Wednesday, August 9, 2023

38.కర్మాచరణ జపధ్యానాదులు తోడునీడలు

38.కర్మాచరణ జపధ్యానాదులు తోడునీడలు స్వామి : నీ సాధనలు నిరాటంకంగా సాగుతున్నాయా నాయనా? శిష్యుడు : లేదు స్వామీ! అనుకొన్నంత బాగా సాగడం లేదు. నాకు తగినంత సమయం, తీరిక చిక్కడం లేదు. పని ఎక్కువగా ఉంటున్నది. అందుచేతనే... స్వామి : తీరికలేక ధ్యానం చేయడం లేదనడం పొరపాటు నాయనా! నీకు స్థిరచిత్తం లేకపోవడమే అందుకు కారణం. కర్మాచరణ, ధ్యానాదులు పరస్పరం తోడునీడలుగా సాగాలి. సమయాన్నంతా జపధ్యానాదులకే వినియోగించ గలిగితే, అంతకు మించిన శ్రేయస్సు మరొకటి ఉండదు. కాని అలా చేయగలిగేవారు ఎందరున్నారు? ఏ పనీ చేయకుండా వృధాకాలక్షేపం చేసే మనుష్యులు రెండు రకాలు. ఏ పనీ చేతకాకుండా మందంగా, వట్టి వాజమ్మలా ఉండే రకం ఒకటి. సమస్త కార్యకలాపాలకూ అతీతుడై ఋషిలా జీవించే వారు మరో కోవకు చెందుతారు. గీతలో చెప్పినట్లు కర్మ చేయకుండా కర్మరాహిత్యం ఎవరూ పొందలేరు.’ 1 ******************************************************* 1. న కర్మాణామనా రమ్భాన్నైష్కర్మ్యం పురషోశ్నుతే | న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ॥ భగవద్గీత 3.4 కర్మలను ఒనర్పకున్నంత మాత్రాన మనిషి నిష్క్రియం, వాంఛాతీతం అయిన ఆత్మస్వరూప స్థితిని పొందడు. కర్మసన్న్యాసం చేసినంత (త్యాగ) మాత్రాన నైష్కర్మ్యసిద్ధి పొందడు. ****************************************************** ధ్యానస్థితిని పొందగోరితే కర్మే సాధనం. కర్మను త్యజించి సన్న్యాసులై జీవించేవారు కూడ జీవితావసరాలైన ఆహారపానీయాదులకోసం కొంత సమయం వెచ్చించవలసి ఉంటుంది. స్వార్థపూరితమైన కర్మాచరణకు బదులు భగవత్రీతికరమై క్రియను ఆచరించు . దాన్నే భగవదారాధనగా భావించు. శారీరకంగాను, మానసికంగాను, నైతికంగాను, ఆధ్యాత్మికంగాను నీకు శ్రేయోదాయకమైనది కర్మాచరణ, నాయనా! నీ మనశ్శరీరాలను భగవత్పాదారవిందాలకు అర్పించు. సంపూర్ణంగా ఆత్మార్పణ గావించుకొని భగవంతునికి దాసునిగా ఇలా విన్నవించుకో: “నా మనశ్శరీరాలు, నా సర్వస్వం నీకు సమర్పించుకొంటున్నాను. ప్రభూ! నేను నీ దాసుడను. నా శక్తిమేరకు నిన్ను సేవించడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నీ ఇచ్ఛవచ్చిన రీతిలో వినియోగించుకో స్వామీ!” ఇలా మనవి చేసుకొంటే ఇహపరాలకు సంబంధించిన నీ యోగక్షేమాలను వహించే బాధ్యత ఆయన మీదే ఉంటుంది. ఆ విషయంగా నువ్వెంత మాత్రం చింతింప పనిలేదు; కాని పరిశుద్ధ హృదయుడవై, పరిపూర్ణ విశ్వాసంతో ఆత్మార్పణం గావించుకొన్నప్పుడే సుమా! సంశయంతో మాత్రం చేయకు. ఒకప్పుడు ఒక వ్యక్తి ఏటిని దాటాలని భగవన్నామం జపిస్తూనే బట్టలు ఎక్కడ తడిసిపోతాయో అని తడవకుండా ఎత్తి పట్టుకున్నాడట. అదొక కథ. శ్రీరామకృష్ణులు చెప్పిన నీతికథలో గొల్లత - పూజారి కథ అది. ఒకప్పుడు ఒక గొల్లపడుచు ఏటికి అవతల ఉన్న ఒక బ్రాహ్మణునికి వాడుకగా పాలు పోస్తూఉండేది. పడవ రాకపోకలు సక్రమంగా లేనందున సకాలానికి రోజూ పాలు అందివ్వలేకపోయేది. ఇలా ఉండగా ఒక రోజు ఆ బ్రాహ్మణుడు ఆ గొల్లపడుచును ఆలస్యానికి నానాచీవాట్లు పెట్టాడు. పాపం అప్పుడు ఆ గొల్లపడుచు దీనంగా ఇలా అన్నది: “నేనేం చేయగలను స్వామీ! ఇంటి వద్దనుండి