ఆనవాళ్లు చెరిపేద్దామా?
యం.డి.జమీలొద్దీన్ 86862 11556
మా ఊరి రాంరెడ్డి రోజు లాగానే మొన్న రాత్రి కూడా టీవీ చూస్తున్నడు. తనకు ఇష్టమైన ఆంధ్ర దీపం చానల్ పెట్టిండు. 'తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుంట చేస్తా'నని తన ప్రియతమ నాయకుడు శపథం చేయడాన్ని రాంరెడ్డి చూసిండు. అప్పటికే ఊరిలోని బెల్టుషాపులో చీపులిక్కర్ తాగిన ఆయన తాను కూడా ఈ మహాయజ్ఞంలో సమిధ కావాలని బలంగా నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నాడు.
పొద్దున లేవగానే రాత్రి చేసిన శపథం రాంరెడ్డికి గుర్తుకొచ్చింది. ఈ రోజు ఎట్లయిన సరే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసుడేనని మనసులో గట్టిగా అనుకున్నడు. ముందుగాల రెడీ అవుదామని.. పండ్ల పుల్ల కోసం ఇంటి బయట ఉన్న వేప చెట్టు దగ్గరకి పోయిండు. అక్కడ హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్లలో ఆయనకు కేసీఆర్ కనిపించిండు. ఇన్ని కోట్ల చెట్లు ఎట్లా పీకాలె, కేసీఆర్ ఆనవాళ్లను ఎట్లా చెరిపేయాలో రెడ్డి సాబు అర్థం కాలె! పండ్ల పుల్ల వేసుకొని ఇంటి మూలమలుపులకు వెళ్లేసరికి పాడుబడ్డ బోరింగ్ను చూడంగనే కాంగ్రెస్, టీడీపీ హయాంలో దాని పూర్వవైభవం గుర్తుకొచ్చింది. బిందెడు నీళ్ల కోసం తమ వాడలోని ఆడవాళ్లు కొట్టుకొని పోలీస్ స్టేషన్కు పోయిన విషయం యాది కొచ్చింది. ఇప్పుడు ఎవరి ఇండ్లల్లో వాళ్లు నీళ్లు పట్టుకుంటున్నరు. ఆ మిషన్ భగీరథ నీళ్లలో మళ్లీ కేసీఆర్ కనిపించిండు రాంరెడ్డి సాబు. చెరువు కింది పొలానికి నీళ్లు పెడదామని బయల్దేరిన రెడ్డి సాబ్కు మిషన్ కాకతీయ పథకంలో బాగు చేసిన చెరువు నిండుకుండలా స్వాగతం పలికింది. ఆ చెరువులోనూ కేసీఆర్ కనిపించిండు. చెరువులో వలలు వేసి ఒక్కొక్కటి 10 కిలోలు పెరిగిన చేపలు పట్టి మురిసిపోతున్న మత్స్యకారుల ముఖంలోనూ కేసీఆరే.. చెరువు కట్టపై పెరిగిన ఈత వనంలో కేసీఆరే.. పోయేటప్పుడు ఆయనకు ఎదురొచ్చిన గొర్ల మండ మేపుతున్న వ్యక్తిలో కూడా కేసీఆరే కనిపించిండు రెడ్డి సాబు.
తన పొలంలో మోటరు సాలు జేస్తుంటే.. కాంగ్రెస్, టీడీపీ హయాంలో దొంగరాత్రి కరెంటు పెట్టబోయి పాము కాటుకుగురై చనిపోయిన పాలేరు మల్లయ్య యాదికొచ్చిండు. పొలానికి వస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కేసీఆర్ పుణ్యమేనని గుర్తుజేసుకుండు. అప్పట్లో ఎకరం పారించని తన బాయి ఇయ్యాళ కాళేశ్వరం పుణ్యమాని భూగర్భ జలాలు పెరిగి, 5 ఎకరాలు పారిస్తున్న విషయం తెలిసొచ్చింది. అక్కడా కేసీఆరే.
