Monday, August 28, 2023

#చైతన్యభగవద్గీత#15thChapter#20వశ్లోకం వ్యాఖ్యానము#LyricalAudio_Video

 #చైతన్యభగవద్గీత#15thChapter#20వశ్లోకం వ్యాఖ్యానము#LyricalAudio_Video

ఇతి గుహ్యతమం శాస్త్ర మిద ముక్తం మయా నఘ |

ఏత ద్బుద్ధ్వా బుద్ధిమా న్యా త్కృతకృత్యశ్చ భారత ॥20 వ శ్లోకము 

ఇతి-గుహ్యతమం-శాస్త్రం-ఇదం-ఉక్తం-మయా-అనఘ

ఏతత్-బుద్ధ్వా-బుద్ధిమాన్-స్యాత్- కృతకృత్యః-చ-భారత

అర్జునా! అతి రహస్యమైన శాస్త్రమును నీకు బోధించాను. దీనిని తెలుసుకున్న వాడు బుద్ధిమంతుడు అవుతాడు. కృతకృత్యుడు అవుతాడు.

వ్యాఖ్య

మోక్ష ఫలాన్ని అందించే పరమాత్మ జ్ఞానాన్ని పూర్వ శ్లోకంలో ప్రస్తావించిన భగవానుడు, ప్రస్తుత శ్లోకంలో అధ్యాయాన్ని ప్రశంసిస్తూ ఉపసంహరిస్తున్నాడు. సాధారణంగా భగవద్గీతను గీతా శాస్త్రం అంటాము. కాని, భగవంతుడు ఈ అధ్యాయాన్నే శాస్త్రముగా పేర్కొనడంలో అధ్యాయ ప్రశంసను చెప్పకనే చెప్పిన ట్లైంది. పరమేశ్వరుడు అర్జునునకు బోధించిన ఈ పురుషోత్తమ తత్త్వము గుహ్యతమము అంటున్నాడు ( ఇదం ఉక్తం శాస్త్రం గుహ్యతమం). గుహ్యము అంటే రహస్యము. గుహ్యతమము అంటే అత్యంత రహస్య మని అర్థము. పరమాత్మకు సంబంధించిన జ్ఞానం కావడం చేత ఇది అతి రహస్య మైంది. రహస్యము అంటే తెలియనిది అని అర్థము. తెలియనంత వరకే ఏదైనా రహస్యంగా ఉంటుంది. తెలియని దానిని తెలిపిన తరువాత ఇక రహస్య మంటూ ఉండదు. కాని, పరమాత్మ జ్ఞానము అలాంటిది కాదు. లౌకిక విద్యలు ఏవైనా చెబితే తెలుస్తాయి. వేదాంత విద్య చెప్పినా అర్థం కాదు. అర్థమైనట్లే ఉంటుంది. ఏమి అర్థమైంది? అని ప్రశ్నించుకుంటే అర్థం కాలేదనే సమాధానం వస్తుంది. అందుకే అది గుహ్యతమము. పరమాత్మే గుహ్యమైన వాడు. ఆయనకు సంబంధించిన జ్ఞానం కావడం చేత బ్రహ్మవిద్య గుహ్యతమ మైంది.

ఇంతకీ పరమాత్మ స్థావర మెక్కడ? పోనీ, ఉపలబ్ది స్థానం ఏది? హృదయమే కదా! నేను 

ప్రాణులందరి హృదయాలలో ఉన్నాను అని ఈ అధ్యాయంలో భగవంతుడే స్వయంగా చెప్పాడు కదా! మరి, హృదయంలోనే ఉన్నవాడు ఎంత పిలిచినా పలకడు. ఎంత నిరీక్షించినా కనిపించడు. తెలుసుకుందా మంటే అర్థం కాడు. అలాంటి వానిని ఏమనాలి? గుహ్యమైన వాడు అనాలి. వ్యాసుడు అలాగే అన్నాడు. భీష్మాచార్యుల వారి చేత అనిపించాడు గుహ్యః అని. గుహలో దాగినట్లు హృదయ గుహలో రహస్యంగా ఉన్నందున పరమాత్మను ‘గుహ్యుడు” అని అనవలసి వచ్చింది. తానే గుహ్యుడు కావడం చేత తనకు సంబంధించిన జ్ఞానము గుహ్యతమమైంది. రహస్యంగా ఉండే వాడికి సంబంధించిన జ్ఞానము అత్యంత రహస్య మైంది 

(తత్ గుహ్యతమం గోప్యతమమ్ అత్యన్త రహస్యమ్ ).

