Monday, August 7, 2023

34. పరిశుద్ధ హృదయుడవు కమ్ము

34. పరిశుద్ధ హృదయుడవు కమ్ము! శిష్యుడు : స్వామీ! ఎన్నో విధాల ఇంద్రియాలను నిగ్రహించాలని ప్రయత్నించాను. కాని కృతకృత్యుడను కాలేకపోయాను. ఇంద్రియనిగ్రహం ఎలా పొందగలను? స్వామి : చూడు నాయనా! కామాన్ని జయిస్తాను, క్రోధాన్ని నెగ్గుతాను, లోభంపై విజయం సాధిస్తాను అంటూ దంభాలు పలుకుతూ కూర్చుంటే ఎన్నటికీ వాటిని నిర్జించలేవు. నీ ధోరణిని మార్చుకోవాలి. నీ మనస్సును భగవంతునిపై నిలపగలిగితే చాలు. కామ క్రోధాదులు వాటంతట అవే సమసిపోతాయి. 'తూర్పు కేసి పయనించేకొద్దీ పడమరకు దూరం అవుతావు కదా!' అనేవారు శ్రీరామకృష్ణులు. భగవంతుణ్ణి ప్రార్ధించు, శరణు వేడు; ఇక విషయసుఖాలు ఎన్నటికీ నిన్ను ఆకర్షించలేవు. జపధ్యానాలను ఆషామాషీగా చేయరాదు. ఓ రెండు గంటలసేపు ప్రతిరోజు ఏదో చేశాను అనుకొంటే చాలదు. అంతమాత్రాన భగవస్సాన్నిధ్యం లభించదు బాబూ! భగవచ్చింతనలో, భగవంతుని గుణనామ కీర్తనలో అహర్నిశలూ నిమగ్నుడవు కావాలి. అప్పుడే ఆయన దర్శన భాగ్యం లభిస్తుంది. లోతుకు, బాగా అట్టడుగుకు దిగి అన్వేషించాలి. అప్పుడుగాని లక్ష్యాన్ని సాధించలేవు. వ్యర్థంగా కాలక్షేపం చేయబోకు. ప్రారంభ దశలో సాధకుడు తన ధ్యాన సమయాన్ని నెమ్మదిగా, నియమబద్ధంగా, క్రమంగా, పట్టుదలతో హెచ్చిస్తూ రావాలి; తాత్కాలికమైన ఉత్సాహంతో ధ్యాన వ్యవధిని హఠాత్తుగా పెంచినందున నీ మనస్సుకి, శరీరానికి వాటిల్లే పరిణామాన్ని నువ్వు తట్టుకోలేవు. నిజం చెప్పాలంటే తత్ఫలితం నిరుత్సాహమే. వెయ్యి మాటలు ఎందుకు? ధ్యానశక్తినే కోల్పోయే ప్రమాదం ఉంది. నిరుత్సాహం చెందిన మనస్సుకు ప్రేరణనిచ్చి మళ్ళీ ఆధ్యాత్మికత సంతరింపచేసి సాధనాయోగ్యం చేయడం ఎంతో కష్టం సుమా! అన్నింటికంటె భగవత్ కృప ఎంతో ప్రధానమని తెలుసుకో. అది లేని నాడు ఏదీ సాధించలేం. అందుకే భగవత్కృప కలిగేలా నిరంతరం ప్రార్థించు. నీ ప్రార్థన ఎన్నటికీ వృధా కాదు. భగవంతుడు కరుణామయుడు. వాత్సల్యంతో నీ మొరను ఆలకిస్తాడు. కొంత ఓర్పు వహించాలి. పట్టువిడువరాదు. విషయసుఖాలకు వశవర్తి కారాదు. ప్రతి విషయంలోను ఎంతో ఆత్మనిగ్రహం వహించాలి. విషయ వాంఛలు నిన్ను బానిసల్లా వెంబడిస్తాయి. అయినా భగవంతుని దయ నీ పట్ల ఉన్నందున నీలో విషయసుఖాపేక్ష తలెత్తదు. వాటి పట్ల అనాసక్తుడవయ్యే ఉంటావు. సర్వసంగ పరిత్యాగిపై సన్న్యాసం పుచ్చుకొన్నావు. ఇతరులపై అధికారం చెలాయించడం నీకు తగదు. అది మహాబంధకారణం అవుతుంది సుమా! నువ్వు చేసే ప్రతి పనీ శ్రీరామకృష్ణుల పనిగా భావించు. ప్రతి వ్యక్తినీ శ్రీరామకృష్ణులకు సంబంధించిన వ్యక్తిగా ఎంచు. అహంకారంలో పడిపోయి మానవుడు తానే సర్వం అనుకొంటాడు. ' అబద్ధం చెప్పడం మహాపాపం. త్రాగుబోతును, వ్యభిచారిని సైతం నమ్మవచ్చును గాని అసత్యవాదిని మాత్రం నమ్మనే కూడదు. అసత్యమన్నది ఘోరపాపం. ఇతరుల తప్పులను ఎంచకు. ఇతరులు చేసే పనుల్లో తప్పులు పట్టకు. అట్టి అలవాటు నీకే హానికరంగా ************************************************** 1. అహంకార విమూఢాత్మా కర్తాహమితిమన్యతే. - భగవద్గీత 3-27 ************************************************* పరిణమిస్తుంది. నిరంతరం ఇతరుల దోషాలను గురించే ఆలోచిస్తూ ఉంటే, నీ మనస్సు పూర్తిగా కలుషితమై నీలో ఉన్న యోగ్యత, మంచితనం వంటి సుగుణాలు పలాయనం చిత్తగిస్తాయి. భగవంతునితో చలగాటం ఆడకు. ఆయన వైభవాన్ని కీర్తించు. ఆ పరమాత్ముని లీలలు చూసి ఆనందించు. అరమరికలు లేకుండా ఇతరులతో కలసిమెలసి జీవించు. సమయాన్ని సంతోషంగా గడుపు. శుష్కసంభాషణలతో కాలాన్ని వృథాపుచ్చకు. పనిగట్టుకొని ఇతరుల తప్పులను ఎన్నేవారు దుర్మార్గులే అని గుర్తుంచుకో. పరిశుద్ధ హృదయంతో ఆదర్శప్రాయమైన జీవయాత్ర సాగించు, ముందడుగు వెయ్యి. ఇతరులలో మంచిని చూడటం అలవరచుకో. ఇతరులలోని కించిత్తు సద్గుణాలను సైతం కొండంతలు చేసి మనసారా ప్రశంసించు; అందరినీ గౌరవించు. పైన సూచించిన విధంగా నడచుకొంటే నీలో పరులపట్ల సానుభూతి పెంపొందుతుంది. అందరినీ గౌరవించే వ్యక్తి స్వయంగా గౌరవం పొందుతాడు. తోటి మనిషిని ఎన్నడూ నిరసించకు, అణచివేయాలని ప్రయత్నించకు. ప్రతి వ్యక్తీ ఇతరులలోని దోషాలు ఎంచడమే పనిగా పెట్టుకోవడం ఎంత దురదృష్టకరమో కదా! ఇతరులను ప్రేమించి నీ వారిగా అభిమానించి, వారిలోని బలహీనతలను పోగొట్టడానికి తోడ్పడు. ప్రతి వ్యక్తిలోను మంచి చెడులన్నవి ఉంటాయి. ఇతరులలోని దోషాలను ఎత్తి చూపడం సులభం. కాని వారిలోని దుర్గుణాలను లెక్కించక వారిని సన్మార్గులుగా తీర్చిదిద్దడానికి, పవిత్రులను చేయడానికి సాయం చేసేవారినే సాధుసత్తములంటారని గుర్తుంచుకోండి. నాయనలారా! సాధువులను, యతులను మరువకండి. సదా మీరు శాంతులు, వినమ్రులు, మధురభాషణులు అయి ఉండాలి సుమా! మీరు పలికే ప్రతి మాటలోను, చేసే ప్రతి పనిలోను, మీ ప్రవర్తనలో, ఆచరణలో అన్నిటా సౌజన్యం, నైర్మల్యం వెల్లివిరియాలి సుమా! నాయనలారా! మీ సాంగత్యం నెరపేవారు ఎవరైనాసరే చిత్తశాంతి పొందుతారని దీవిస్తున్నాను. నిద్రాణమై ఉన్న బ్రహ్మశక్తి వారిలో జాగృతమవుతుంది. పవిత్రత అంటే ఏమిటి? బ్రహ్మచర్యం అంటే ఏమిటి? సర్వదా సత్యం పలుకడమే