి నిశ్వాసం
జంతో కూడినదై ఉండాలి. సాధన వల్ల జపం.
చేయడమన్నది నీకు వంటబట్టిపోతుంది. జపం చేయడం
క్రమంగా నీ స్వభావగుణంగా మారిపోతుంది. ఏ పనిలో
ఉన్నా అప్రయత్నంగానే భగవన్నామం ఉచ్ఛరిస్తూ
ఉండటం సంభవిస్తుంది. నిద్రించబోయే ముందుగాని,
మేల్కొనేటప్పుడుగాని నామజపం కొనసాగుతూనే
ఉంటుంది.
భగవత్ర్పాప్తి, ఆయన దివ్యరూప సాక్షాత్కారమూ,
ఆయనతో సంభాషించడమూ అన్నీ సాధ్యపడటం తథ్యం
అని గ్రహించు.
పైన పేర్కొన్న సాధనలు అనుష్ఠించు. నీ సంకల్పం
తప్పక నెరవేరుతుంది, అపూర్వమైన అనుభూతులు
పొందగలవు. అద్భుతమైన మనోహర దృశ్యాలు ఎన్నిటినో
కాంచగలవు. భగవంతుని వివిధ కళలను, నానా
దివ్యరూపాలను నువ్వు దర్శించగలవు. ఆ తేజోపుంజాన్ని,
ఆ అఖండ జ్యోతిస్వరూపుని దర్శనం పొందగలవు. ఆ
బ్రహ్మానుభూతి వర్ణనాతీతం. అది ఓ వికాసం, ఓ వెల్లువ.
కనుక సాధనలలో నిమగ్నుడవవు. ప్రగాఢ
విశ్వాసంతో నామజపం కొనసాగించు. నీ మనస్సు, నీ
ఆలోచన ఆ అఖండ సచ్చిదానంద స్వరూపుని మీదనే
కేంద్రీకృతం కావాలి.
అందరి పట్ల ప్రేమ సానుభూతులతో మెలగడం
నేర్వాలి. పరుల తప్పులను ఎంచకూడదు. దుర్మార్గుని
సన్మార్గునిగా తీర్చిదిద్దడంలో నీ ఆధ్యాత్మిక జీవనం
తోడ్పడాలి. అది చేయలేనివాడు ఆ జీవితం వ్యర్థం అని
గ్రహించు.
సహనం వహించాలి. కోపాన్ని సహనంతో నెగ్గవచ్చు.
శాంతి, క్షమ, వినయంతో వర్తించాలి. శీలనిర్మాణానికి
వినయమే పునాది.
సహనశీలుడే విజయాన్ని సాధించగలడు. కాబట్టి,
'సహనశీలుడే విజయోపేతుడు, అది లేనివాడు 'భ్రష్టుడు'
అని శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు.
నీరు పల్లపు ప్రదేశంలో నిలుస్తుంది; మెరక
ప్రాంతంలో నిలువక క్రిందికి ప్రవహించిపోతుంది.
మనిషి వినయశీలుడైనప్పుడు సరళ స్వభావం, ఇతర
సుగుణాలు అతడిలో సహజ వికాసం పొందుతాయి. ఆ
సుగుణాలు లోకకళ్యాణానికి వినియోగపడతాయి.
నాయనా! నువ్వు ఏ పనిలో నిమగ్నుడపై ఉన్నప్పటికీ
భగవన్నామ స్మరణ మాత్రం మానరాదు. ప్రారంభంలో
ఇది ఒకింత కష్టం అనిపించవచ్చు. కాని క్రమంగా
అభ్యాసం వలన సులభతరం అవుతుంది. ప్రయత్నం
మానకు నాయనా! సాధన నెపంతో లేనిపోని
నియమావళిని పెంచుకోవడం అంత మంచిది కాదు.
