Monday, August 28, 2023

#Chaitan#15thchapter#గ్రంధపఠనము#TeluguLyrics_AudioVideo

నమస్తే తెలంగాణ NEWS PAPER 29 ఆగష్టు 2023


#చైతన్యభగవద్గీత#15thChapter#20వశ్లోకం వ్యాఖ్యానము#LyricalAudio_Video

 #చైతన్యభగవద్గీత#15thChapter#20వశ్లోకం వ్యాఖ్యానము#LyricalAudio_Video

ఇతి గుహ్యతమం శాస్త్ర మిద ముక్తం మయా నఘ |

ఏత ద్బుద్ధ్వా బుద్ధిమా న్యా త్కృతకృత్యశ్చ భారత ॥20 వ శ్లోకము 

ఇతి-గుహ్యతమం-శాస్త్రం-ఇదం-ఉక్తం-మయా-అనఘ

ఏతత్-బుద్ధ్వా-బుద్ధిమాన్-స్యాత్- కృతకృత్యః-చ-భారత

అర్జునా! అతి రహస్యమైన శాస్త్రమును నీకు బోధించాను. దీనిని తెలుసుకున్న వాడు బుద్ధిమంతుడు అవుతాడు. కృతకృత్యుడు అవుతాడు.

వ్యాఖ్య

మోక్ష ఫలాన్ని అందించే పరమాత్మ జ్ఞానాన్ని పూర్వ శ్లోకంలో ప్రస్తావించిన భగవానుడు, ప్రస్తుత శ్లోకంలో అధ్యాయాన్ని ప్రశంసిస్తూ ఉపసంహరిస్తున్నాడు. సాధారణంగా భగవద్గీతను గీతా శాస్త్రం అంటాము. కాని, భగవంతుడు ఈ అధ్యాయాన్నే శాస్త్రముగా పేర్కొనడంలో అధ్యాయ ప్రశంసను చెప్పకనే చెప్పిన ట్లైంది. పరమేశ్వరుడు అర్జునునకు బోధించిన ఈ పురుషోత్తమ తత్త్వము గుహ్యతమము అంటున్నాడు ( ఇదం ఉక్తం శాస్త్రం గుహ్యతమం). గుహ్యము అంటే రహస్యము. గుహ్యతమము అంటే అత్యంత రహస్య మని అర్థము. పరమాత్మకు సంబంధించిన జ్ఞానం కావడం చేత ఇది అతి రహస్య మైంది. రహస్యము అంటే తెలియనిది అని అర్థము. తెలియనంత వరకే ఏదైనా రహస్యంగా ఉంటుంది. తెలియని దానిని తెలిపిన తరువాత ఇక రహస్య మంటూ ఉండదు. కాని, పరమాత్మ జ్ఞానము అలాంటిది కాదు. లౌకిక విద్యలు ఏవైనా చెబితే తెలుస్తాయి. వేదాంత విద్య చెప్పినా అర్థం కాదు. అర్థమైనట్లే ఉంటుంది. ఏమి అర్థమైంది? అని ప్రశ్నించుకుంటే అర్థం కాలేదనే సమాధానం వస్తుంది. అందుకే అది గుహ్యతమము. పరమాత్మే గుహ్యమైన వాడు. ఆయనకు సంబంధించిన జ్ఞానం కావడం చేత బ్రహ్మవిద్య గుహ్యతమ మైంది.

ఇంతకీ పరమాత్మ స్థావర మెక్కడ? పోనీ, ఉపలబ్ది స్థానం ఏది? హృదయమే కదా! నేను 

ప్రాణులందరి హృదయాలలో ఉన్నాను అని ఈ అధ్యాయంలో భగవంతుడే స్వయంగా చెప్పాడు కదా! మరి, హృదయంలోనే ఉన్నవాడు ఎంత పిలిచినా పలకడు. ఎంత నిరీక్షించినా కనిపించడు. తెలుసుకుందా మంటే అర్థం కాడు. అలాంటి వానిని ఏమనాలి? గుహ్యమైన వాడు అనాలి. వ్యాసుడు అలాగే అన్నాడు. భీష్మాచార్యుల వారి చేత అనిపించాడు గుహ్యః అని. గుహలో దాగినట్లు హృదయ గుహలో రహస్యంగా ఉన్నందున పరమాత్మను ‘గుహ్యుడు” అని అనవలసి వచ్చింది. తానే గుహ్యుడు కావడం చేత తనకు సంబంధించిన జ్ఞానము గుహ్యతమమైంది. రహస్యంగా ఉండే వాడికి సంబంధించిన జ్ఞానము అత్యంత రహస్య మైంది 

(తత్ గుహ్యతమం గోప్యతమమ్ అత్యన్త రహస్యమ్ ).

వేదాంత జ్ఞానము, అంటే ఉపనిషత్తుల లోని జ్ఞానము అతి రహస్య మైనది. గహన మైనది కనుక

రహస్యము. ఉత్కృష్ట మైనది కావడం చేత రహస్యము. గుహ్యమైన, అంటే రహస్యమైన ఉపనిష ద్విజ్ఞానము చేత పొందబడే వాడు కనుక భగవానుడు గుహ్యుడు 

(గుహ్యః రహస్యోపనిషత్ వేద్యత్వాత్ గుహాయాం హృదయా నిహిత ఇతి వా గుహ్యః).

ఎవరు నీవు ? ఎవ్వరూ ఎరుగ లేరు

ఎరిగిన వారు తిరిగి ఎరుక పరచ లేరు

ఎదను చేరి సొదలన్నీ విందువయ్యా!

నీ అడుగుల కడ పడి ఉందు చిన్నికృష్ణా !

అని గోవిందుని గుట్టు విప్పింది చిన్నికృష్ణ శతకము.

గుండె లోనే ఉన్నా గుర్తు తెలియక పోవడము ఒక రహస్య మైతే, అత డెవరో కాదు, నీవే అని ఎంత

మొత్తుకున్నా అర్థం కాక పోవడము మరొక రహస్యం. స్వప్రయత్నంతో యత్నించినా, పరుల సహకారంతో ప్రయత్నించినా రహస్యం రహస్యం గానే ఉంటూ ఉంది. అందుచేత శ్రుతి రేవ శరణమితి - వేదమే శరణ్యము, వేదాంతమే శరణ్యము అని శాస్త్రాన్ని ఆశ్రయించ వలసి వస్తోంది. శాస్త్రాన్ని గురుముఖతః అధ్యయనం చేసినా రహస్యం అలాగే ఉంది. అందుకే గుహ్యమైన పరమాత్మకు సంబంధించిన శాస్త్రము గుహ్యతమమై కూర్చుంది. అట్టి గుహ్యతమ మైన శాస్త్రాన్ని భగవంతుడు అర్జునునికి బోధించాడు.