వేదాంత జ్ఞానము, అంటే ఉపనిషత్తుల లోని జ్ఞానము అతి రహస్య మైనది. గహన మైనది కనుక

రహస్యము. ఉత్కృష్ట మైనది కావడం చేత రహస్యము. గుహ్యమైన, అంటే రహస్యమైన ఉపనిష ద్విజ్ఞానము చేత పొందబడే వాడు కనుక భగవానుడు గుహ్యుడు 

(గుహ్యః రహస్యోపనిషత్ వేద్యత్వాత్ గుహాయాం హృదయా నిహిత ఇతి వా గుహ్యః).

ఎవరు నీవు ? ఎవ్వరూ ఎరుగ లేరు

ఎరిగిన వారు తిరిగి ఎరుక పరచ లేరు

ఎదను చేరి సొదలన్నీ విందువయ్యా!

నీ అడుగుల కడ పడి ఉందు చిన్నికృష్ణా !

అని గోవిందుని గుట్టు విప్పింది చిన్నికృష్ణ శతకము.

గుండె లోనే ఉన్నా గుర్తు తెలియక పోవడము ఒక రహస్య మైతే, అత డెవరో కాదు, నీవే అని ఎంత

మొత్తుకున్నా అర్థం కాక పోవడము మరొక రహస్యం. స్వప్రయత్నంతో యత్నించినా, పరుల సహకారంతో ప్రయత్నించినా రహస్యం రహస్యం గానే ఉంటూ ఉంది. అందుచేత శ్రుతి రేవ శరణమితి - వేదమే శరణ్యము, వేదాంతమే శరణ్యము అని శాస్త్రాన్ని ఆశ్రయించ వలసి వస్తోంది. శాస్త్రాన్ని గురుముఖతః అధ్యయనం చేసినా రహస్యం అలాగే ఉంది. అందుకే గుహ్యమైన పరమాత్మకు సంబంధించిన శాస్త్రము గుహ్యతమమై కూర్చుంది. అట్టి గుహ్యతమ మైన శాస్త్రాన్ని భగవంతుడు అర్జునునికి బోధించాడు.

రహస్యమై, దుర్విజ్ఞేయమై ఉండటం చేత 'గుహ్యతమం' అనే మాటను చర్విత చర్వణంగా పరమేశ్వరుడు గీతలో వినిపించాడు. గీత పూర్వార్ధము సమాప్త మయ్యే తొమ్మిదవ అధ్యాయం మొదటి శ్లోకం లోను, గీతను సమాప్తం చేస్తూ పద్దెనిమిదవ అధ్యాయం అరవై నాల్గవ శ్లోకం లోను గుహ్యతమం అని చెప్పడమే గాక, మధ్యలో గీతా హృదయంగా భాసిస్తున్న పదిహేనవ అధ్యాయాన్ని సమాప్తం చేస్తూ కూడా అదే మాటను వినిపించాడు. శాస్త్రం ఎంత గుహ్యతమమో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ముందు గానే అధ్యాయ పీఠికలో చెప్పు కున్నట్లు, 'పురుషోత్తమ ప్రాప్తి యోగము' అనే ఈ అధ్యాయములో సమస్త గీతా శాస్త్ర సారమే గాక సమస్త వేదార్థము కూడా సమాప్త మైంది అని శ్రీ శంకరాచార్య స్వామి అభిప్రాయ పడ్డారు (సర్వో హి గీతా శాస్త్రార్థః అస్మిన్ అధ్యాయే సమాసేన ఉత్తః, న కేవలం గీతా శాస్త్రార్థ ఏవ, కిం తు సర్వశ్చ వేదార్థః ఇహ పరి సమాప్తః ). మొదటి శ్లోకం, పదిహేనవ శ్లోకం, పద్దెనిమిదవ శ్లోకం ఈ అధ్యాయము వేదార్థ మనే విషయానికి అద్దం పడుతున్నాయి. అధ్యాయాంత శ్లోకమైన ప్రస్తుత శ్లోకం ఇతి అంటూ ప్రారంభమై అధ్యాయమును సమాప్తం చేయడము, సంప్రదాయానుసారం శాస్త్ర పరి సమాప్తిని సూచిస్తూ ఉంది. ఇటువంటి అద్భుతమైన, రహస్యమైన విషయాన్ని అర్జునునికి బోధించినట్లు భగవంతుడే స్వయంగా చెబుతున్నాడు. ఈ సందర్భంలో అర్జునుని అనఘ! అని, భారత! అని సంబోధించడం ముఖ్యంగా