దానివల్ల లాభం కూడ ఉండబోదు. నీలో నిష్కాపట్యం,
దృఢ సంకల్పం ఉంటే సకలం సాధ్యమే. నీ ప్రార్థనాచరణలో
ఉంటే భగవంతుడు తప్పక ఆలకిస్తాడు,
అనుగ్రహిస్తాడు.
భగవంతుడు మానవుడి హృదయ నైర్మల్యాన్ని
పరికిస్తాడు; మాటలకి సంప్రీతుడు కాడు. ఆయన్ను
మాటలతో మభ్యపెట్టలేము, ఆయన మోసపోడు.
లోకులు లౌకిక సౌఖ్యానుభవాల గురించి
ఊకదంపుడు మాటలేవో చెబుతూ ఉంటారు. పాపం
అజ్ఞానులు!
మొదట దేవతవై, పిదప భోగాలనుభవించు. అంతకు
మునుపటి నీ భోగాలన్నీ పశుప్రాయమైన భోగాలని
గుర్తుంచుకో. నీ మనస్సు నిర్మలమైనదైతే, నీ ఆలోచనలు
పవిత్రమైనవైతే నిన్ను ఏ దోషాలు అంటవు.
శిష్యుడు : ‘చక్కెరనే తిన గోరతాను గాని చక్కెరనే
కాగోరను' అనే పాట ఉంది కదా! సాధకుని మనోభావం
ఆ విధంగా ఉండాలా స్వామీ?
స్వామి : నాయనా! ఆ పాట భగవత్ సుధ అనే
చక్కెరను ఇంకా రుచి చూడని వానికి అన్వయిస్తుంది. ఆ
భగవన్నామ మాధుర్యాన్ని చవిచూడ నారంభించిన భక్తుడు
భగవదైక్యాన్ని ఆశిస్తాడు, నాయనా!
శిష్యుడు : జ్ఞానులను, అవతారపురుషులను గురించి
కన్న కలలు ఫలిస్తాయా స్వామీ? అవి యథార్థాలా?
స్వామి : అవును, యథార్థాలే! జ్ఞానుల, దేవతల,
అవతారమూర్తుల గురించిన కలలు వాస్తవానుభవాలు.
అవి యథార్థ దర్శనాలు. స్వప్నంలో ఎన్నో ఆధ్యాత్మిక
తత్త్వాలు గోచరిస్తూ ఉంటాయి. అటువంటి స్వప్నఫలితాలు,
ఆ సంస్కారం మన మనోఫలకం మీద చెరగని ముద్ర
వేస్తాయి. కాని వాటిని గురించి ఇతరులెవరికీ వెల్లడి
చేయరాదు సుమా!
31. ప్రశాంతి పొందగోరితే?
స్వామి: సప్త ద్వారాలున్న అంతఃపురంలో రాజు
వసిస్తున్నాడు. ఆ రాజుగారి దర్శనానికై వచ్చిన
పేదవాడొకడు మంత్రిని వేడుకోగా, మంత్రి అందుకు
సమ్మతించాడు. ఆ ద్వారాల గుండా మంత్రి అతణ్ణి రాజు
సమక్షానికి తీసుకుపోతున్నాడు. విలువైన దుస్తులు ధరించిన
రాజోద్యోగి ఒకడు ప్రతి ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు.
వాళ్ళను చూసి ఈ పేదవాడు, “ఈయనేనా రాజుగారు”
అంటూ ప్రతి ద్వారం వద్దా అడగసాగాడు. “కాదు”
అంటూ మంత్రి సమాధానం చెప్పసాగాడు. చివరకు ఏడో
ద్వారం దాటి అంతఃపురంలో ప్రవేశించారు. అక్కడ
వైభవోపేతంగా, ఠీవి దర్పంతో ఉన్న రాజును
చూసినప్పుడు పేదవాడు, “ఈయనేనా రాజుగారు?” అని
ఇక అడగవలసిన పనిలేకపోయింది.