మొన్నటివరకు పెట్టుబడికి రైతుబంధు ఇచ్చిన కేసీఆర్ పచ్చని పంటలో కనిపించిండు. దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం అంటే.. 'మా రైతుల వడ్లు మేమే కొంట'మని అన్నదాతను ఆదుకున్న కేసీఆర్ గుర్తుకొచ్చిండు రెడ్డి సాబు. ఇంటికి వచ్చే తోవలో గడ్డం చేయించుకోవడానికి పోతే రెండు ఫ్యాన్లకు ఫ్రీగా అందుతున్న కరెంటులోనూ కేసీఆర్ ఉన్నడు. ఇంటికివస్తే నాడు కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీర కట్టుకున్న పటేలమ్మ కనిపించింది. బావతో గొడవపడి ఇంటి మీద ఉన్న చెల్లెకు వస్తున్న ఒంటరి మహిళా పింఛన్ కూడా కేసీఆర్ ఇచ్చిందేనని యాదికి వచ్చి మనసు చలించిపోయింది రెడ్డి సాబు. స్నానం చేసుకొని అంగీ ఇస్త్రీ చేయించుకోవడానికి వెళ్తే బొగ్గుల ఇస్త్రీపెట్టెకు బదులు వాడుతున్న కరెంటు పెట్టెలో కూడా కేసీఆర్ కనిపించిండు. కొడుకును బడిలో దించడానికిపోతే 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో భాగంగా నూతన సొగబులు దిద్దుకున్న బడి కనబడ్డది. కొడుకు మధ్యాహ్నం తింటున్న సన్న బువ్వలో కేసీఆర్ కనిపించిండు. తన పెద్ద బిడ్డ చదువుకుంటున్న గురుకుల పాఠశాలలో కూడా కేసీఆర్ ఆనవాళ్లే ఉన్నయి. భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ ఆఫీసుకు పోయిన రెడ్డి సాబ్కు తమ ఊరిని కేసీఆర్ సర్కార్ మండలం కేంద్రంగా చేసిన విషయం యాది కొచ్చింది. గతంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం సమర్పించుకున్న ముడుపులు గుర్తుకొచ్చినయి. ఏ. ఇబ్బంది లేకుండా నేడు జరుగుతున్న రిజిస్ట్రేషన్, కొత్త పాస్బుక్లో కేసీఆర్ దర్శనమిచ్చిండు.
మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి తారుతో వేసిన డబుల్ రోడ్డులో కేసీఆర్ మెరుస్తున్నడు. నూతనంగా ఏర్పాటైన జిల్లా కేంద్రంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఆఫీసులో కేసీఆరే కనిపిస్తున్నడు రెడ్డి సాబు కు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి అరుగుపై కూర్చొని బీడీలు చుడుతూ కొంతమంది మహిళలు కనిపించారు. బీడీలు చుడుతూ వాళ్లు పొందుతున్న పింఛన్లోనూ కేసీఆర్ ఉన్నడు. తన తల్లికి వస్తున్న వృద్ధాప్య పింఛన్లోనూ కేసీఆర్ కనిపిస్తున్నడు రెడ్డి సాబు. తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ఏ పైరవీ లేకుండానే ఇంటికొచ్చిన రూ.5 లక్షల రైతుబీమా రెడ్డి సాబు కు యాదికొచ్చింది. సైరన్ మోగిస్తూ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఇన్నోవా వాహనంలోనూ కేసీఆర్ ఆనవాళ్లు కనిపించినయి.ఇంటి బయట తళతళ మెరుస్తున్న ఎస్ఈడీ వీధి దీపాల్లోనూ కేసీఆర్ ఉన్నడు. 24 గంటలు నాణ్యమైన కరెంటు రావడంతో తన ఇంట్లో మూలకు పడిన ఇన్వర్టర్లో కేసీఆర్ కనిపించిండు రెడ్డి సాబు.
అంతలోనే రెడ్డి సాబ్కు తన తమ్ముడు ఫోన్ జేసిండు. కేసీఆర్ హయాంలోనే బాగుండేదని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ వల్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని, హైదరాబాద్లో అనేక కంపెనీలు కొలువయ్యాయని, తద్వారా లక్షల ఉద్యోగాలు వచ్చాయని.. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం వల్ల శాంతిభద్రతలు క్షీణించి, పెట్టుబడులు రాక, ఉన్న ఐటీ ఉద్యోగం కూడా ఊడిందని ఆవేదనచెందిండు. దీంతో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం సాధ్యం కాదని, రెడ్డి సాబ్కు అర్థమైంది. ‘ఒరేయ్ తమ్ముడు! తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఆనవాళ్లు ఉంటాయి. యూట్యూబ్ చానళ్లు, కుహనా మేధావుల మాటలువిని మోసపోయి ఇప్పుడు గోసపడుతున్నం' అని చెప్పుడు రాంరెడ్డి వంతైంది.
No comments:
Post a Comment