పెందలకడనే బయలుదేరుతాను. ఏటి గట్టున పడవవాడి కోసం, ఏరు దాటవలసిన వారంతా వచ్చిచేరడం కోసం పడిగాపులు కాయవలసి వస్తోంది. దాంతో పచ్చేసరికి ఆలస్యం అయిపోతున్నది.” అందుకు ఆ బ్రాహ్మణుడు తేలిగ్గా నవ్వేస్తూ, “వెర్రిదానా! భగవన్నామోచ్ఛారణ చేసి సంసారాన్నే దాటవచ్చు. నువ్వు ఈ చిన్న ఏటిని దాటిరాలేవా?” అని అడిగాడు. అమాయకురాలైన ఆ గొల్లపడుచు ఆ పౌరాణికుని మాటను ప్రగాఢంగా విశ్వసించింది. అంతటి సులభమైన ఉపాయం చెప్పినందుకు ఎంతో సంతోషించింది. మర్నాటి నుంచి ఉదయానే సకాలంలో ఆ బ్రాహ్మణునికి పాలు తెచ్చి ఆమె అందించసాగింది. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు సకాలంలో పాలు రావడం చూసి ఆ గొల్లపడుచుతో, “నువ్వు ఈ మధ్య చాలా పెందలకడనే పాలు తెచ్చి పోస్తున్నావు. ఎలా రాగలుగుతున్నావు?” అని యథాలాపంగా అడిగాడు. అందుకు ఆమె, “అదేమిటి స్వామీ! తమరు సెలవిచ్చినట్లే ఆ దేవుని పేరు చెప్పుకొంటూ ఏరుదాటి రాగలుగుతున్నాను. ఇక ఆ పడవతో నాకు పనిలేదు” అన్నది. ఆమె మాటలు విని ఆ బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయాడు. అతడికి ఆమె మాటలు నమ్మశక్యం కాలేదు. కాస్త తేరుకొని ఆ బ్రాహ్మణుడు, “నువ్వు ఏటిని ఎలా దాటి వస్తున్నావో కళ్ళారా చూస్తేగాని నమ్మను” అన్నాడు. వెంటనే ఆ గొల్లపడుచు ఆ బ్రాహ్మణుని తోడ్కొని వెళ్ళి, చకాచకా ఏటి నీటిపై నడచిపోసాగింది. కాస్సేపటికి ఆమె వెనక్కు తిరిగి చూడగా ఆ బ్రాహ్మణుడు దూరంలో నీళ్ళలో నడవలేక నానా అవస్థా పడుతూ ఉండటం కనిపించింది. వెంటనే ఆమె, "ఇదెక్కడి చోద్యం స్వామీ? నోటితో దేవుని పేరు చెబుతూ బట్టలు ఎక్కడ తడిసిపోతాయో అని తడవకుండా వాటిని పైకి ఎత్తిపట్టుకొని తంటాలు పడుతున్నావే? నువ్వెక్కడి మనిషివి? దేవుణ్ణి పూర్తిగా నమ్మినట్టు లేదని తెలుస్తోంది” అన్నది బుగ్గమీద వేలువేసుకొని. నిజమే మరి. సంపూర్ణంగా ఆత్మార్పణం చేసుకొంటేనే గాని భగవదనుగ్రహం లభించదు కదా! శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం మేం ఐదారేళ్ళపాటు పరివ్రాజక జీవనం కొనసాగించాము. ఆ రోజుల్లో స్వామీజీ (స్వామి వివేకానంద) నాతో ఏకాంతంలో, "ఇలా తిరుగాడుతూ ఉండటంలో ప్రయోజనం ఏమీ లేదు. శ్రీరామకృష్ణుల నిమిత్తం సేవ లొనరించు” అన్నారు. ఆ రోజుల్లో ఎంతో కృషి చేసేవారం; కష్టం ఏమీ అనిపించేది కాదు. నిజం చెప్పాలంటే అది మాకెంతో ఫలదాయకంగా పరిణమించింది. మాకు స్వామీజీ మాట పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంది. నువ్వు కూడ శ్రీరామకృష్ణుల, స్వామీజీల పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండి వారి నిమిత్తం వారికి ఇష్టమైన సేవాకార్యాలు ఒనరించు. కార్యాచరణ, జపధ్యానాదులను జతగా సాగించాలి. ప్రారంభంలో వాటిని అలా జతపరచి సాధన కొనసాగించడం కష్టంగానే ఉంటుంది. అయినా ఫలితం లభించే వరకు విడవకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: “అప్పుడే పుట్టిన దూడ నిలబడడానికి ప్రయత్నిస్తుంది. అనేకసార్లు తడబడి, క్రింద పడుతుంది. అయినా ప్రయత్నం మానదు. పడుతూ లేస్తూ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటుంది. లేచి నిలబడే వరకు మాత్రమే కాదు, పరుగెత్తడం