గురువు విషయం కూడ అంతే. మంత్రిలా గురువు
శిష్యుని వివిధ స్థితులను గమింపచేసి తీసుకుపోయి చివరకు
ఆ పరమాత్మ సన్నిధిని చేరుస్తాడు.
కాని ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. నీ
మనస్సును మించిన గురువు వేరే లేడు. ప్రార్థన ధ్యానాదుల
వలన మనస్సు నిర్మలమైతే, ఆ మనస్సు లోపలనుండే
సారథ్యం వహించి నిన్ను తిన్నగా ముందుకు నడిపిస్తుంది.
నిత్యవిధులలో కూడ నీ మనస్సే గురుస్థానం వహించి
నీకు మార్గదర్శకమవుతుంది. పరమార్థం సాధించే వరకు
ఈ తీరులో నీ మనస్సు నీకు సాయపడుతూనే ఉంటుంది.
విషయవాంఛల్ని నియంత్రించడం, ఏకాంతవాసం,
జపధ్యానాల అనుష్ఠానం, మనస్థైర్యం - ఇవే నీ మనస్సు
నిర్మలంగా ఉండేటందుకు మార్గాలు.
నీ మనస్సు పవిత్ర భావాలను ఆశ్రయించేకొద్దీ నీలో
ఆత్మవిశ్వాసం ప్రగాఢమౌతుంది. చక్కగా మేపితే ఆవు
పుష్కలంగా పాలు ఇస్తుందన్నట్లు, ఆధ్యాత్మిక ఆహారం
విరివిగా ఇస్తే మనస్సు విశేషమైన శాంతిని ప్రసాదిస్తుంది.
భగవత్ చింతన, ప్రార్థన, జపధ్యానాలే ఆధ్యాత్మిక
ఆహారం. మనోస్థైర్యం చేకూరే మార్గం ఏమిటో తెలుసా?
మనస్సును దాని ఇచ్ఛ మేరకు తిరగనిస్తూ మనోవృత్తులను,
మనోభావాలను పరిశీలిస్తూ ఉంటే మనకే అర్థమవుతుంది.
ఆ మనస్సు తిరిగి తిరిగి వేసారిపోయి శాంతి కోసం
చివరకు భగవంతుని వైపే మరలుతుంది. జాగరూకుడవై
మనస్సును పరిశీలించు, మనస్సు నిన్ను పరిశీలిస్తూ
ఉంటుంది.
వేకువనే నిద్ర లేవాలి. రేయి పగటిలోను, పగలు
రాత్రిలోను సంక్రమించే సమయమే (సంధ్యా సమయం)
ధ్యానానికి శ్రేష్ఠం. సుషుమ్నా నాడి చురుకుగా పనిచేసే
తరుణం అది.
మనిషి రెండు నాసాపుటాల ద్వారా శ్వాసిస్తూ
ఉంటాడు. సామాన్యంగా మనం ఏ సమయంలోనైనా ఒక
నాసాపుటం నుంచే ఊపిరి పీలుస్తాం. అదే
మనోచాంచల్యానికి కారణం. సాధకులు రెండు
నాసాపుటాల ద్వారా శ్వాసిస్తూ ఉండటం మనం
గమనించాలి.
మమకారాన్ని వీడు. మనస్సును విషయసుఖాల కేసి
మరలనివ్వకు. సాధనలు అనుష్ఠించు. అప్పుడే నీ మనస్సు
నిర్మలమవుతుంది, శాంతిని పొందుతుంది. ఆ పైన నీకు
సర్వత్రా భగవంతుడే గోచరిస్తాడు. అందుకై ప్రయత్నించు,
తీవ్రంగా ప్రయత్నించు. సాధన, నియమబద్ధమైన సాధన
ఒనరించు. అదే శాంతికి మార్గం.
నిరంతర స్మరణే సాక్షాత్కారానికి అనువైన, సులువైన
మార్గం. భగవంతుడు నీ వాడని, నీ ఆప్తుడని ఎరిగి ఉండు.