పవిత్రత, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటమే బ్రహ్మచర్యం. మాట్లాడేటప్పుడు ముక్తసరిగా ఆచితూచి మాట్లాడాలి. ఎవరినీ ద్వేషించకూడదు. ఎవరినీ ఏవగించుకోరాదు. ఎవరిపట్లా అసూయ చెందరాదు. పన్నెండేళ్ళపాటు బ్రహ్మచర్యం పాటించిన వ్యక్తి పరమోత్కృష్టమైన స్థితిని అందుకొంటాడు. కనుక నువ్వు దీక్షపూని బ్రహ్మచర్యవ్రతం పాటించు. అవకాశం కలిగినప్పుడు తీర్థాటన చెయ్యాలి. ఆ పావన తీర్థప్రాంతాల్లో కొంతకాలం గడపాలి. అక్కడి నిర్మలమైన వాతావరణం, రమణీయమైన ప్రకృతి దృశ్యాలు మనస్సుకు ఎంతో శాంతిని, శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. పుణ్యక్షేత్రాలు ధ్యానానికి కూడ అనుకూలమైనవి. సర్వదా నీ హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి. లోకం భ్రాంతి, ప్రమాదాలతో కూడుకొన్నది. ఆత్మ వికాసం పొందగోరితే సాధన నీ మూలమంత్రం కావాలని గుర్తుంచుకో. మనస్సులో మెదలే ప్రతి కోర్కెను పరికించి, పరిశీలించి దాన్ని నిగ్రహించాలి. కోరికను అణచగలిగితే, తక్కినవన్నీ సులభతరమే. శిష్యుడు : ధ్యానానికి కూర్చున్నప్పుడు కొన్ని వేళల్లో మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాని కొన్ని సమయాలలో ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రశాంతత కలుగకపోగా, తీవ్రమైన ఆందోళనకు గురవుతుంది స్వామీ! స్వామి : : అది గుణప్రభావం. మనస్సు త్రిగుణాలకు అధీనమై ఉంటుంది. సాధన చేయగా చేయగా సత్త్వగుణం కుదురుకుంటుంది. గంగానదికి ఆటుపోటుల్లా మనస్సుకీ ఒడుదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి. ఒక్క మనస్సుకే కాదు సమస్త విషయాల్లో ఇటువంటి ఒడుదుడుకులు ఎదురవుతాయి. ఏమైనా ఇది కేవలం ప్రారంభ దశే కదా! దాన్ని గురించి కలత చెందకు. సాధనలను కొంతకాలం పాటు నియమబద్ధంగా కొనసాగిస్తే, మనస్సుకు ఆపైన ఎలాంటి ఆటుపోటులు కలుగవు. అప్పుడు మనస్సు నిశ్చింతగా, నిరాటంకంగా నీలోని భావపరంపరలను భగవంతుని వైపుకే మరలిస్తుంది. సత్త్వగుణం అతిశయించి మనస్సు సహజ ప్రశాంతతను పొంది ఉన్నప్పుడు నీ పనులను సమస్తమూ విడిచి, జపధ్యానసాధనలలోనే నిమగ్నుడవై మెలగు. ప్రతి పుణ్యక్షేత్రంలోను, కొన్ని ప్రత్యేక సమయాలలో ఆధ్యాత్మిక భావవాహిని ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయాలలో సాధకుడు ధ్యానంలో కూర్చుంటే మనస్సు అలవోకగా ధ్యేయంలో లీనమై ధ్యానానందం ఇనుమడిస్తుంది. శిష్యుడు : కాని స్వామీ, ఆ సమయం ఏదో తెలుసుకోవడం కష్టం కదా? స్వామి : కష్టమేమీ కాదు. ధ్యాన సాధకుడు దాన్ని సులభంగానే