నేర్చుకొనే వరకు తన ప్రయత్నం సాగిస్తూనే ఉంటుంది.” పారమార్థిక జీవిత ప్రారంభ దశలో ఏదో ఒక నిర్ణీత కార్యాన్ని చేగొని కొనసాగిస్తేనే మనస్సుకు సుశిక్షణ అలవడుతుంది. మనస్సు సుశిక్షితమైతేనే దాన్ని ధ్యానాది సాధనల్లో నియోగించేందుకు వీలవుతుంది. మనస్సుకు సరైన శిక్షణ లేకుంటే నిలకడలేక అది నలువైపులా సంచరిస్తుంది. నిలకడలేని మనస్సు ధ్యాన సమయంలో చంచలమవుతుంది. ఆధ్యాత్మిక వికాసం పొందిన వ్యక్తికి ధ్యానప్రార్థనలలోనే కాలం గడపవలసిన సమయం ఆసన్నమౌతుంది. ఆ సమయం రాగానే కర్మాచరణ అతడి నుండి తనంతట తానుగా తొలగిపోతుంది. మనస్సులో ఆధ్యాత్మిక చైతన్యం జనించినప్పుడు ఇది సంభవిస్తుంది. చైతన్యరహితమై కేవల సంకల్పబలం చేతనే అనుష్ఠించే ఆధ్యాత్మిక సాధనలు ఎంతోకాలం కొనసాగవు. విసుగు జనించవచ్చు. కాదు కూడదని మరీ మొండికేస్తే మతిభ్రమణం ఏర్పడే ప్రమాదం కూడ ఉంది. కొందరు ఆషామాషీగా ఆధ్యాత్మిక మార్గం అవలంబిస్తూ, తక్షణమే లౌకిక విషయాల్లో మునిగిపోతారు. అలా చేయడం ఎన్నటికీ క్షేమదాయకం కాదు. బ్రహ్మచర్యం పాటిస్తే ఎంతో శక్తిని సముపార్జించడానికి వీలవుతుంది. నిజమైన బ్రహ్మచారి పనిలో తానొక్కడే పాతికమంది పెట్టు. కనుక బ్రహ్మచర్యంతో బాటు జపధ్యానాలు చేస్తూ, సాధుసాంగత్యంలో కాలం గడుపు. తమ జీవితాలకు అనువైన మార్గం ఏదో నిర్ధారించుకోవడం ఎందరికో తెలియదు. అందుకే సత్సాంగత్యం నెరపమంటారు. ఏకాంతంలోగాని , సాధుసాంగత్యంలో గాని కొంతకాలం గడపనిదే ఎవరికీ వారివారి మనస్తత్త్వాలు బోధపడవు. సాధుసాంగత్యం విచక్షణాజ్ఞానాన్ని కలుగజేస్తుంది. మనస్సు గందరగోళంగానో, అల్లకల్లోలంగానో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక వికాసం దుర్లభం. ప్రతి ఒక్కరికి స్వతంత్ర ఆలోచన ఉండాలి. తాను ఎంచుకొన్న మార్గంలో పయనించి ప్రతివ్యక్తీ ఆత్మవికాసం పొందాలని నా ఆకాంక్షా, ఆశయమూ. కొందరికి స్వయం నిర్ణయం ఉండదు. అలాంటి వారికి నా సాయం ఎప్పుడూ ఉంటుంది. జీవితానికి సార్థకత, శాశ్వతత్త్వం సంతరింప చేసుకోవడం నీ ఆధీనంలోనే ఉంది. భగవత్సేవార్ధం ఎన్ని జన్మలను వినియోగించినా కాలం వ్యర్థమూ కాదు, జన్మ నిరర్థకమూ కాదని తెలుసుకో. అట్టి జన్మ ఎన్నటికీ నిరర్థకం కాబోదు. శ్రీరామకృష్ణుల దయతో నీ ఆధ్యాత్మిక మార్గం ఏదో స్వయంగా నువ్వే తెలుసుకోగలవులే! ఆహార నిద్రాదుల సంతృప్తిలో ఇక ఎంతమాత్రమూ కాలాన్ని వృథాచేయకు. ప్రాలుమాలడం విడిచిపెట్టు. లేకుంటే పారమార్థిక సాధనలు సక్రమంగా అనుష్ఠించలేవు. నువ్వు ఏ పని చేస్తూన్నా, మనస్సు నిలిపి చెయ్యి. స్వామీజీ చెప్పినట్లు కర్మరహస్యం అంటే ఇదే. భగవత్రీత్యర్ధం పనిచెయ్యి. పనిని ప్రారంభించ బోయే ముందు భగవత్ ప్రార్థన చేసి మరీ మొదలుపెట్టు ప్రారంభంలోనే కాదు, మధ్యలో, పని ముగించిన తరువాత కూడ భగవంతుని స్మరించి, ప్రణమిల్లు. శ్రీరామకృష్ణుల ఉపదేశాలను నెమరువేసుకొంటూ కాలం గడుపు. నువ్వు చేసే ప్రతి పనీ ఆయన సేవగా భావించి చెయ్యి. మనశ్శాంతికి ప్రయత్నించు. సోమరితనానికి బానిసవుకాకు. మనస్సంతృప్తి, సంతోషంకోసం కృషి సలుపు. ఒక తీరైన దారీతెన్ను గానకుండా మనస్సును తిరుగనిస్తే ఎన్నో ప్రమాదాలకు గురికావలసి వస్తుంది. కామక్రోధాదులు నిన్ను వశం