ఒక వ్యక్తి తన మిత్రుణ్ణి ఆహ్వానించి ఫలహారాలతో,
సంభాషణలతో అలరించేట్లు నువ్వు నీ హృదయంలో
భగవంతుని అలరించి, పుష్పోపహారాలు, నైవేద్యాలు
అర్పించి మనస్సు విప్పి ఆయనతో సంభాషణ నెరపు.
అప్పుడు భగవంతుడు నీకు శాంతి ప్రదాతగా భాసిస్తాడు.
భగవత్ తత్త్వాన్ని తెలుసుకోవడం ఎవరి తరం?
ఆయన మాయను ఎవరు గ్రహించగలరు? భగవంతుడు
అనంతుడు; నిరాకారుడు, సాకారుడు కూడా. ఆయనే
మానవ రూపంలో అవతరిస్తున్నాడు. ఎన్ని రీతుల
భగవంతుడు మనిషికి తన ఆశ్రయం లభింపచేయడానికి
మార్గాలు సూచించినా, అతగాడు వాటిని గ్రహించలేని
స్థితిలో ఉన్నాడు. అది మానవశక్తికి అతీతం అని చెప్పాలి.
ఒక్కొక్కప్పుడు ఆ మార్గం నిరపాయంగా, రాజమార్గంగా
ఉంటుంది. కొన్నిచోట్ల ముళ్ళమయంగా ఉండి
అగమ్యగోచరంగా తోస్తుంది. కొన్నిచోట్ల కొండలతో
దాటశక్యం కాకుండా ఉంటుంది. అయినప్పటికీ
భగవంతుని శరణుజొచ్చితే, ఏ అపాయం వాటిల్లకుండా,
నిరాటంకంగా ఆయన చేయూతనిచ్చి మనలను గమ్యానికి
చేరుస్తాడు.
మాయయే మనస్సును, ఇంద్రియాలను
భగవత్సాక్షాత్కారానికి దూరం చేస్తుంది. నిజమైన
సాధకుడు, భగవత్సాక్షాత్కారం పొందినవాడు ఆ
మాయాకర్షణలన్నిటికీ అతీతుడు; మాయకు వశవర్తి కాడు.
అలాంటి వ్యక్తికి గాని భగవంతుడు లభించడు.
సామాన్యులు మాయకు లోనై జీవిస్తారు. జనన
మరణ రూపమైన ఈ సంసార వలయంలో చిక్కువడి
గిర్రున తిరుగుతూ ఉంటారు. మాయాజాలం అంత
బలీయమైనదవడమే, అందుకు కారణం. రోజులు
గడిచేకొద్దీ శరీరం శిథిలమైపోతూ ఉన్నప్పటికీ తానెందుకు
జన్మించాడో, తన పుట్టుకకు సార్థకత ఏమిటో
యోచించడు. పరమ పవిత్రాలైన కార్యాచరణలన్నిటిని
విస్మరించి మాయలోపడి నిద్రిస్తుంటాడు.
భగవత్సాక్షాత్కారం ఈ మానవజన్మలోనే పొందడం
సాధ్యం. మానవ జన్మకు ఉన్న విశిష్టత ఇదే;
మహోన్నతమైన ప్రయోజనమే ఇది. శారీరక సుఖాలను
విస్మరించు, జనన మరణ భ్రాంతిని విదిలించుకో.
తుచ్ఛమూ, అశాశ్వతమూ అయిన మాయా అశాంతిని
వీడు. యథార్థం, శాశ్వతం అయిన ఆత్మప్రశాంతిని
అనుభవించు.
32. మనస్సుపై ఆధిపత్యం వహించు
స్వామి : త్రికరణశుద్ధిగా భగవంతునికి ఆత్మార్పణం
చేసుకోవడం, పరిపూర్ణంగా ఆయననే విశ్వసించి ఉండటం
అన్నది అంత తేలికైన పని కాదు. 'నేను భగవంతుని
గురించి అర్థం చేసుకోనూ లేదు, చూడనూ లేదు.