రహస్యమై, దుర్విజ్ఞేయమై ఉండటం చేత 'గుహ్యతమం' అనే మాటను చర్విత చర్వణంగా పరమేశ్వరుడు గీతలో వినిపించాడు. గీత పూర్వార్ధము సమాప్త మయ్యే తొమ్మిదవ అధ్యాయం మొదటి శ్లోకం లోను, గీతను సమాప్తం చేస్తూ పద్దెనిమిదవ అధ్యాయం అరవై నాల్గవ శ్లోకం లోను గుహ్యతమం అని చెప్పడమే గాక, మధ్యలో గీతా హృదయంగా భాసిస్తున్న పదిహేనవ అధ్యాయాన్ని సమాప్తం చేస్తూ కూడా అదే మాటను వినిపించాడు. శాస్త్రం ఎంత గుహ్యతమమో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ముందు గానే అధ్యాయ పీఠికలో చెప్పు కున్నట్లు, 'పురుషోత్తమ ప్రాప్తి యోగము' అనే ఈ అధ్యాయములో సమస్త గీతా శాస్త్ర సారమే గాక సమస్త వేదార్థము కూడా సమాప్త మైంది అని శ్రీ శంకరాచార్య స్వామి అభిప్రాయ పడ్డారు (సర్వో హి గీతా శాస్త్రార్థః అస్మిన్ అధ్యాయే సమాసేన ఉత్తః, న కేవలం గీతా శాస్త్రార్థ ఏవ, కిం తు సర్వశ్చ వేదార్థః ఇహ పరి సమాప్తః ). మొదటి శ్లోకం, పదిహేనవ శ్లోకం, పద్దెనిమిదవ శ్లోకం ఈ అధ్యాయము వేదార్థ మనే విషయానికి అద్దం పడుతున్నాయి. అధ్యాయాంత శ్లోకమైన ప్రస్తుత శ్లోకం ఇతి అంటూ ప్రారంభమై అధ్యాయమును సమాప్తం చేయడము, సంప్రదాయానుసారం శాస్త్ర పరి సమాప్తిని సూచిస్తూ ఉంది. ఇటువంటి అద్భుతమైన, రహస్యమైన విషయాన్ని అర్జునునికి బోధించినట్లు భగవంతుడే స్వయంగా చెబుతున్నాడు. ఈ సందర్భంలో అర్జునుని అనఘ! అని, భారత! అని సంబోధించడం ముఖ్యంగా

గమనించ దగిన విషయం. అఘము అంటే పాపము. పాప రహితుడు కావడం చేత అర్జునుణ్ణి భగవంతుడు అనఘ! అని సంబోధించాడు. అర్జునుని జీవితంలో అకారాది క్షకారాంతం వరకు కాగడా పెట్టి వెతికినా పాపపు ఛాయలు కనిపించవు. అందుకే, అర్జునుడు అనఘుడు (అనఘ! అపాప!). అర్జునుడు అనఘుడు కావచ్చు. కాని, ఈ సందర్భములో భగవానుడు అతనిని ఇలా సంబోధించడం ఎంతో భావగర్భితంగా ఉంది. సమస్త వేదాంత సారమైన పురుషోత్తమ తత్త్యాన్ని గ్రహించాలి అంటే, ఆ ప్రయత్నం చేసే వ్యక్తి పాప రహితుడై ఉండాలి అని సూచించడమే దీని

అంతరార్థము. శుద్ధి పడిన బుద్ధి లోనే పవిత్రమైన పరమాత్మ జ్ఞానము నిలుస్తుంది. 'భా' అంటే ప్రకాశము (భా దీప్తా). 'రత' అంటే ఆసక్తి అని, రమించడ మని అర్థము. ప్రకాశవంతమైన 

జ్ఞానము నందు ఆసక్తి కల వాడు, పాప రహితుడై ఉండాలి (అనఘ!). 'అనఘ' అనే పదం జ్ఞానార్హతను, అధికారిత్వాన్ని సూచిస్తూ ఉంటే, జ్ఞానమును పొందిన తరువాత జ్ఞానద్యుతిలో రమించడము జరుగు తుందని 'భారత!' శబ్దము సూచిస్తూ ఉంది. అంతే కాదు, అర్జునుడు భరత వంశోద్భవుడు. వ్యక్తిగతంగా చూస్తే పాపరహితుడు. వంశ గతంగా,

కుటుంబ నేపథ్యాన్ని చూచినా, ప్రకాశవంత మైన వాడు. కనుకనే పరమాత్మ నుండి పవిత్రమైన జ్ఞానాన్ని ఆలకించాడు. పైగా అనన్య సామాన్యంగా, అనితర సాధ్యంగా సాక్షాత్తు పరమాత్మ నుండే 'అనఘ!' అనే బిరుదును పొంది జన్మను సార్థకం చేసుకున్నాడు.

శ్రవణ ఫలం

పరమేశ్వరుడు బోధించిన గుహ్యమైన పురుషోత్తమ తత్త్యమును ( ఏతత్ శాస్త్రం యథా దర్శితార్థం)

యథాతథంగా తెలుసుకున్న వాడు (బుద్ధా) బుద్ధిమంతుడు అవుతాడు (స బుద్ధిమాన్ స్యాత్).

జ్ఞానమును పొందిన తరువాత బుద్ధిమంతుడు కావడ మేమిటి? బుద్ధి తోనే కదా జ్ఞానమును

సముపార్జిస్తారు? అనే సంశయము కలగ వచ్చు. ఇక్కడ బుద్ధిమంతుడు అంటే వివేకం కల వాడు అని అర్థము. జ్ఞానము కల వాడు అని భావము.