చేసుకొంటాయి. జపధ్యానాదులు ఒనరిస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. నువ్వు వాటిని జయిస్తావు. అవే నీకు స్వయంగా లొంగిపోతాయి. ప్రారంభం నుంచే వాటిని నీ అదుపు ఆజ్ఞలలో ఉంచడానికి ప్రయత్నించాలి. సాధనా మార్గాన్ని అవలంబించు, జపధ్యానాలు కొనసాగించు. నిరంతరం సాధన సాగిస్తే క్రమంగా భగవత్ చింతనామగ్నుడవై గంటల పర్యంతం ధ్యాననిష్ఠలోనే ఉండాలని కోరుకొంటావు. ప్రారంభ దశలో సాధకుడు రోజుకు నాలుగైదు పర్యాయాలు కాస్సేపు ధ్యానానికి ఉపయోగించడం క్షేమం. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా జపసాధన చేయాలి. దీక్షపూని చేశావంటే మనస్సు ధ్యానంలో మగ్నమవడం తథ్యం. ప్రశాంతత పొందాలంటే నియమంగా సాధన చేయాలి. అప్పుడు ఆత్మప్రబోధం కలిగి తీరుతుంది. ఆ ప్రబోధం జనించినప్పుడు, నీలోని కామ క్రోధాదులన్నీ అణగిపోతాయి. 39. స్వీయమోక్షం - జగత్కళ్యాణం స్వామి : స్వామి తురీయానంద, నేను ఆబూ పర్వతం మీద వసిస్తున్న రోజుల్లో స్వామి వివేకానంద నుంచి మాకు ఓ ఉత్తరం వచ్చింది. అది ఆయన అమెరికా వెళ్ళబోయే ముందు మాట. 'బహుజన హితార్థమూ, బహుజన సుఖార్థమూ మీ జీవితాలను వినియోగించడమే మీ ధర్మం. అదే పరమార్థం.’ ఇదీ ఆ ఉత్తరంలోని విషయం. నిజమే స్వార్థం నిమిత్తం చేసే పని ఎన్నటికీ పరమార్థం కాదు కదా! ఎంతటి అద్భుత సత్యం! ఆయన వచనాలు నా మనోఫలకంపై చెరగని ముద్ర వేశాయి. మీరు నిర్వర్తించే శ్రీరామకృష్ణ సేవాసంఘ కార్యకలాపాలు మీ ధ్యానానికి, మీ ఆత్మవికాసానికి ఆటంకాలని మీలో కొందరు భావిస్తున్నట్లుగా నా చెవినబడింది. స్వామి ప్రేమానంద, నేను దాన్ని నిరాధారంగా పరిగణిస్తున్నాం. మా ఉద్దేశాన్ని మీరు గ్రహించలేదు. మీకు ప్రత్యేకంగా అప్పగించిన కార్యకలాప నిర్వహణతోబాటు, నియమబద్ధమైన మీ జపధ్యానాదులను కొనసాగిస్తూ ఉండవలసినదేనని పదే పదే నొక్కి వక్కాణిస్తున్నాను. కార్యారంభంలో, మధ్యలో, ముగింపులో కూడ భగవన్నామ స్మరణను మీరు మానకూడదు. 'విధి నిర్వహణతోబాటు ధ్యానప్రార్థనాదులు కూడ ఆచరించండి' అని స్వామీజీ చెప్పడం తరచు వింటూనే కదా! ప్రారంభ దశలో రేయింబవళ్ళు ధ్యానమగ్నులై ఉండటం ఎవరికైనా సాధ్యమేనా? ఊహు. కాబట్టి మీరు బంధముక్తులై, సంగరహితులై పరహితార్థం కర్మలు ఆచరించాలి. కర్మలు చేయకుంటే దురాలోచనలు, పనికిమాలిన విషయాలు మనస్సులో జొరబడి మనస్సును కలుషితం చేస్తాయి. నిత్యకృత్యాలతోపాటు పూజాధ్యానాలను అనుష్ఠించాలనే ఆదర్శాన్ని గీతాది శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. స్వానుభవపూర్వకంగా నేను దీన్ని ధ్రువపరుస్తున్నాను. 'పూజాధ్యానాదికాలు, కర్మాచరణ అన్నవే ఆధ్యాత్మిక వికాసానికి సునిశ్చితమైన మార్గాలు.' ఇప్పుడు జరుగుతున్న ఘోరసంగ్రామాన్ని చూస్తున్నారు కదా! నిరర్థకమైన దేశభక్త్యావేశంతో జనం తమ ఆలుబిడ్డలను, సమస్త సుఖాలను విడిచిపెట్టి కేవలం లౌకిక ప్రయోజనం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారే! ‘ 1 ****************************************************** 1. మొదటి ప్రపంచ యుద్ధం సూచితం. ******************************************************* అలాంటప్పుడు ఉత్తమ ఆదర్శాలకై, భగవత్సాక్షాత్కార నిమిత్తమై, జగత్కళ్యాణార్థమై