అలాంటప్పుడు నేను ఆయనను ప్రేమించడమా?
ఆత్మార్పణం చేసుకోవడమా? ఇదెలా సాధ్యం' అని
మనస్సు పరిపరి విధాల సంశయాలను వెలిబుచ్చుతుంది.
భగవంతుని ధ్యానింప మనస్కరించడం లేదని
ఒకప్పుడు ఒక వ్యక్తి శ్రీరామకృష్ణుల వద్ద వాపోయాడు.
అప్పుడు ఆయన, “అలాగా, అయితే నీకు లోకంలో ఎవరి
పట్ల లేక దేనిమీద ఎక్కువ ప్రేమ ఉందో చెప్పు?” అని
అడిగారు.
అందుకు అతడు, "అయ్యా! నేను పెంచుకొంటున్న
మేకపిల్ల అంటే నాకెంతో ప్రేమ. దాన్ని అమిత గారాబంగా
పెంచుకొంటున్నాను” అని బదులు చెప్పాడు. అప్పుడు
శ్రీరామకృష్ణులు, “భేష్, ఇప్పుడు ఒక పని చెయ్యి. నీ
మేకపిల్లకు ఆహారం ఇస్తున్నప్పుడు, దాన్ని ముద్దుగా
లాలిస్తూ ఉన్నప్పుడు లేదా దానికి సంరక్షణ పోషణ
చేస్తూన్నపుడు, మరెప్పుడైనా సరే నువ్వు ఆ భగవంతుని
సేవిస్తున్నట్లుగా భావించు. మనసారా ఆ విధంగా
చేయగలిగావంటే పరమార్థాన్ని సాధించగలవు” అని
ఉపాయం సూచించారు.
సద్గురువు కటాక్షం పొందేవారు ధన్యాత్ములు. గురువు
సంసారాన్ని తరించే ఉపాయం చూపుతాడు; సకల
బాధలకు, ఆటంకాలకు నివారణ మార్గం సూచిస్తాడు.
గురువు వాక్యాలను ప్రగాఢంగా విశ్వసించి, శ్రద్ధా
భక్తులతో ఆయన ఉపదేశాలను ఆచరణలో పాటించు. నీ
మనోమాలిన్యం యావత్తు ప్రక్షాళనమై జ్ఞానజ్యోతి
ప్రకాశిస్తుంది. గురువు పట్ల శ్రద్ధాభక్తులు ఉన్నవాడు
జ్ఞానాన్ని సత్వరం పొందగలడు. గురువును సాక్షాత్తు
భగవత్స్వరూపునిగా పరిగణించినప్పుడే జ్ఞానం
సముపార్జించగలవు. గురువును ఎన్నడూ
మానవమాత్రునిగా ఎన్నకు. ఆయన్ను దైవస్వరూపునిగా
భావించి పూజించాలి సుమా! ఆ విధంగా సేవిస్తే
మనశ్శరీరాలు పవిత్రమవుతాయి.
గురువు సహకారం ఉంటే భగవద్దర్శనం
ఒనగూరుతుంది. పిదప నీ దృష్టిలో గురువు, భగవంతుడు
ఏకరూపులై గోచరిస్తారు. హృదయంలో పారిశుద్ధ్యం
కొరవడిన నాడు భగవద్దర్శనం సాధ్యం కాదు.
శ్రీరామకృష్ణులు తరచు ఇలా అంటూ ఉండేవారు:
“భగవద్దర్శనం పొందిన గురువే కనుక ఎవరికైనా లభిస్తే
అతడు సత్వరం అహంకార విముక్తుడై, భగవద్దర్శనం
పొందగలుగుతాడు.”