బుద్ధి అందరికీ ఉంటుంది. బుద్ధి ఉన్న వాళ్ళందరూ బుద్ధిమంతులు కారు. ఎవరి బుద్ధిలో వివేకం

ఉంటుందో, ఎవరి బుద్ధి జ్ఞాన పూరితమై ఉంటుందో వారే బుద్ధిమంతులు.

'నీకు బుద్ధి లేదు' అని ఒకరు మరొకర్ని తిడుతూ ఉండటం అనేక సార్లు మనం విని ఉంటాము. దాని

అర్థ మేమిటి? వాస్తవంగా అతను బుద్ధి లేని వాడే అయితే, ఈ నిందా వాక్యం అర్థం కావలసింది ఎవరికి? బుద్ధిలేని చెట్టుకో, గోడకో, పిల్లికో, నల్లికో అర్థం కాదు కదా! అతనికి బుద్ధి లేదు అనేదే గనుక దూషించే వ్యక్తియొక్క అభిప్రాయమైతే, అసలు బుద్ధిలేని దెవరికి? అని విన్న వాళ్ళం మీమాంసలో పడవలసి వస్తుంది. బుద్ధిలేని వ్యక్తినే నిందించాడు. అనుకుందాం. బుద్ధిలేదు అనిఅంటే అసలే బుద్ధి లేదని కాదు. పనిచేయని బుద్ధి ఉందని అర్థము. పని చేయనిది ఉన్నా, లేకపోయినా పెద్ద తేడా ఉండదు.

శాస్త్రాన్ని బుద్ధిమంతులే వింటారు. అది కూడా శుద్ధ బుద్ధి కల వారే వింటారు. శుద్ధ బుద్ధి కల వారే

శాస్త్రాన్ని అర్థం చేసుకో గలుగుతారు. బుద్ధి కలిగి శాస్త్ర హృదయాన్ని అర్థం చేసుకున్న వారు బుద్ధిమంతులు అవుతారు. అంటే జ్ఞానవంతులు అవుతారు (బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ భవేత్ !). పరమేశ్వరుడు జ్ఞాన స్వరూపుడు. అట్టి మహాద్భుత శక్తిని జ్ఞానం ద్వారా పొంద వలసిందే గాని మరో మార్గం లేదు (న అన్యథా ). క్షర పురుషుడుగా కార్య రూప జగత్తులో సర్వత్ర తానే వ్యాపించి ఉన్నాడు (కుండలో మట్టి లాగా). అక్షరపురుషుడుగా కారణ రూప అవ్యక్తానికి, లేదా మాయకు కూడా తానే ఆశ్రయమై ఉన్నాడు. ఇలా కార్య కారణాలలో ఉన్న పరమేశ్వరుడు, ఆ రెండిటికి విలక్షణంగా తన మహిమలో (స్వే మహిమ్ని) పురుషోత్తముడుగా విరాజిల్లు తున్నాడు. అలాంటి వానిని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి అంటే ఎలాంటి బుద్ధిఉండాలి? ఉన్నదంతా పురుషోత్తమ తత్త్వమే అయినపుడు, అది సిద్ధించే ఉంది కదా! అది లేని దెప్పుడు? లేనిదెక్కడ? మరి అంతట ఉన్న అద్వయ సత్తా స్వరూపాన్ని ఎలా పొందగలం? సాధ్య వస్తువును పొందగలం గాని

సిద్ధ వస్తువును ఎలా పొందాలి? దానిని ఎలా చేరాలి అంటే ఏం చెప్పగలం? జ్ఞానం ద్వారానే పొందాలి. జ్ఞానంతోనే చేరాలి ( జ్ఞానే నైవ గమ్యతే). ఉండి తెలియక పోవడం అజ్ఞానం కనుక, అజ్ఞానము జ్ఞానము ద్వారానే తొలగించ బడాలి. మరో మార్గం లేదు. పరమేశ్వరుని ఎవరైనా అలాగే పొందాలి. ఎవరి కైనా భగవంతుడు హృదయస్థుడు గానే అర్థం కావాలి.


తన ఆత్మ స్వరూపం గానే తెలియాలి. కనుకనే, సర్వస్య చాహం హృది సన్నివిష్టః - నేను అందరి హృదయాలలో ఉన్నాను అన్నాడు భగవంతుడు (15 వ శ్లో). కొందరి హృదయాల లోనే ఉన్నాను అని చెప్ప లేదు. కనుక, పరమేశ్వర దర్శనాన్ని అభిలషించే వారు, పురుషోత్తమ ప్రాప్తిని పొందగోరే వారు బాహ్యంలో అన్వేషించి పరమాత్మను పొంద లేరు. అంతరంగమున అవలోకించి మాత్రమే పొందగలరు.

ఆఖ్యాయిక

హిరణ్యకశిపుని ఉగ్ర తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, కోరిన వరాలను అనుగ్రహించిన

తరువాత, నాయనా! హిరణ్యకశిపూ! నీవు కోరిన వరాలు సామాన్య మైనవి కావు. గతంలో ఎవ్వరూ ఇలా కోరలేదు. అయినా నిన్ను కరుణించి అనుగ్రహించాను.

నన్నుం గోరిన వెల్ల నిచ్చితి బ్రవీణత్వంబుతో బుద్ధి సం

పన్నత్వంబున నుండు మీ సుమతి వై భద్రక శీలుండవై !

'బుద్ధితో ప్రవర్తించు. నేర్పుతో జీవించు. బుద్ధిమంతుడవై, మంగళ స్వభావంతో మసలుకో! అని పలికి అరవింద సంభవుడు అంతర్హితు డయ్యాడు. చెప్పిన హిత మంతా ఎటు పోయిందో! మరు క్షణమే సుర లోకంపై దండెత్తాడు హిరణ్యకశిపుడు. సురులను జయించాడు. యక్ష, కిన్నర, గంధర్వ, కింపురుషాదులను ఓడించి ఊర్ధ్వ లోకాలను స్వాధీనం చేసుకుంటూ వచ్చి, చివరగా శత్రువైన శ్రీహరిని జయించాలని వైకుంఠం వైపు తిరిగాడు.