ఇల్లువాకిలీ, సమస్త సౌఖ్యాలు విడిచిపెట్టి శ్రీరామకృష్ణుల చరణ సాన్నిధ్యంలో ఆత్మసమర్పణ గావించుకొంటే ఎంత మహత్తర ప్రయోజనం ఉంటుంది! అలాంటి ఉత్తమ కార్యాచరణని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారా? స్వామీజీ మాతో ఇలా అనేవారు: “పరహితార్థం జీవితాన్ని వ్యర్ధపుచ్చుతున్నామని భావిస్తున్నారా? వ్యర్థమే కానివ్వండి. నిరర్థకమైన విషయాలకై మీరు ఇంతకు పూర్వం ఎన్ని జన్మలు వ్యర్థం చేసి ఉండలేదు? లోకోపకారార్థం ఈ ఒక్క జన్మ వృథాయైతే ఏం ఫరవాలేదు.” కాని నీ జీవితం వ్యర్థం కాదని నేను చెబుతున్నాను. నీ కర్మాచరణ మూలంగా భగవత్సాక్షాత్కారం పొందుతావు. జపధ్యానాదులకు వలసినంత సమయం, అనుకూల పరిస్థితులు అవసరం అనడంలో సందేహం లేదు. కాని జపధ్యానాదులు అనుష్ఠింపదలచినవారు ఎట్టి పరిస్థితులు ఎదురైనా, మానరు. వ్యవధి లేదనో, అనుకూల ప్రదేశం లభించలేదనో చెప్పేవారు మాత్రం ఈ జన్మలో ఏదీ సాధించలేరు. ఊరకే ఉన్నా, పనిలో ఉన్నా దైవస్మరణను అలవరచుకోండి. ఇట్టి భావవాహినియే ధ్యానం. భగవత్ స్మరణ విషయంలో దేశకాల పరిస్థితులను గమనించవలసిన పనిలేదు. సాధనలో మనస్సును లగ్నంచెయ్యి. ఆహా! అది ఎంతటి దివ్యానందమో! ఆ ఆనందాన్ని ఒక్కమారు చవిచూడు. ఆపైన మరేదీ నీకు రుచించదు. కర్మాచరణం అంటే భయం ఎందుకు? భగవంతుని గురించి, భగవదనుగ్రహాన్ని పొందడానికి కర్మను ఆచరించాలి. స్థిరచిత్తంతో కర్మను ఆచరించాలి సుమా! అతిసామాన్యమైన కర్మయైనా, మహాఘనకార్యమైనా అమిత శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. అలాంటప్పుడు సాంసారిక క్రియాకలాపాల్లో నిలకడైనవారు, ఆధ్యాత్మికమైన సాధనలలో కూడ నిలద్రొక్కుకొని మనగలుగుతారు. సదా కర్మపట్ల విశేష పూజ్యభావంతో, కర్మఫలాన్ని గురించి ఉదాసీనభావంతో అంటే ఫలాపేక్ష ఆశించక కర్మాచరణ కొనసాగించాలి. చేసే ప్రతి పని భగవదర్పణగా భావించి చేసినట్లయితే, నీకు కర్మాచరణ పట్ల ఎన్నటికీ అరుచి కలుగదు, ఆసక్తి తరుగదు. ఆ కిటుకు తెలియనప్పుడే మనోక్షోభం కలుగుతుంది. మనస్సు వ్యాకులత చెందితే పారమార్థిక జీవితంలోగాని, లౌకిక విషయాలలోగాని విజయం సాధించలేవు. పేరుప్రతిష్ఠలు సముపార్జించడానికి ఘనకార్యాలు చేయడం సులువే. అట్టి కార్యాలను బట్టి ఆ వ్యక్తి యోగ్యతను, అర్హతను నిర్ణయించలేము. నిజానికి ఒక వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోగోరితే అతడి నిత్యవిధులు ఎలాంటివో పరిశీలించాలి. అతడి యథార్థ స్వరూపాన్ని వెల్లడించేవి నిత్యకృత్యాలే. కర్మయోగి అయినవాడు ఏ పనినైనా, చివరకు ఎంత నికృష్టమైన పనినైనా ఏవగించుకోక మనస్ఫూర్తిగా దాన్లో లీనమై చేస్తాడు. జనం మెప్పు పొందాలనే ఆకాంక్ష అతడికి ప్రేరణ కాదు. ఒక వంక కర్మకలాపాలు ఆచరిస్తూ భగవంతుణ్ణి మరిచావంటే అహంకారం నిన్ను క్రమ్మేసిందని తెలుసుకో. కనుక నువ్వు కర్మాచరణుడవై ఉన్నా భగవంతుని ఎన్నడూ విస్మరించరాదు. నీ సాధనలను నిష్ఠతో కొనసాగిస్తూనే ఉండాలి. ఒక యువశిష్యుడు ఏకాంత ప్రదేశానికి పోయి తపస్సు చేయాలని నిశ్చయించుకొన్నాడు. అందుకై స్వామి అనుమతి కోరాడు. అతడి నిశ్చయాన్ని విని స్వామి ఆందోళన చెంది, "స్వామి శివానందని ఇక్కడకు రమ్మన్నానని చెప్పు” అని మాత్రం