గమనించ దగిన విషయం. అఘము అంటే పాపము. పాప రహితుడు కావడం చేత అర్జునుణ్ణి భగవంతుడు అనఘ! అని సంబోధించాడు. అర్జునుని జీవితంలో అకారాది క్షకారాంతం వరకు కాగడా పెట్టి వెతికినా పాపపు ఛాయలు కనిపించవు. అందుకే, అర్జునుడు అనఘుడు (అనఘ! అపాప!). అర్జునుడు అనఘుడు కావచ్చు. కాని, ఈ సందర్భములో భగవానుడు అతనిని ఇలా సంబోధించడం ఎంతో భావగర్భితంగా ఉంది. సమస్త వేదాంత సారమైన పురుషోత్తమ తత్త్యాన్ని గ్రహించాలి అంటే, ఆ ప్రయత్నం చేసే వ్యక్తి పాప రహితుడై ఉండాలి అని సూచించడమే దీని

అంతరార్థము. శుద్ధి పడిన బుద్ధి లోనే పవిత్రమైన పరమాత్మ జ్ఞానము నిలుస్తుంది. 'భా' అంటే ప్రకాశము (భా దీప్తా). 'రత' అంటే ఆసక్తి అని, రమించడ మని అర్థము. ప్రకాశవంతమైన 

జ్ఞానము నందు ఆసక్తి కల వాడు, పాప రహితుడై ఉండాలి (అనఘ!). 'అనఘ' అనే పదం జ్ఞానార్హతను, అధికారిత్వాన్ని సూచిస్తూ ఉంటే, జ్ఞానమును పొందిన తరువాత జ్ఞానద్యుతిలో రమించడము జరుగు తుందని 'భారత!' శబ్దము సూచిస్తూ ఉంది. అంతే కాదు, అర్జునుడు భరత వంశోద్భవుడు. వ్యక్తిగతంగా చూస్తే పాపరహితుడు. వంశ గతంగా,

కుటుంబ నేపథ్యాన్ని చూచినా, ప్రకాశవంత మైన వాడు. కనుకనే పరమాత్మ నుండి పవిత్రమైన జ్ఞానాన్ని ఆలకించాడు. పైగా అనన్య సామాన్యంగా, అనితర సాధ్యంగా సాక్షాత్తు పరమాత్మ నుండే 'అనఘ!' అనే బిరుదును పొంది జన్మను సార్థకం చేసుకున్నాడు.

శ్రవణ ఫలం

పరమేశ్వరుడు బోధించిన గుహ్యమైన పురుషోత్తమ తత్త్యమును ( ఏతత్ శాస్త్రం యథా దర్శితార్థం)

యథాతథంగా తెలుసుకున్న వాడు (బుద్ధా) బుద్ధిమంతుడు అవుతాడు (స బుద్ధిమాన్ స్యాత్).

జ్ఞానమును పొందిన తరువాత బుద్ధిమంతుడు కావడ మేమిటి? బుద్ధి తోనే కదా జ్ఞానమును

సముపార్జిస్తారు? అనే సంశయము కలగ వచ్చు. ఇక్కడ బుద్ధిమంతుడు అంటే వివేకం కల వాడు అని అర్థము. జ్ఞానము కల వాడు అని భావము.

బుద్ధి అందరికీ ఉంటుంది. బుద్ధి ఉన్న వాళ్ళందరూ బుద్ధిమంతులు కారు. ఎవరి బుద్ధిలో వివేకం

ఉంటుందో, ఎవరి బుద్ధి జ్ఞాన పూరితమై ఉంటుందో వారే బుద్ధిమంతులు.

'నీకు బుద్ధి లేదు' అని ఒకరు మరొకర్ని తిడుతూ ఉండటం అనేక సార్లు మనం విని ఉంటాము. దాని

అర్థ మేమిటి? వాస్తవంగా అతను బుద్ధి లేని వాడే అయితే, ఈ నిందా వాక్యం అర్థం కావలసింది ఎవరికి? బుద్ధిలేని చెట్టుకో, గోడకో, పిల్లికో, నల్లికో అర్థం కాదు కదా! అతనికి బుద్ధి లేదు అనేదే గనుక దూషించే వ్యక్తియొక్క అభిప్రాయమైతే, అసలు బుద్ధిలేని దెవరికి? అని విన్న వాళ్ళం మీమాంసలో పడవలసి వస్తుంది. బుద్ధిలేని వ్యక్తినే నిందించాడు. అనుకుందాం. బుద్ధిలేదు అనిఅంటే అసలే బుద్ధి లేదని కాదు. పనిచేయని బుద్ధి ఉందని అర్థము. పని చేయనిది ఉన్నా, లేకపోయినా పెద్ద తేడా ఉండదు.