మార్గ మధ్యంలో వైకుంఠం నుండి తిరిగి వస్తున్న నారద మహర్షి ద్వారా విష్ణువు వైకుంఠం లోనే ఉన్నాడని తెలుసుకొని పరమోత్సాహంతో ఆ వైపుకు దూసు కెళ్ళాడు. నారద మహర్షి కూడా వెనుదిరిగి హిరణ్యకశిపుని అనుసరించాడు. తీరా అక్కడి కెళ్ళి చూస్తే విష్ణుమూర్తే కాదు, ఆదిశేషుడు కూడా లేడు. ఇక, అమ్మవారు ఎక్క డుంటుంది?

నారదా! ఎక్కడ నీ హరి? అని నారదుని వైపు కళ్ళెర్ర జేసి చూశాడు హిరణ్యకశిపుడు. అయ్యా! వేమ

ఇక్కడే చూశాను. ఈ లోగా ఏమయ్యాడో? అని బిక్క మొగం వేశాడు నారదుడు.

చూస్తాను. ఈ చతుర్దశ భువనాలలో నన్ను ఎలా తప్పించు కుంటాడో చూస్తాను అంటూ విష్ణుదేవుని

కొరకు భువనా లన్నీ గాలిస్తున్నాడు కశ్యపాత్మజుడు.

ఒక వైపు హిరణ్యకశిపుడు క్రోధంతో అన్వేషిస్తూ ఉంటే, మరో వైపు నారదుడు భక్తితో అన్వేషిస్తున్నాడు. అటు హిరణ్యకశిపునికి విష్ణువు కనిపించ లేదు. ఇటు నారద మహర్షికీ విష్ణుదర్శనం కాలేదు. విసిగి వేసారిన దితి నందనుడు రాక్షస లోకాని కెళ్ళాడు.

నారద మహర్షి పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. అచ్యుతుని కోసం వెతికి వెతికి నారదుడు కూడా

అలసి పోయాడు. చివరగా, ఎందుకైనా మంచిది. మళ్ళీ ఒకసారి వైకుంఠానికే వెళ్ళి చూద్దా మని మహర్షి మాధవ సన్నిధానానికి పయన మయ్యాడు. తీరా వెళ్ళి చూస్తే సిద్ధము సుమతీ విష్ణు భగవానుడు సతీ సపరివారసమేతంగా శేషతల్పం మీద పవ్వళించి ఉన్నాడు. మహర్షికి నోట మాట రాలేదు. 'నారదా! అదేమిటి? అదోలా ఉన్నావు? ఏం జరిగింది? అని అమాయకంగా ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి. అయ్యా! మహానుభావా! నా విషయం అలా ఉంచండి. తమరు ఇంతకాలం ఎక్క డున్నట్లు? తమరి మకాం ఎక్కడో అర్థం గాక నేను తిరగని చోటు లేదు అన్నాడు నారద మహర్షి. అదేమిటి? నువ్వు ఒక్కడివే తిరిగినట్లు మాట్లాడుతున్నావు? హిరణ్యకశిపుడు కూడా నీ కన్నా ఎక్కువగానే తిరిగాడు కదా! అన్నాడు విష్ణుమూర్తి.

నారదా! నేను ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా హిరణ్యకశిపుడు నా జాడ కనిపెట్టేస్తాడు. ఎక్కడ దాగితే అతడు కనిపెట్ట లేడో అక్కడ దాగాను అన్నాడు విష్ణుమూర్తి. అదెక్కడ స్వామీ? మీరు దాగింది ఎక్కడ? అని అడిగాడు నారద మహర్షి.

నారదా! నేను దాగింది హిరణ్యకశిపుని హృదయం లోనే. హిరణ్యకశిపుడు అహంకారి. తన కన్నా వేరైన ప్రదేశాలలో అన్వేషిస్తాడే గాని, తనలో తాను తల వంచి, అంతర్ముఖుడై చూడడు. అందుకనే

దాచుకోవడానికి అదే అనువైన చోటు అని భావించి, అతని హృదయం లోనే ఒదిగి పోయాను అని రహస్యాన్ని విప్పి చెప్పాడు వైకుంఠ పతి.

కృతకృత్యుడు

పరమాత్మ జ్ఞానమును పొందిన వాడు కృతార్థు డవుతున్నాడు. ఆత్మయే పరమాత్మ అనే

జ్ఞానము మహోన్నత మైంది. పరమాత్మ జ్ఞానమును పొందిన వాడు అంతకు మించి పొంద వలసింది ప్రపంచములో మరొకటి ఉండదు. పర అంటే ఉత్కృష్టమైనది అని అర్థము (పరః సర్వ భూతేభ్యః ఉత్కృష్టం బ్రహ్మ ). అట్టి పరమాత్మ జ్ఞానము ప్రాప్తించిన వాడు 

కృతకృత్యుడవుతున్నాడు.

కృత్యము అంటే కార్యము. కృతం అంటే చేయబడింది. ఏది కర్తవ్యమో అదే కృతం. కర్తవ్యము అంటూ మిగలకుండా చేయ వలసిన కార్యము లన్నీ చేసేసిన వాడు కృతకృత్యుడు (కృతం కృత్యం కర్తవ్యం యేన సః కృత కృత్యః). ఎలాగైతే స్వప్నంలో చేయ వలసిన కర్తవ్యా లన్నీ మేలుకోగానే చేసినట్లే అవుతున్నాయో, అలాగే భగవతత్త్వాన్ని  తెలుసుకుంటే చేయ వలసిన కర్తవ్యా లన్నీ చేసినట్లే అవుతున్నాయి. అట్టి వాడు కృతకృత్యుడు అవుతున్నాడు (యత్ కర్తవ్యం తత్ సర్వం భగవత్తత్త్వే విదితే కృతం భవేత్ ఇత్యర్థః). ఈ విధంగా సమస్త కర్మలు జ్ఞానములో లయించి పోతున్నాయి (4 వ అ - 33 వ శ్లో ). ఈ విధమైన అత్యంత రహస్యమైన బ్రహ్మాత్మ జ్ఞానమును బోధించి, అర్జునుణ్ణి కృతార్థుణ్ణి చేశాడు కరుణా సముద్రుడైన భగవంతుడు. ‘అర్జునా! గుహ్యతమ మైన శాస్త్రాన్ని నీకు బోధించాను. పరమార్థ స్వరూపమైన పురుషోత్తమ తత్త్యమును నా ద్వారా శ్రవణం చేసి నువ్వు కృతార్థుడ వయ్యావు, కృతకృత్యుడ వయ్యావు' అని పలుకుతూ పదిహేనవ అధ్యాయాన్ని పరమేశ్వరుడు సమాప్తం చేస్తున్నాడు (ఏతత్ పరమార్థ తత్త్వం మత్తః శ్రుతవాన్ అసి తతః కృతార్థః

త్వం భారత ఇతి ).

ఇతి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం

యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే

పురుషోత్తమప్రాప్తి యోగో నామ పఞ్చదశో ధ్యాయః

ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రము, 

శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీత యందు

పురుషోత్తమప్రాప్తి యోగ మనే పదిహేనవ అధ్యాయము.



నన్ను నేను


chaitanya bhagavadgita 15th chapter- 16th slokam to 19th slokam

 chaitanya bhagavadgita 15th chapter - 16th slokam to 19th slokam

ద్వా విమౌ పురుషా లోకే క్షర శ్చాక్షర ఏవ చ ॥

క్షర స్సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే ॥16 వ శ్లోకం 

ద్వౌ-ఇమౌ- పురుషా-లోకే-క్షరః-చ-అక్షర:-ఏవ-చ

క్షరః-సర్వాణి-భూతాని-కూటస్థ:-అక్షర:- ఉచ్యతే

లోకంలో పురుషులు ఇద్దరే ఉన్నారు. ఒకడు క్షర పురుషుడు. మరొకడు అక్షర పురుషుడు. సర్వ భూతములు క్షరములు. కూటస్థుడు అక్షర స్వరూపుడు.

వ్యాఖ్య

లోకంలో, అంటే సంసారంలో సోపాధిక చైతన్యము ఇద్దరు పురుషులుగా చెప్పబడుతూ ఉంది. ఒకడు క్షర పురుషుడు. మరొకడు అక్షర పురుషుడు. కార్యోపాధి కల వాడు క్షర పురుషుడు. కారణోపాధి కల వాడు అక్షర పురుషుడు. క్షరము అంటే నశించేది కనుక, నశించే కార్యోపాధి కల వాడు క్షర పురుషుడు (క్షరః క్షరతీతి క్షరః వినాశీ). అక్షర పురుషుడు అంటే దానికి భిన్నమైన వాడు. కారణోపాధి కల వాడు. కాల ప్రవాహంలో నశించని ఉపాధి కారణో పాధి. అదే భగవంతుని ఆశ్రయించుకొని ఉన్న మాయా శక్తి. త్రిగుణ మిళిత మైంది (అక్షరః తద్విపరీతః భగవతః మాయా శక్తిః).

క్షరోపాధి గల కార్య పురుషునికి ఉత్పత్తి స్థానం కావడం చేత, అక్షరోపాధి గల కారణ పురుషుడు, లేదా

మాయాశక్తి సంసారానికి బీజ భూత మైంది. క్షరోపాధి గల పురుషునికి ఉత్పత్తి బీజము. సంసారులైన ప్రాణుల కామ కర్మాది సంస్కారాలకు అక్షర పురుషుడే ఆశ్రయ స్థానము.

క్షర పురుషుడు

క్షరము అంటే నశించేది. ఒక కాలంలో కనిపించి మరొక కాలంలో కనుమరు గయ్యేది. వికారయుతమైంది. మర్త యాగము కనుక సకల భూతాలు, సర్వ కార్యాలు, ఇవన్నీ నడవటానికి ఆశ్రయమైన దృశ్యమాన జగత్తు - అంతా క్షరమే కనుక అది క్షర పురుషుడు. కార్యోపాధి గల వాడు. అంటే కార్య రూప ప్రపంచంగా గోచరించే వాడు (క్షరః సర్వాణి భూతాని సమస్తం వికార జాతమ్ ఇత్యర్థః ). ఆద్యంతాలు కలిగి కార్య రూపంలో గోచరిస్తూ, వికారాన్ని పొందుతూ, వినాశ మయ్యే సర్వభూత శరీరాలు క్షర పురుషుని క్రిందికే వస్తాయి.

అక్షర పురుషుడు

అనేక నామ రూపాలతో, అనేక విధాలుగా ఏదైతే కార్య రూపంలో గోచరిస్తూ ఉందో అట్టి వ్యక్త రూప ప్రపంచము క్షరము. వ్యక్త మయ్యే ఈ కార్య రూప జగత్తుకు కారణమై, ఏదైతే అవ్యక్తంగా ఉందో, అంటే వ్యక్తం కాకుండా ఉందో అదే అక్షరము. అవ్యక్తంగా ఉంటూ జగత్కార్యానికి కారణమైన మాయా శక్తియే అక్షరము. మార్పు లేనిది. కూటస్థము. కూటస్థము అనే పదాన్ని ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్షర పురుషుడు కూటస్థుడు అని చెప్ప బడ్డాడు (కూటస్థః అక్షర ఉచ్యతే). పరబ్రహ్మమును 'కూటస్థం' అని, 'అక్షరం' అని ఇదివరకే మనం చెప్పుకొని ఉన్నాం (12 వ అ - 3 వశ్లో ) ఇక్కడ మళ్ళీ మాయను 'కూటస్థం', 'అక్షరం' అని చెప్పుకుంటున్నాం. ఈ తేడాను స్పష్టంగా గ్రహించాలి.

పరబ్రహ్మము సర్వాధారమై, సర్వ వికారాలకు ఆశ్రయమై, తాను స్వరూపతః అవికార్యమై ఉండటంచేత కూటస్థం అని చెప్పబడ్డాడు (కూటస్థః కూట రూపేణ తిష్ఠతి ఇతి). దాగలి వలె కూటస్థుడు అని కూడా చెప్పుకున్నాం. కాని, ప్రస్తుతం 'అక్షరము', 'కూటస్థము' అనే పదాలకు బ్రహ్మము అనే అర్థాన్ని గ్రహించ డానికి వీలు లేదు. కార్యమైన జగ ద్రూపంలో గోచరించే క్షర పురుషుడు కాల ప్రవాహంలో కరిగి పోతాడు. వ్యక్త మయ్యే

కార్య రూప క్షర పురుషునికి కారణమై, అవ్యక్తంగా ఉండే మాయ ఇక్కడ అక్షరంగా, కూటస్థంగా చెప్పబడింది.