అన్నారు. స్వామి శివానంద వచ్చి, స్వామి బ్రహ్మానంద ప్రక్కన కూర్చున్నారు. అప్పుడు స్వామి ఆతురతతో ఇలా అన్నాడు: “చూడు తారక్ భాయీ! (స్వామి శివానంద పూర్వాశ్రమ నామధేయం తారకానాథ్ ఘోషాల్) తపస్సు చేసుకోవడానికి ఈ కుర్రవాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటున్నాడు. మన కుర్రవాళ్ళ ధోరణి ఈ విధంగా ఎందుకు మారుతున్నదో నాకు అంతుబట్టడం లేదు.” "స్వామి రామకృష్ణానంద ఆదర్శజీవితంతో పునీతమైన ప్రదేశం కదా ఇది. ఈ మఠంలో ఆయన ఎంతటి అద్భుత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాడు! ఇంత పవిత్రమైన వాతావరణం మరెక్కడ ఉంటుంది? ఈ కుర్రవాళ్ళు అసలు తపస్సు చేయాల్సిన అగత్యం ఏం వచ్చిపడింది? వీరందరి నిమిత్తం మనం చేసింది చాలదా? వీరి బుద్ధికి నిలకడ లేకపోవడమే వీటన్నిటికి కారణం. అందుకే ఈ వెర్రిమొర్రి ఆలోచనలు.” ఆ పిదప ఆ యువ శిష్యునితో ఇలా అన్నారు: 'భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?' అని నువ్వు అనుకొన్నంత కాలం నీకు దక్కేది అశాంతే. భగవంతుడు (హృదయాన్ని సూచిస్తూ) ఉన్నది ఇక్కడ అని నువ్వు గ్రహించగలిగినప్పుడే నీకు శాంతి లభిస్తుంది. అంతవరకు ఏమీ కాదు. దేశద్రిమ్మరిపై ఒక చోటునుంచి మరో చోటుకు తిరుగుతూ ఉంటే ఏం ప్రయోజనం? అలా దిమ్మతిరిగే వందలాది బైరాగులను, సన్యాసులను నువ్వు చూడడం లేదా? వాళ్ళు సాధించింది ఏముంది? నువ్వూ వాళ్ళలాగానే తయారవ్వాలా? ఒక మహత్తరమైన ప్రయోజనాన్ని సాధించాలనే సదుద్దేశంతో స్వామి వివేకానంద ఈ మఠ సంస్థను నెలకొల్పారు. ఆ విషయం అర్థంచేసుకొని అందుకు అనుగుణంగా నీ నడవడిని మలచుకొని జీవించు. వ్యక్తి అనుష్ఠించే ఆధ్యాత్మిక సాధనల ఫలితంగానే మఠానికి పవిత్రత చేకూరుతుందని గ్రహించు (దైవాన్వేషణ ప్రకరణం చివర చూడండి) భగవాన్ శ్రీరామకృష్ణులు వసించిన రోజుల్లో దక్షిణేశ్వరాలయంలో ఎంత అద్భుత ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసిందో. మా పడవ రేవును చేరి ఆలయఘట్టం మెట్లను అనుకొంటే చాలు; స్వర్గధామాన్ని సాక్షాత్తు పరంధామాన్ని చేరినట్లు మాకు అనిపించేది. పైగా సోదరశిష్యులమైన మేం పరస్పరం ఎంతటి ప్రేమానురాగబద్ధులమై ఉండేవారమో! అంతటి అనురాగబంధాలు ఈ మధ్య కాలంలో కానరావడం లేదు. సాధువు అయిన వ్యక్తి ప్రేమామృతమైన మనస్తత్వం కలవాడై ఉండాలి. ఎన్నడూ ఎవరితోనూ పరుషంగా మాట్లాడరాదు. బృందావనంలో కలుసుకున్న సాధుపుంగవుని ఉదంతం నాకిప్పుడు జ్ఞప్తికి వస్తోంది. నేను వెళ్ళే ఆలయానికి ఆయన రోజూ వచ్చేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఆయన కొన్నిరోజుల తరబడి ఆలయంలో కనబడకపోయేసరికి నేను దిగులు చెందాను. మరి కొన్నిరోజులు గడిచాక, ఆయన ఆలయంలో కనిపించాడు. 'మీరు ఇన్నాళ్ళుగా ఆలయానికి ఎందుకు రాలేదు?” అని ఆతురతతో ఆయన్ను అడిగాను. 'కాలు నొప్పి చేసినందున రాలేకపోయాను' అని ఆయన ముక్తసరిగా జవాబిచ్చాడు. 'ఎందువల్ల?' అని నేను ఎదురు ప్రశ్న వేశాను. అప్పుడు ఆయన జరిగిన ఉదంతం గురించి ఇలా చెప్పాడు: 'జనసమ్మర్దంలో ఒకరోజు ఎవరో భక్తుని కాలు నా కాలిమీద పడినందున, కాలు నొప్పిచేసి కాస్త ఇబ్బంది కలిగింది.’ ఆయన చెప్పే తీరు విని నిర్ఘాంతపోయాను. ఎవడో కళ్ళునెత్తికెక్కి తన కాలు ఖసుక్కున తొక్కాడని ఆయన చెప్పలేదు. అందుకు కారణం ఆయన దృష్టిలో ప్రతి పాదమూ భగవంతుని పాదమే. భగవంతుడే స్వయంగా పాదాన్ని తన కాలిపై మోపి ఉంటాడని ఆయన భావన. మీరందరూ ఇంగితంతో ప్రవర్తిస్తే, మీ హృదయాలు ప్రేమరంజితాలైతే ఎంతో సామరస్యం ఏర్పడుతుంది. మీ ప్రేమానురాగాలన్నిటికీ భగవంతుడే కేంద్రంగా భావించండి. మీ సాధనలు కొనసాగడానికి అనువైన వసతులన్నీ ఈ మఠంలో అమరి ఉన్నాయి కదా! నువ్విప్పుడు యువకుడవు, నియమనిష్ఠలను పాటించడానికి తరుణం ఇదే. వయస్సు పైబడ్డాక నువ్వేం చేయగలవు? హృదయంలో ప్రేమను పెంపొందించుకో, సర్వమూ సాధించగలుగుతావు. నిరుత్సాహం చెందకు. ప్రారంభంలో నువ్వు కనబరచిన ఉత్సాహం అంతా ఇప్పుడు ఏమైపోయింది? ప్రస్తుతం అనుష్ఠిస్తూన్న సాధనతోనే తృప్తిచెందినట్లు కనబడుతున్నావు? అలా సంతృప్తుడవు కారాదు. సాధన పరంగా అసంతృప్తుడవే అయివుండాలి. అన్వేషణ సాగించి, ముందడుగు వేసేందుకు ప్రయత్నించు; వజ్రాల గని చేజిక్కే వరకు ఆగవద్దు. శ్రీరామకృష్ణులు తరచు చెప్పే నీతికథను స్వామి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఒకప్పుడు కట్టెలు కొట్టేవాడొకడు అడవికి పోయి కట్టెలుకొట్టి తెచ్చి, వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో జీవయాత్ర భారంగా సాగిస్తూండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఈ కట్టెలు కొట్టేవాడు కట్టెలు కొడుతూ ఉన్నప్పుడు ఒక సన్న్యాసి ఆ అడవి దారివెంట పోతూ అతణ్ణి చూసి, “ఇంకా ముందుకుపో, లబ్ది పొందుతావు” అన్నాడు యథాలాపంగా. మర్నాడు ఆ కట్టెలుకొట్టేవాడు ఆ సన్న్యాసి మాటలను పాటించి అడవిలో మరింత ముందుకు పోయాడు. అక్కడ అతడికి మంచిగంధం చెట్లు కనిపించాయి. అతడు అమితానందభరితుడై తాను మోయగలిగినన్ని గంధపు చెక్కలు కొట్టి, వాటిని విక్రయించి బాగా ధనం అర్జించాడు. అంతటితో అతడు ఊరుకోలేదు. 'ఆ సన్న్యాసి తనను ఇంకా ముందుకు పొమ్మన్నాడేగాని గంధం చెట్ల వద్ద ఆగిపోమ్మనలేదే' అని తలపోసి, ఒకరోజు అడవిలో గంధం చెట్లను దాటి మరికొంత దూరం వెళ్ళాడు. అక్కడ అతడికొక రాగిగని కనిపించింది. ఆ రీతిలో అతడు నానాటికి మున్ముందుకు వెళ్ళగా అతడికి వెండిగని, బంగారుగని, వజ్రాలగని కనిపించాయి. ఆ కట్టెలుకొట్టి దుర్భర జీవనం సాగించే ఆ వ్యక్తి ఆఖరికి అపర కుబేరుడయ్యాడు. బ్రహ్మజ్ఞానం సముపార్జించగోరే వ్యక్తి విషయం కూడ ఇంతే. ఏ కొద్దిపాటి సిద్ధులనో, మహిమలనో, శక్తినో సంపాదించగానే తాను సకలమూ సాధించాననుకోరాదు. పట్టుదలతో సాధన సాగిస్తూనే ఉండాలి. అప్పుడే శాశ్వతమైన బ్రహ్మానంద ప్రాప్తికి అర్హుడవవుతావు. నువ్వు శ్రీరామకృష్ణుల అండన చేరావు. పిన్న వయస్కుడవు, పవిత్రుడవు. మహోన్నతుడవడానికి వలసిన అవకాశాలు ఎన్నో దివ్యంగా అమరివున్నాయి నాయనా! మా మాట విను. మేము చెప్పేవాటిని ఆసక్తితో ఆచరించడానికి గట్టి ప్రయత్నం చేయరాదా? నీ మనస్సును, మాటను ఏకం చెయ్యి. నీ మనస్సు నిన్ను మోసం చెయ్యకుండా చూసుకో! 'ఆత్మనోమోక్షార్థం జగద్ధితాయచ' అన్నట్లు స్వీయమోక్షం - జగత్కళ్యాణం అన్నదే స్వామి వివేకానంద ఆదర్శం. అందుకై ఒక చేత్తో భగవత్పాదారవిందాలను పుచ్చుకొని, రెండవ చేత్తో జగత్కళ్యాణకరాలైన కార్యాలను ఒనరించు. 