జ్ఞానశూన్యుడైన గురువును ఆశ్రయించిన వ్యక్తి
ఎన్నటికీ బంధవిముక్తుడు కాలేడు. అలాంటప్పుడు
గురుశిష్యులిద్దరికీ కూడ యాతనే. తానే
అజ్ఞానాంధకారంలో ఉన్న వ్యక్తి ఇతరులకు జ్ఞానదానం
చేయగలడా? భగవత్సాక్షాత్కారమూ, దైవానుగ్రహమూ,
భగవదనుజ్ఞ పొందని వ్యక్తికి ఇతరులకు సాయం
చేయడమన్నది సాధ్యమేనా? అంధుడు అంధునికి
దారిచూపగలడా? ముక్తుడైన వ్యక్తే ముక్తిమార్గం
చూపగలుగుతాడు.
ఈ సందర్భంలో స్వామి వివేకానంద వాక్కులు
స్మరణీయాలు. భక్తియోగం గురించి ప్రసంగిస్తూ,
మనస్సుపై ఆధిపత్యం వహించు
తత్త్వోపదేశం చేసే గురువు విషయం ప్రస్తావిస్తూ, ఎంతటి
భయంకరమైన పొరపాట్లు జరుగుతూ ఉంటాయో
వివరించారు.
“జ్ఞానరహితుడై ఉండీ అహంకారంతో తానేదో
సర్వజ్ఞుడన్నట్లు విర్రవీగుతూ, ఇతరులను తరింపచేయ
చేయూత ఇచ్చేందుకు కూడ వెనుకాడక, పుట్టంధుడికి
మరో అంధుడు మార్గదర్శకుడైనట్లు చివరికి వారూ వీరూ
కలిసి గోతిలో పడుతుంటారు కదా!" అవిద్యాయమంతరే వర్తమానాః
స్వయం ధీరాః పండితం మన్యమానాః ।
జంఘన్యమానాః పరితయంతి మూఢా
అంధేనైవ నీయమానా యథాంధాః ॥
- ముండకోపనిషత్తు, 1-2-8 మూఢులు అజ్ఞానాంధకారంలో పడి ఊరుతూ
తమకంటే ధీరులు లేరని విర్రవీగుతూ, పండితమ్మన్యులై
గుడ్డివారు దారి చూపితే నడిచే గుడ్డివారై తొట్రుబాటుతో,
అడుగులు తడబడుతూ తిరుగాడుతూ ఉంటారు.
లోకం ఇటువంటి పండితమాన్యులతో నిండి ఉంది.
ప్రతి వ్యక్తికీ తానొక ఆచార్యుడు కావాలనే తహతహ, తపన;
ఆచార్యుడననే భావన. ప్రతి యాచకుడూ తానో పది లక్షలు
దానం చేయాలని తపన చెందినట్లు! ఈ యాచకుల మాదిరే
ఆ ఆచార్యులూను, నిజానికి హాస్యాస్పదులు. ఆచార్యం మాం విజానీయాన్నావ మన్యేతకర్హి చిత్
నమర్త్య బుద్ద్యా సూయేత సర్వదేవమయో గురుః
- శ్రీమద్భాగవతం, 11-17-27
గురుర్ర్బహ్మా గురుర్విషుః గురుర్దేవో మహేశ్వరః |
గురుసాక్షాత్పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః । భగవంతుని ఎడ భక్తి నెరపి మనస్ఫూర్తిగా సాధన
అవలంబిస్తే సద్గురువు తప్పక లభిస్తాడు. గురుకృప
పొందిన వ్యక్తి సాధనామార్గాన్ని తెలుసుకోగలుగుతాడు.
అందుకు వలసింది తగినంత శ్రద్ధ.
నాయనలారా! మీకు గురువు అనుగ్రహం ఉంది,
ముముక్షుత్వమూ ఉంది. మంత్రదీక్ష పుచ్చుకొన్నారు కనుక
మీకు భగవదనుగ్రహం ఉన్నది; పైగా సాధుసాంగత్యమూ
నెరపుచున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు వలసిన
మనోనిగ్రహాన్ని సముపార్జింప ప్రయత్నించాలి. మనస్సును
వశీకరించుకొంటే ప్రశాంతత చేకూరుతుంది. గురువు
మెచ్చుకొంటాడు. భగవత్కృప లభిస్తుంది.