'అక్షరము' అంటే పరబ్రహ్మము లాగా అవినాశి అని అర్థం కాదు. క్షరము లాగా కాలంలో నశించకుండా అవ్యక్తంగా ఉండి పునః సృష్టికి కారణ మవుతూ ఉంది అని అర్థము. ప్రళయ కాలంలో క్షర పురుషుడు నశించినా, అవ్యక్త మైన మాయ నశించకుండా ఉండి పునః జగత్కార్యానికి కారణం కావడం చేత అది సాపేక్షికంగా అక్షరమే గాని, పారమార్థికంగా అక్షర మైన బ్రహ్మము కాదు. జ్ఞానోదయంలో నశించే మాయ జ్ఞాన స్వరూపు డైన పరబ్రహ్మము లాగా అక్షర మెలా అవుతుంది?

అక్షర మెలాగో కూటస్థమూ అంతే. కూట మంటే మాయ అని, మోస మని, వక్ర మని, 

కుటిలత్వ మని కూడా అర్థాలున్నాయి 

( కూటః మాయా వంచనా జిహ్మతా కుటిలతా ఇతి పర్యాయాః ). మాయలో ఇవన్నీ ఉంటాయి. కనుక 'అక్షరము', 'కూటస్థము' అనే శబ్దాలు పరబ్రహ్మమును సూచించేవే అయినా, ఇక్కడ

వాటిని మాయకు అన్వయించు కోవాలి. ఉపాధులు క్షరమైనా, అక్షర మైనా అవి పరబ్రహ్మమునకు అన్యంగా ఉండ లేవు. క్షరాక్షరాలు రెండూ పరమాత్మకు ఉపాధులే కనుక, ఉపాధులను తొలగిస్తే, కేవలం శుద్ధ చైతన్యమే అద్వయంగా శోభిస్తుంది. తద్ధామ పరమం మమ అని ఆరవ శ్లోకంలో భగవంతుడు తెలిపింది ఇదే. నేతి నేతి : న హ్యస్మాత్పర మస్తి - ఇది కాదు, ఇది కాదు అని అన్నిటిని నిషేధిస్తూ, దానికంటే పర మైనది లేదు అని ఉపనిషత్తు దేని నైతే ప్రతిపాదించిందో, అదే క్షరాక్షరాలకు విలక్షణ మైన పరమాత్మ తత్త్యము. అదే పురుషోత్తమ తత్త్వము.

దానినే తరువాత శ్లోకంలో ప్రతిపాదిస్తున్నాడు.

ఉత్తమః పురుష స్త్యన్యః పరమాత్మే త్యుదాహృతః ।

యో లోకత్రయ మావిశ్య బిభ ర్త్యవ్యయ ఈశ్వరః ॥17  వ శ్లోకం 

ఉత్తమః-పురుషః-తు-అన్య:-పరమాత్మా-ఇతి-ఉదాహృతః

య:-లోకత్రయం-ఆవిశ్య-బిభర్తి-అవ్యయః- ఈశ్వరః

అర్జునా! నాశము లేని వాడు, ఈశ్వరుడు, ముల్లోకాలలో ప్రవేశించి భరించు ఉత్తమ పురుషుడే పురుషోత్తముడు.

వ్యాఖ్య

పూర్వ శ్లోకంలో మనం చూచిన క్షర అక్షర పురుషుల కంటే భిన్నమైన లక్షణాలు, భిన్నమైన స్వభావంగల ఉత్తము డైన పురుషుని ఈ శ్లోకంలో ప్రవేశ పెడుతున్నాడు. ఇతడు క్షరాక్షరముల కంటే విలక్షణ మైన వాడు (క్షరాక్షరాభ్యాం విలక్షణః). క్షర, అక్షర ఉపాధులు దోషాల చేత అంటబడని వాడు (క్షరాక్షరోపాధి ద్వయ దోషేణ అస్పృష్టః ). స్వతంత్రమైన వాడు. ఉపాధుల కన్నా పరముడు కావడం చేత ఉత్తమ పురుషుడు పరమాత్మ అయ్యాడు. కార్యోపాధికి అంటని వాడు కనుక పరమాత్మ అసంగుడు. కారణోపాధిని నియమించే వాడు కనుక

నియామకుడు. అసంగుడు, నియామకుడై నందున కార్యకారణో పాధులకు విలక్షణుడై ఉత్తమ పురుషుడయ్యాడు. పరమాత్మ నామధేయు డయ్యాడు (పరమాత్మ ఇతి ఉదాహృతః).