గుర్తించగలడు. పరమ పావన క్షేత్రమైన కాశీ ప్రపంచానికే అతీతమైనట్లు కనబడుతుంది. ఆ పుణ్యక్షేత్రం అనాది నుండి అఖండమైన తత్త్వజ్ఞాన నిలయం. అక్కడ ఉంటూ సాధనలు అనుష్ఠించేవాడు ఎవరైనా సత్వరం సత్ఫలితాన్ని పొందగలడనడం తథ్యం. బీజభూతమైన మంత్రం ఈ ప్రదేశంలో సాధకుని స్వల్ప ప్రయత్నంతోనే వికాసం పొంది ఫలితాన్ని అందిస్తుంది. పాపాత్ముడైనా, శ్రీమంతుడైనా, నిరుపేదయైనా, ఘనుడైనా, అల్పుడైనా సరే ఆ క్షేత్రంలో వెలసిన విశ్వనాథుని కృపతో అందరికీ ముక్తి లభిస్తుంది. 35. మహనీయుల జీవితాన్ని అనుగమించు శిష్యుడు : స్వామీ! భగవద్భక్తిని పెంపొందించుకోవడం ఎలా? స్వామి : సాధుసాంగత్యం నెరపాలి. వారి ఉపదేశాలను ఆలకించాలి. వారి జీవన విధానాన్ని అవగతం చేసుకొని నీ జీవన విధానాన్ని మలచుకోవాలి. కాని ధ్యానం, బ్రహ్మచర్యం అనుష్ఠించనిదే తత్త్వజ్ఞానులైన మహనీయుల భావనలను, వేదశాస్త్ర సారాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోలు. ఆయన ఉపదేశాలను మననం చేస్తూ ఉండు. భగవంతుని నువ్వెంతగా ధ్యానిస్తే అంతగా నీకు సద్గ్రంథాలు బోధపడతాయి. శాస్త్ర జనిత జ్ఞానం వేరు, భగవన్నిష్ఠ వేరు. ఇక ప్రత్యక్షానుభవ జ్ఞానం పైన చెప్పిన రెండిటికి భిన్నమైనది, అతీతమైనది. పేరు ప్రతిష్ఠల పట్లా, విషయభోగాలపట్లా నీకు ఏమాత్రం అనురక్తి ఉన్నా భగవంతుని దర్శించలేవు. ‘లంగరు దించిన నావను నడపాలనుకోవడం వంటిది అది' అనేవారు నాగమహాశయులు. ఆయన ఇంకా ఇలా అనేవారు: 'పేరుప్రతిష్ఠలను సంపాదించడం సులభం. వాటిని విడిచిపెట్టగలవాడే ధన్యుడు. ' జ్ఞానియైన మహనీయుని సాంగత్య భాగ్యం గలవాడే ధన్యుడు, బాబూ! శిష్యుడు : స్వామీ! సాధుసాంగత్యమే చాలు, అంతకు మించి మరేదీ అక్కరలేదని కొందరి నమ్మకం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి స్వామీ? స్వామి : కేవలం సాధుసాంగత్యం మాత్రమే చాలదనుకొంటాను. మనస్సు విప్పి నీ సంశయాలను నివృత్తిచేయమని వారిని అడుగు. వారి జీవితాలను జాగరూకుడవై పరిశీలించు. వారి జీవిత విధానాలను అనుగమించు. సాధుసాంగత్యమే చాలు అనుకోవడం సోమరుల లక్షణం. సాధుసాంగత్యం అత్యవసరమే; వారి సాంగత్యంలో సంశయాలు పటాపంచలవుతాయి. సద్భావాలు ఉదయిస్తాయి. తత్త్వవిదుల సాంగత్యం వల్ల నేర్వగలిగినంత విద్యాసంస్కారాలు ఎన్ని శాస్త్రగ్రంథాలు పఠించినా కూడ కలుగదనడంలో ఏమాత్రం సందేహం లేదు. శిష్యుడు : స్వామీ! ఏకాంతవాసం ఆధ్యాత్మిక వికాసానికి ఎంతో దోహదం చేస్తుందని శ్రీరామకృష్ణులు చెప్పి ఉన్నారు కదా! స్వామి : అవును అది నిజమే. కాని ఒకింత ఆత్మ విశ్వాసం చేకూరిన