గురువు ,అనుగ్రహం, భగవదనుగ్రహం,
భక్తానుగ్రహం పొందుతారు గాక! 'మనోనిగ్రహం లేకుంటే
మనిషికి దుర్గతి తప్పదు' అనే ఒక చక్కని వైష్ణవసూక్తి
ఉంది.
విషయ వాసనల వెంటబడకుండా మనస్సును
నియంత్రించాలి. కళ్ళెం గట్టిగా పుచ్చుకో. కుశలుడైన
రౌతుగుర్రాన్ని అదుపులో ఉంచుకొనే తీరులో, నిపుణుడైన
మావటి ఏనుగును వశపరచుకొని తగిన శిక్షణ నిచ్చే
తీరులో నీ మనస్సును స్వాధీనం చేసుకో. నియమిత సాధన
ద్వారా మనస్సుకు చక్కని శిక్షణ ఇవ్వాలి. నీ మనస్సుపై
ఆధిపత్యం వహించు. మనస్సు నీ అదుపులో ఉండాలి;
అంతేగాని నువ్వు దాని వశవర్తివి కారాదు. తుచ్ఛమైన
శారీరక వాంఛలన్నిటిని త్యజించమని మనస్సుకు
బోధించు. విషయ వాసనల నుండి విముక్తి చెందినప్పుడే
మనస్సు నీ అధీనమవుతుంది. ఆ కారణంగానే భగవద్గీత
త్యాగ వైరాగ్యాలను ప్రత్యేకంగా నొక్కి వక్కాణిస్తున్నది.
రాముడు ఏలే హృదయంలో కాముడు ఉండలేడు.
భోగవాంఛలు, భగవత్ చింతన ఒక్కచోట కలిసి ఉండలేవు.
వీటిలో నీకు ఏది కావలసినా రెండవదాన్ని వదలి
పెట్టవలసిందే. కాని దివ్యానందాన్ని, మహోత్కృష్టమైన
భగవదానందాన్ని చవిచూస్తే గాని నువ్వు ఈ అల్ప
సుఖాలను, తుచ్ఛభోగాలను పూర్తిగా వదలిపెట్టలేవు.
ఈ పిన్నవయస్సులోనే నీ హృదయాన్ని భగవదర్పితం
చేయమని మరీ ఇంతగా నొక్కి చెప్పడానికి కారణం -
భగవంతుని నీ వాడిగా చేసుకోమనే. 'భగవంతుడు నా
వాడు, నా ఆప్తుడు, నా సర్వస్వం' అనే భావన నీ
మనోఫలకంపై ముద్రితం కావాలి. ఆ ముద్ర పడిందా,
పిదప మార్గం సుగమమే.
భగవదానందాన్ని ఒక్కమారు చవిగొన్నాక ఇతరమైన
సుఖాలన్నీ రసహీనంగా, తుచ్ఛంగా కనిపిస్తాయి. నీ
జీవితాన్ని భగవదర్పితం చెయ్యి. భగవంతుణ్ణి శరణుజొచ్చు.
'నీట ముంచినా పాల ముంచినా నీ పాదాలే గతి' అని
ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండు.
33. సాక్షీభూతుడవు కమ్ము!
జీవునికి స్వతంత్రేచ్ఛ ఉన్నది. ఈ ఇచ్ఛా స్వాతంత్య్రం
నిజానికి అంతరాత్మకు, పరమాత్మకు సంబంధించినది.
'నీ అంతరాత్మను మేల్కొల్పు' అనేవారు శ్రీరామకృష్ణులు.
ఏతావాతా ఈ సాధనల, నియమనిష్ఠల ఉద్దేశం
ఏమిటి? పరమ ప్రయోజనం ఏమిటి? ఈ జన్మలోనే
భగవంతుని దర్శించుకోవడమే ఈ ఇచ్ఛ ప్రయోజనం.