40. ఏకాగ్రతే ఏకైక మార్గం పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టే ఘనకార్యాలు ఒనరించడం సులభం. కాని నిజమైన కర్మయోగి పేరు ప్రతిష్ఠల నిమిత్తం ఏ పనీ చేయడు; పేరు కోసం తాపత్రయపడడు. తను చేసే పని అల్పమైనదైనా, ఘనమైనదైనా దానిని భగవదారాధనగానే భావించి మనస్పూర్తిగా నిర్వర్తిస్తాడు. మనిషిలోని మంచిచెడులను అతడి నడతను అతడి ఆచరణనుబట్టే కదా నిర్ధారించడం జరుగుతుంది. ప్రతి వ్యక్తీ తనకు ఇష్టమైన పనిని చేయాలనే తలుస్తాడు. కాని కర్మరహస్యం, కీలకం అది కాదు. నువ్వు ఏ పని చేస్తున్నా, అది నీకు ప్రియమైనా, అప్రియమైనా దైవకార్యంగా ఎంచి దానిని నిర్వర్తించాలి. ఏ పని చేసినా దాన్ని భగవదారాధనగానే భావించడం నేర్వాలి. మనస్సును మూడుపాళ్ళు భగవంతునిపై నిలిపి, నాలుగవ పాలు కర్మాచరణకు వినియోగిస్తే, నాడు నువ్వు చేసే ప్రతి పనీ దైవారాధనే అవుతుంది. అప్పుడు నీ హృదయం పరమానందభరితమవుతుంది. ఎలాంటి పరిస్థితులలోను, నువ్వు ఏ కార్యంలో నిమగ్నుడవై ఉన్నప్పటికీ సాధనలను విడిచిపెట్టకూడదు. జపధ్యానాదులు వీడి, కేవలం క్రియాశీలుడవే అయితే తప్పక అహం తలెత్తుతుంది. దాని వలన కలహం ఏర్పడి, కలతలకు కారణభూతమవుతుందని తెలుసుకో. (ఎవరో ఒక సీసా పగులగొట్టారట) అప్పుడు స్వామి ఏమన్నారో తెలుసా? అయ్యో, ఎంత అజాగ్రత్తగా ఉన్నావు? నీ ధ్యాస ఎక్కడుంది? ఇంత నిలకడలేని మనస్సుతో నువ్వు ఏం సాధించగలవు? పని చిన్నదైనా, పెద్దదైనా మనస్సుపెట్టి చేయకుంటే, సానుకూలమౌతుందా? దీనికైనా ఏకాగ్రత అత్యవసరం సుమా! కర్మాచరణలో ఏకాగ్రత ఉంటేనే ధ్యానసమయంలో కూడ ఏకాగ్రత కుదురుతుందని గ్రహించు. కర్మరహస్యాన్ని చెబుతాను విను. మొదట నీ సొంత పనులపట్ల ఇష్టం పెంచుకో. కాని ఫలితాన్ని ఆశించకు.’ 1 ********************************************************* 1. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ! మా కర్మఫలహేతుర్భూర్మాతే సబ్లో స్వకర్మణి ॥ - గీత 2.47 కర్మ ఒనర్చడానికి మాత్రమే నీకు అధికారం ఉంది, కర్మఫలాలకు ఎన్నడూ లేదు. ఫలాలను ఉత్పన్నం చేసే కర్మలను ఒనర్చకుందువుగాక! కర్మలను విడనాడటంలో ఆసక్తి పొందకుందువు గాక! ********************************************************* కర్మాచరణ వల్లనే మోక్షప్రాప్తి లభిస్తుందని గీతాచార్యుని వాక్కు కాని తీవ్రవైరాగ్యం ఉన్నప్పుడే అది సాధ్యం. మోక్షం పొందాడంటే అతడు కర్మయోగి అని నువ్వు గ్రహించాలి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులన్నిటిని కూడగట్టుకొన్నప్పుడే నువ్వు భగవదనుగ్రహానికి పాత్రుడవు కాగలవు. కనుక కర్మాచరణుడవు కావాలి. సదా భగవంతుని స్మరిస్తూ ఉండాలి. శ్రద్ధ లోపించిన వ్యక్తికి భగవత్ప్రాప్తి లభించదు. శ్రద్ధ కలిగి ఉండాలి. నిజమైన శ్రద్ధ ఉన్నవాడికే భగవత్ప్రప్తి తథ్యం. శ్రద్ధ లేనివాడు చిల్లిగవ్వకు కొరగాడు. శ్రద్ధ లుప్తమైన కార్యాలన్నీ వ్యర్థమే సుమా! శ్రద్ధాభక్తులు ఉన్నవాడే సంశయరహితుడై ఉంటాడు. త్యాగవైరాగ్యాలు లేనిదే శ్రద్ధాభక్తులు అంకురించవు. వైరాగ్యం ఎంతో అవసరం. అది అహంకారానికి గొడ్డలిపెట్టు అని గ్రహించు. కనుక కర్మాచరణకు ఏకాగ్రత ఉండే తీరాలి.

No comments:

Post a Comment

చింతన