తరువాతే ఏకాంతవాసాన్ని ఎన్నుకోవాలి. సాధకుడు సమర్థుడు కాకుండా సంఘం వీడి ఏకాంతవాసం చేయాలనుకోవడం అవివేకం. దేశకాల కారణబద్ధమైన ఈ లోకంలో నిజమైన ఏకాంతవాసం దుర్లభం. అది మనోబుద్ధ్యతీతం. అది పరమ ప్రశాంతి, పరమాత్మ సంస్థితి. శిష్యుడు : సాధకుడు తొందరపడరాదు; సత్వర ప్రయోజనం కలుగకున్నా కృషిచేయాలని, సావధానచిత్తుడై వేచి ఉండాలని మొన్న మీరు సెలవిచ్చారు కదా! అంటే వెంటనే భగవత్సాక్షాత్కారం కోసం పరితపించరాదనా దాని భావం? స్వామి : మరేదో సందర్భంలో దాన్ని చెప్పి ఉండవచ్చు. భగవత్సాక్షాత్కారం పొందగోరితే పరితపించవలసిందే. కాని తాత్కాలిక ఆవేశంగాని, పరవశత్వంగాని కూడదు. ఏమాత్రం భావోద్రేకం ప్రకటించకూడదు. భగవంతుని పట్ల నీకున్న పరితప్తతను, భక్తివిశేషాన్ని లోలోపలే ఇముడ్చుకోవాలిగాని, బహిరంగపరచరాదు; వెల్లడిస్తే నిస్సారమై హరించిపోతాయి. ఆపైన ఆధ్యాత్మిక జీవితం అంటేనే రోతపుట్టవచ్చు. నిజమైన భక్తుడు సహనం వీడక భగవంతునికై పరితపిస్తాడు. అధవా ఫలితం కనిపించకున్నా భక్తిప్రపత్తులను విడిచిపెట్టడు. లాభం ఆశించి వ్యాపారం సాగించే వర్తకునిలా, ఫలితాన్ని ఎదురుచూసి ప్రార్థనలు చేసే భక్తులు మాత్రం, తమ ప్రార్థనలు ఫలించకపోతే తక్షణమే సాధనలు విడిచి పెట్టేస్తారు. 36. సత్సాంగత్యమే సాధనకు జీవకర్ర స్వామి : భగవద్ధ్యానంలో లీనం కాగానే అఖండానందాన్ని అనుభవించగలవు. ఆ దివ్యానందానుభూతిలో కాలం క్షణంలా గడిచిపోతుంది. నీ ఆధ్యాత్మిక మనోస్థితులను, అనుభూతులను గురించి ప్రతి ఒక్కరి వద్ద ఏకరువు పెట్టకు. లౌకికులకైతే అసలే చెప్పకూడదు. అది నీ వికాసానికి ప్రతిబంధకం కావచ్చు. నీ మనోప్రవృత్తికి, భావాలకు అనుగుణమైన వారితో ముచ్చటించవచ్చు. అలా మీరిద్దరూ పరస్పరం మీ అనుభూతులను గురించి చెప్పుకోవడం మీ ఆత్మ వికాసానికి దోహదం చేయవచ్చు కూడ. మీరిద్దరూ ఒకే మార్గంలో పయనించే ప్రయాణికులు కావడమే అందుకు కారణం. నీ తోటి ప్రయాణీకుడు ఈ మార్గంలో పయనించి, ఆ దారిలో ఎదురయ్యే భ్రమ ప్రమాదాలను గురించి అంతకు మునుపే ఎరిగి ఉండవచ్చు. అతడి సాంగత్య లాభంతో నువ్వు ఆ ప్రమాదాలు కష్టాల వాతబడకుండా ముందు జాగ్రత్త వహించు. సాధుసాంగత్య అవసరం ఎందుకో ఇప్పుడు నీకు అర్థమైంది కదా! కనుక వారి అనుభూతియే సాధకునికి జీవగర్ర, ఆలంబనమన్నమాట. నువ్వొక కొత్త ప్రాంతానికి వెళుతున్నావనుకో. అప్పుడు నీకొక మార్గదర్శి ఎదురైతే ఆతడి సహకారంతో జాప్యం కాకుండా, సకాలంలో, సత్వరం చూడతగిన వింతలు విడ్డూరాలన్నిటిని చూడగలగటమే కాకుండా, కొత్తవాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులకు గురికాకుండా తప్పించుకోవచ్చు. అదే విధంగా ఆధ్యాత్మిక రంగంలో విశేషాను భూతిని గడించిన మహనీయుల సాంగత్యం లభిస్తే అమూల్యమైన కీలకాలు ఎన్నో తెలుసుకోవచ్చు. అప్పుడు నీ సాధన మరింత సుగమమవుతుంది. ఏ క్షణానైనా ఈ జీవితం అంతం కావచ్చు. ఎప్పుడు అన్నది ఎవరికీ తెలియదు. ఆధ్యాత్మిక శక్తి సంతరించుకొని ఈ యాత్రకు సంసిద్ధుడవై ఉండు. అజ్ఞాత ప్రదేశానికి రిక్తహస్తాలతో పోవడం ఎంతో కష్టమైన పని. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. మరణం అంటే అజ్ఞాత ప్రదేశానికి పోవడమన్నమాట. కాబట్టి నువ్వు యాత్రకు సిద్ధంగా ఉండాలి; సదా మృత్యువు ఆహ్వానానికి తయారై ఉండాలి. ఈ లోకంలో నీ ఆత్మవికాసానికి వలసిన సకల సదుపాయాలు అమరి ఉన్నాయి. కనుక ఇప్పుడే, ఇక్కడే పరమార్థాన్ని పొందడానికి ప్రయత్నించు. మూల విరాట్టును ఆశ్రయించు. అఖండమైన ఆత్మవికాసం కలిగి ఉండు. 'నేను భగవంతుణ్ణి తెలుసుకోగలను' అనే ప్రగాఢ విశ్వాసంతో పురోగమించు. లక్ష్యాన్ని చేరగలవు. ఆపైన నీ జన్మ తరించినట్లే నాయనా! ఈ జననమరణావస్థ నుండి విముక్తి పొందు. భగవంతునికి శాశ్వతమైన అనుచరునిగా మెలగు. అంతకు క్రితం చేసిన తప్పునే నెమరువేసుకొంటూ మనస్సును బలహీనం చేసుకోవద్దు. పాపమా? పాపం మానవుడి దృష్టిలోనేగాని భగవంతుని దృష్టిలో లేదు. ఆయన కృపాకటాక్షం ఒక్కటే మనపై ప్రసరిస్తే చాలు, జన్మజన్మాంతరాల పాపాలు పటాపంచలైపోతాయి. నువ్విప్పుడు భగవాన్ శ్రీరామకృష్ణుల సన్నిధిలో ఉన్నావు. ఆయన్ను విడిచిపెట్టకు. ఏ తాపత్రయానికీ లోనుగాకు. సాధనలకు నీకు కట్టుదిట్టమైన నియమావళి ఉండాలి. ధాన్యపారాయణాదులకు నువ్వు కొన్ని నియమిత సమయాలను కేటాయించి సర్వకాల సర్వావస్థలలోను శ్రద్ధాభక్తులతో క్రమం తప్పక ఆచరించు. స్థిరచిత్తం అత్యావశ్యకమని గుర్తుంచుకో. స్థైర్యం ఉంటేనే విజయం దక్కుతుంది సుమా! సాధనలో స్థిరత్వం కలిగినప్పుడే మనస్సు భగవంతునిపై లగ్నం అవుతుంది. అలా లగ్నం కానప్పుడు సంసార వ్యామోహం సమసిపోదు. కామక్రోధలోభాదులనేవి మనిషికి ప్రబల శత్రువులు. భగవద్భక్తిని సంతరించుకొని బలీయుడవై ఈ మాయాజాలాన్ని తొలగించుకోవాలి. నియమాలను పాటించు. ప్రారంభ దశలో నీ మనస్సు హద్దూ అదుపూ లేకుండా ఎదురు తిరుగవచ్చు. అంతమాత్రం చేత నువ్వు దానికి దాసోహం కానక్కరలేదు; క్రమంగా నువ్వే నీ మనస్సుపై ఆధిపత్యం వహించవచ్చు. అదే ఆత్మనిగ్రహం. ఆత్మసంయమనం లభించి మనస్సు స్వయంగా భగవంతునిలో లీనం అయిన పిదప నువ్వు ఏ నియమక్రమాన్ని పాటించనక్కరలేదు. జీవితం మహానదిలా ప్రవహిస్తూ ఉంటుంది. గడచిన రోజు తిరిగి రాదు. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకో; అవసానసమయంలో వగచి లాభం లేదు. 37. సహనంతో వర్తించు శిష్యుడు : స్వామీ! మేము భార్యాబిడ్డలను, బంధుమిత్రులను, భోగభాగ్యాలను వదలుకొని, జీవిత పరమార్థం తెలుసుకోగోరి, భగవత్సేవలో జీవయాత్ర సాగించాలనే ఏకైక భావంతో ఈ మఠంలోకి వచ్చి చేరాం. కాని ఇక్కడ ఉన్నవారు ఒకరితో ఒకరు పొత్తుకుదరక, ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎడమొహాలు పెడమొహాలుగా ఉండటం, కలిసికట్టుగా మసలలేకపోవడానికి కారణం ఏమిటి? స్వామి : వారిలో కలుపుగోలుతనం కరువైంది, సహనం సన్నగిల్లింది. అదే కారణం, నాయనా! మనకు సహనం కావాలి. సహనం వహించకుండా దేనినీ సాధించలేము. ‘సహనమే సర్వస్వం. సాధకునికి సహనమే జీవగర్ర' అనేవారు శ్రీరామకృష్ణులు. గృహస్థులు కూడ ఎన్నో విషయాలలో సహనం చూపవలసి ఉంటుంది. అందరితో కలసిమెలసి ఉండటమన్నది వారివారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ప్రవర్తనే శీలం అంటారు. అలాంటి సౌశీల్యమే సౌభాగ్యం. అదే మనోబలం. సహనం చేదోడైతేనే మనిషికి మనోబలం చేకూరుతుంది. ఎవరితోను పరుషంగా మాట్లాడకూడదు. ఎవరి మనస్సు నొప్పించరాదు. ఇతరుల మనస్సు నొప్పిస్తే, తనకు మనశ్శాంతి కరువై పడరాని పాట్లు పడే ప్రమాదం ఉంది, నాయనా! ఎన్నడూ అబద్ధం చెప్పకూడదు. సదా నిజమే పలకాలి. కాని "సత్యం బ్రూయాత్ - ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్య మప్రియమ్ ప్రియం చనా నృతం బ్రూయాత్ ఏష ధర్మస్సనాతనః.” అప్రియమైన సత్యమూ - మనుధర్మశాస్త్రం అప్రియమైన సత్యమూ చెప్పరాదు, ప్రియమవుతుందని అసత్యమూ చెప్పకూడదు. ఎదుటి వ్యక్తి మనస్సుకు సంతృప్తిని కలిగించే సత్యాన్నే చెప్పాలన్నారు. కనుక సత్యాన్ని వెల్లడించేటప్పుడు బహుజాగరూకులై మెలగాలి. నా వద్దకు యోగ్యులు, అయోగ్యులు, పతితులు, అభాగ్యులు, బాధితులు, బలహీనులు అయిన విభిన్న వ్యక్తులు ఎందరో వస్తూ ఉండటం గమనించే ఉంటావు. వారిని పతితులని, అయోగ్యులని నిరసించి తరిమిగొడితే వారెక్కడికి పోగలరు? వారిని ఎవరు ఆదరిస్తారు? వారికి ఆశ్రయం ఎవరిస్తారు? వారిని దారిలో పెట్టాలి. ధైర్యం చెప్పి, అండగా నిలబడాలి; ఆదరించాలి. అందరినీ ఎక్కువ తక్కువలు లేకుండా సమభావంతో చూడాలి, ప్రేమించాలి. మహనీయులతో సహజీవనం చేయడం సులభమంటారు. సర్వభూతదయ, సౌజన్య సామరస్య భావాలతో మెలగడం మహనీయులకు కరతలామలకం. అదే వారి మనోబలం. అది సహనం ఉన్నప్పుడే సాధ్యం. కనుక సదా సహనంతో వర్తించాలి సుమా!

No comments:

Post a Comment