మనస్సు శుద్ధం అయ్యేకొద్దీ ఈ స్వతంత్రేచ్ఛ
బలీయమౌతుంది. ఈ ఇచ్ఛను, సంకల్పాన్ని సడలించి,
భవిష్యత్తులో ఏదో ఒక రోజు భగవంతుని
దర్శించలేకపోతామా అనుకోవడం సోమరి లక్షణం.
ఉదాహరణకు బుద్ధుణ్ణి చూడండి. ఆయనది ఎంతటి
వజ్ర సంకల్పమో! ఈ జన్మలోనే బ్రహ్మసాక్షాత్కారం
పొందితీరాలి లేదా ఆ ప్రయత్నంలోనే ప్రాణాలు పోవాలి
అనే సంకల్పంతో ఆయన అనేక సంవత్సరాల పాటు
అన్వేషించి చివరకు ఒకచోట కూర్చుని తన సంకల్పాన్ని
మహాసంకల్పంగా చేసుకొన్నాడు.
ప్రతి వ్యక్తికీ అట్టి వజ్ర సంకల్పం ఉండాలి. నీకొక
రహస్యం చెబుతాను విను. నేను చెప్పబోయేది నీకిప్పుడు
అర్థం కాకపోవచ్చు; కాలక్రమంలో నీకు దాన్లోని సత్యం
బోధపడుతుంది.
సంకల్పానికి ఉన్న బలం ఎంతటిదనుకొన్నావు?
అది మనస్సుకు క్రమపద్ధతిలో వికాసం చేకూర్చి,
పురోగమింప చేసి కడకు పరమశ్రేయస్సును సమకూర్చి
పెడుతుంది.
పూలబాటన నడిచేవారు కొందరుంటే, ముళ్ళదారుల
వెంటబడిపోయేవారు మరికొందరు ఉంటారు. కాని ఎల్లరు
చేరవలసిన గమ్యం మాత్రం ఒక్కటే. బాటను
ఎన్నుకోవడం వారివారి దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ఈ
పరమసత్యాన్ని విడమరచి శ్రీరామకృష్ణులు ఈ క్రింది
విధంగా శిక్షణ గురించి బోధిస్తూ ఉండేవారు.
మనస్సు, సంకల్పం రెండూ పట్టపగ్గాలు లేకుండా
పోతేపోనివ్వు. కాని నువ్వు వాటి పోకడను నిరంతరం
జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. అందుకు సాక్షీభూతుడవై
ఉండు. ఈ విధంగా సాధకుడు నిజానికి మనస్సును ఇష్టం
వచ్చినట్లు తిరుగనిచ్చినా దానిపై సదా నిఘావేసి ఉంటే,
మనస్సు కొంతకాలం తుచ్ఛ విషయాలకై ఎగబడినా,
సకాలంలో గుర్తించి కట్టుదిట్టంచేసి ఉన్నత మార్గంలో
పయనించి పరమశ్రేయస్సు వైపుకే మొగ్గటం తథ్యం.
భగవంతుని లీలావిలాసాలు అనూహ్యం. చిత్రంగా
ఉంటాయి. మనస్సుతో, మాటలతో ఆ భగవత్ తత్త్వాన్ని,
శక్తిని గ్రహించి, నిరూపించడం సాధ్యమేనా? అనంతం,
అపారం, అప్రమేయం అయిన పదార్థాన్ని ఒక
కొలమానంతో కొలవాలని ప్రయత్నిస్తే సాధ్యమౌతుందా?
అది మహాసముద్రంలోని నీటిని గిద్దతో (నీటిని కొలిచే
కొలమానం) కొలవాలనుకోవడమన్నమాట.
భగవతత్త్వాన్ని నీ మనస్సుతో అందుకోవాలంటే
నువ్వు నిరంతరం అనుష్ఠించే సాధనల ఫలమే అందుకు
దారి చూపాలి.
No comments:
Post a Comment