ఆత్మ శబ్దానికి అనేక అర్థాలున్నాయి. దేహమును ఆత్మ అంటారు. ఇంద్రియాలను ఆత్మ అంటారు. మనస్సును ఆత్మ అంటారు. ఇవన్నీ ఆత్మ శబ్దం తోనే వినిపిస్తాయి. ఈ ఆత్మ లన్నీ క్షర మైనవి. క్షర పురుషునకు సంబంధించినవి. పరిమిత మైనవి. పరిచ్ఛిన్న దోషముతో కూడినవి. వీటికి విలక్షణము, పరమైన ఆత్మయే పరమాత్మ (పరమశ్చ అసౌ ఆత్మా చేతి పరమాత్మా ). అన్యములైన ఆత్మల కన్నా భిన్న మైనది ( అన్యః అత్యంత విలక్షణః). అలాగే వాటి కన్నా ఉన్నత మైనది (ఉత్తమః ఉత్కృష్ట తమః). కార్యమైన క్షర పురుషుని కంటే, కారణమైన అక్షర పురుషుని కంటే విలక్షణుడు కావడం చేత పరమాత్మ (కార్య కారణ విలక్షణః) ఉత్తమ పురుషుడు. క్షరాక్షరములు రెండూ పరమాత్మకు ఉపాధులే కనుక, వ్యక్త మైన కార్య రూప జగత్తును, అవ్యక్తమైన కారణ రూప మాయను రెండిటినీ తానే భరిస్తున్నాడు. భరించడము అంటే, వాటికి సత్తా స్ఫూర్తి ప్రదాయకంగా ఉన్నాడని అర్థము. క్షరాక్షరాలకు పరమాత్మ వల్లనే సత్తా స్ఫురణలు కలుగు తున్నాయి అని భావము. క్షరాక్షరాల స్వరూపమే జగత్రయము కనుక, పరమాత్మ ముల్లోకాలను సృష్టించి, తానే వాటిలో ప్రవేశించి, వాటికి సత్తా స్ఫురణలను కలిగిస్తున్నాడు. ఈ విషయాన్ని శ్రుతి కూడా ధృవపరచింది. తత్పృష్ట్వాత దేవాను ప్రవిశత్ - తానే సృష్టించి, తానే అందులో ప్రవేశించి, అంతటా తానే వ్యాపించి (ఆవిశ్య), లోకత్రయాన్ని ధరిస్తున్నాడు, లేదా నిలుపు తున్నాడు (బిభర్తి ధారయతి ). ఇక చివరగా, శాస్త్ర స్తుతి చేస్తున్నాడు.ఇక్కడ ధరిస్తున్నాడు అంటే, బరువును మోస్తున్నాడు అని అర్థం కాదు. గుడ్డ వంతా మాలు వ్యాపించి ఉన్నట్లు, తన శక్తి చేత సర్వత్ర విస్తరించి ఉన్నాడని అర్థము. మట్టిపాత్రలలో మట్టి వ్యాపించి ఉన్నట్లు, అంతటా వ్యాపించి ఉన్నాడని భావము. ఈ విధంగా విలక్షణుడు కావడం చేత ఉత్తమ పురుషుడైన పరమాత్మ అవ్యయుడు. అంటే వ్యయం లేని వాడు. నాశ మెరుగని వాడు. మార్పు అర్థం కాని వాడు (అవ్యయః న అస్య వ్యయః విద్యతే ఇతి అవ్యయః ). తనకు మించిన వారు లేనందున తానే ఈశ్వరుడు. నియమించే శీలము కల వాడు. సర్వజ్ఞుడు (ఈశ్వరః సర్వజ్ఞః ఈశన శీలః). ఇంతవరకు ఈశ్వరుడుగా అభివర్ణింప బడిన వాడు పురుషోత్తముడే. ఆ పురుషోత్తముడు తానే అంటున్నాడు భగవంతుడు.

యస్మాత్ క్షర మతీతో హ మక్షరా దపి చోత్తమః ।

అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ॥ 18 వ శ్లోకం 

యస్మాత్-క్షరం-అతీతః-అహం-అక్షరాత్-అపి-చ-ఉత్తమః

అతః-అస్మి-లోకే-వేదే-చ-ప్రథితః-పురుషోత్తమః 

నేను క్షరమును, అక్షరమును రెండింటిని అతిక్రమించి ఉన్నాను. అందుచేత లోకము నందు, వేదము నందు పురుషోత్తముడుగా ప్రసిద్ధుణ్ణి.

వ్యాఖ్య

బ్రహ్మణో హి ప్రతిష్ఠా హం అని పూర్వాధ్యాయం చివరి శ్లోకం లోను, తద్ధామ పరమం మమ అని

ప్రస్తుత అధ్యాయం ఆరవ శ్లోకం లోను అభివర్ణించిన తన వైభవమును నిర్ధారించ డానికి తన పురుషోత్తమ తత్త్యమును తానే దర్శింప చేస్తున్నాడు, అశ్వత్థ మనే పేరు గల సంసార మాయా వృక్షమైన క్షరమును అతిక్రమించి ఉండుట చేత, అలాగే ఈ సంసార వృక్షానికి బీజ భూతమైన ప్రకృతి, లేదా మాయ అనే అక్షరమును అధిగమించి ఉండటమే గాక, దాని కంటే కూడా ఉత్కృష్టమైన వాడు కావడం చేత భగవానుడు పురుషోత్తముడు (క్షరమ్ అతీతః అతిక్రాన్తః అక్షరా దపి ఉత్తమః). దేహము క్షరము. దీనినే క్షేత్ర మని పదమూడవ అధ్యాయంలో చెప్పుకున్నాం. అలాగే క్షేత్రాన్ని పురం అని కూడా అర్థం చేసుకున్నాం. పురములో ఉండే వాడు పురుషుడు. పురమైన క్షేత్రము క్షరము కనుక నశిస్తుంది.

పురమును తెలుసుకొనే వాడు పురుషుడు లేదా క్షేత్రజ్ఞుడు. పురుషుడైన క్షేత్రజ్ఞుడు అక్షరము కనుక నశించడు. పురానికి పురుషుడు ఆధారంగా ఉన్నాడు. క్షరమైన పురమును, అక్షర మైన పురుషుని, ఇద్దరినీ ప్రకాశింప చేసే దివ్య చైతన్యం ఏదో అదే పురుషోత్తమ తత్త్వం. క్షరానికి, అక్షరానికి అతీత మైంది. అదే పురుషోత్తమ స్థితి. అదే సత్, చిత్, ఆనందంగా భాసిస్తూ ఉంది. అదే సర్వాధిష్ఠానంగా ప్రకాశిస్తూ ఉంది. ఏకమై, అద్వయమై, అఖండమై, అద్భుతంగా భాసించే దివ్య ప్రకాశైక చైతన్యం అదే.

దివ్యో హ్యమూర్తః పురుషః స బాహ్యాభ్యంతరో హ్యజః ।

అప్రాణో హ్యమనాః శుభ్ర హి అక్షరాత్ పరతః పరః ॥

'స్వప్రకాశు డైన పురుషుడు ఆకారం లేని వాడు. వెలుపల, లోపల నిండి యున్న వాడు. పుట్టుక లేని

వాడు. ప్రాణము లేని వాడు. మనస్సు లేని వాడు. నిర్మలమైన వాడు. అక్షర స్వరూపమునకు అతీతుడు' అన్నది ముండకోపనిషత్తు ( 2 -1 -2).

క్షరాక్షరముల కంటే ఉత్కృష్టమైన వాడు కావడం చేత (క్షరాక్షరాభ్యాం ఉత్తమత్వాత్) లోకము లోను,

వేదము నందును పరమాత్మ పురుషోత్తముడుగా ప్రసిద్ధుడు (లోకే వేదే చ ప్రథితః ప్రఖ్యాతః పురుషోత్తమః ). ఈ విధంగా పురుషోత్తమ తత్త్వమును తెలుసుకొను వారికి ఫల మేమిటో చెబుతున్నాడు.

యో మామేవ మసమ్మూడో జానాతి పురుషోత్తమమ్ |

స సర్వవి ద్భజతి మాం సర్వభావేన భారత ॥ 19 వ శ్లోకం 

యః-మాం-ఏవం-అసమ్మూఢః- జానాతి పురుషోత్తమం

స-సర్వవిత్-భజతి-మాం సర్వభావేన -భారత

అర్జునా! మోహము నుండి విడిపడిన వాడు, పురుషోత్తమ స్వరూపమును తెలుసుకున్న వాడు సర్వము తెలిసినవాడు అవుతాడు. అతడు అన్ని విధాల నన్నే పొందుతాడు.

వ్యాఖ్య

పురుషోత్తమ తత్త్వము అనే అఖండ జ్ఞానము యొక్క ఫలమును చెబుతున్నాడు. సర్వ వేద సారము, గీతా శాస్త్ర సారభూతము అయిన ఈ పదిహేనవ అధ్యాయమును అద్భుతంగా ప్రవచించిన భగవానుడు, అట్టి జ్ఞానము యొక్క ఫలమును విశదం చేస్తున్నాడు.

అర్జునా! పురుషోత్తముడ నైన నన్ను ఈ విధంగా (ఏవం) తెలుసుకున్న వాడు మోహము నుండి విడిపడు తున్నాడు. ఏవం ఈ విధంగా, అంటే, ముందు చెప్పుకున్న విధంగా (ఏవం యథోక్తేన ప్రకారేణ ) తెలుసుకున్న వాడు. అంటే కార్యోపాధిని పొంది నశించేది క్షర మని, కారణోపాధిని పొంది మార్పు చెందనిది అక్షర మని, కార్యకారణా లైన క్షరాక్షరములకు అన్యము, అతీతము, ఉత్కృష్ట మైనది పురుషోత్తముడని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సర్వమును తెలుసుకున్న వాడు అవుతున్నాడు (సర్వవిత్ - సర్వం వేత్తీతి). సర్వమును ఏమని తెలుసు కుంటాడు? సర్వము బ్రహ్మమే అని తెలుసుకుంటాడు. తనతో పాటు సమస్తమూ అద్వయ బ్రహ్మ స్వరూపమే అని తెలుసు కుంటాడు ( ఇదం సర్వం యదయ మాత్మా - బృహదారణ్యక శ్రుతి ; 2 - 4 - 6 ). సర్వమూ భగవంతుడే అనే సర్వాత్మ బుద్ధి కలిగి ఉంటాడు. అలాంటి వాడికి మోహం ఎలా ఉంటుంది? అందుకే అతడు అసమ్మూఢుడు (అసమ్మూఢః సంమోహ వర్జితః). ఊర్ధ్వమూలంగా వర్ణింపబడిన పురుషోత్తముని తెలుసుకున్న వాడు సమస్తము తెలిసిన వాడు అవుతున్నాడు 

( సర్వం జానాతి ఇతి ) . సర్వము తెలిసిన సర్వవిదుడు సర్వాత్మ స్వరూపుడైన పురుషోత్తముని యందే లగ్నమైన చిత్తముతో, ఆ సర్వాత్ముణ్ణి పొందుతాడు ( భజతి మాం సర్వ భావేన సర్వాత్మ చిత్తతయా). ఇదే సర్వాత్మ జ్ఞానఫలం. పురుషోత్తమ ప్రాప్తిఫలం.

ఈ జ్ఞానము సుస్పష్ట మైంది. స్వచ్ఛమైనది. ఈ జ్ఞానమును పొందిన వాడు నిత్యానంద స్వరూపుడు

అవుతున్నాడు. అతడికి ప్రపంచం గోచరించినా అది విస్మృత ప్రాయము.  కర్తృత్వము అర్థం కాని వాడు. భోక్తృత్వం పై ఆసక్తి లేని వాడు. గతం అతనిని కలత పెట్ట లేదు. భవిష్యత్తు అతనిలో ఆశలు రేప లేదు. వర్తమానం జ్ఞాన స్నానం చేస్తూ ఉంటుంది.

అతడు సముడు. అతనిలో అంతా సమత్వమే. అతడు సమదర్శి, రాగాలు వినిపించవు. ద్వేషాలు కనిపించవు. నిందలు బాధించవు. స్తుతులు తృప్తి నివ్వ లేవు. అతడు ఆకాశము వంటి వాడు. అతని లోపల,  అతని చుట్టూ ఎన్ని కదలి పోతూ ఉన్నా తాను అస్పరుడై ఉంటాడు. అసంగుడై ఉంటాడు. మేలుకున్న వాడికి స్వప్న మెలా ఉంటుందో, జ్ఞానికి ప్రపంచం అలా ఉంటుంది. తాను అకర్త గానే చరిస్తాడు. అభోక్త గానే శోభిస్తాడు. ఆలయంలో భగవంతు డున్నట్లు, జ్ఞాని హృదయాలయంలో పురుషోత్తముడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞానికి జీవత్వం లేదు. అతడే దేవుడు. ఆ మహాత్ముని పొందిన పుణ్య దేహము కదిలే దేవాలయం. అతనికి ఆత్మ తప్ప మరొకటి కనిపించదు. ఏది కనిపించినా అది ఆత్మ గానే దర్శన మిస్తుంది. అదొక మంగళకర మైన దృష్టి, ఆత్మదృష్టి. సర్వాత్మ దృష్టి, బ్రహ్మదృష్టి, బ్రహ్మాత్మ జ్ఞాన దృష్టి. బ్రహ్మ విజ్ఞాన సంపన్నః ప్రతీత మఖిలం జగత్ | పశ్యన్నపి సదా నైవ పశ్యతి స్వాత్మనః పృథక్, 'బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కనిపించే ప్రపంచమును చూస్తూ ఉండినా, దానిని ఆత్మ కంటే వేరుగా చూడడు' అన్నది వరాహోపనిషత్తు.




#చింతన#గీతాజయంతి_సందర్భంగా_గీతామృతస్నానం#DR_VAISHNAVANGRI_SEVAK_DAS #9821914642

  చింతన  -  గీతా  జయంతి సందర్భంగా .. గీతామృత  స్నానం ' సకృద్  గీతామృత స్నానం సంసార మలనాశనం '    అని  ' గీతా  మహాత్మ్యం '  పల...