శాస్త్రాన్ని బుద్ధిమంతులే వింటారు. అది కూడా శుద్ధ బుద్ధి కల వారే వింటారు. శుద్ధ బుద్ధి కల వారే

శాస్త్రాన్ని అర్థం చేసుకో గలుగుతారు. బుద్ధి కలిగి శాస్త్ర హృదయాన్ని అర్థం చేసుకున్న వారు బుద్ధిమంతులు అవుతారు. అంటే జ్ఞానవంతులు అవుతారు (బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ భవేత్ !). పరమేశ్వరుడు జ్ఞాన స్వరూపుడు. అట్టి మహాద్భుత శక్తిని జ్ఞానం ద్వారా పొంద వలసిందే గాని మరో మార్గం లేదు (న అన్యథా ). క్షర పురుషుడుగా కార్య రూప జగత్తులో సర్వత్ర తానే వ్యాపించి ఉన్నాడు (కుండలో మట్టి లాగా). అక్షరపురుషుడుగా కారణ రూప అవ్యక్తానికి, లేదా మాయకు కూడా తానే ఆశ్రయమై ఉన్నాడు. ఇలా కార్య కారణాలలో ఉన్న పరమేశ్వరుడు, ఆ రెండిటికి విలక్షణంగా తన మహిమలో (స్వే మహిమ్ని) పురుషోత్తముడుగా విరాజిల్లు తున్నాడు. అలాంటి వానిని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి అంటే ఎలాంటి బుద్ధిఉండాలి? ఉన్నదంతా పురుషోత్తమ తత్త్వమే అయినపుడు, అది సిద్ధించే ఉంది కదా! అది లేని దెప్పుడు? లేనిదెక్కడ? మరి అంతట ఉన్న అద్వయ సత్తా స్వరూపాన్ని ఎలా పొందగలం? సాధ్య వస్తువును పొందగలం గాని

సిద్ధ వస్తువును ఎలా పొందాలి? దానిని ఎలా చేరాలి అంటే ఏం చెప్పగలం? జ్ఞానం ద్వారానే పొందాలి. జ్ఞానంతోనే చేరాలి ( జ్ఞానే నైవ గమ్యతే). ఉండి తెలియక పోవడం అజ్ఞానం కనుక, అజ్ఞానము జ్ఞానము ద్వారానే తొలగించ బడాలి. మరో మార్గం లేదు. పరమేశ్వరుని ఎవరైనా అలాగే పొందాలి. ఎవరి కైనా భగవంతుడు హృదయస్థుడు గానే అర్థం కావాలి.


తన ఆత్మ స్వరూపం గానే తెలియాలి. కనుకనే, సర్వస్య చాహం హృది సన్నివిష్టః - నేను అందరి హృదయాలలో ఉన్నాను అన్నాడు భగవంతుడు (15 వ శ్లో). కొందరి హృదయాల లోనే ఉన్నాను అని చెప్ప లేదు. కనుక, పరమేశ్వర దర్శనాన్ని అభిలషించే వారు, పురుషోత్తమ ప్రాప్తిని పొందగోరే వారు బాహ్యంలో అన్వేషించి పరమాత్మను పొంద లేరు. అంతరంగమున అవలోకించి మాత్రమే పొందగలరు.

ఆఖ్యాయిక

హిరణ్యకశిపుని ఉగ్ర తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, కోరిన వరాలను అనుగ్రహించిన

తరువాత, నాయనా! హిరణ్యకశిపూ! నీవు కోరిన వరాలు సామాన్య మైనవి కావు. గతంలో ఎవ్వరూ ఇలా కోరలేదు. అయినా నిన్ను కరుణించి అనుగ్రహించాను.

నన్నుం గోరిన వెల్ల నిచ్చితి బ్రవీణత్వంబుతో బుద్ధి సం

పన్నత్వంబున నుండు మీ సుమతి వై భద్రక శీలుండవై !

'బుద్ధితో ప్రవర్తించు. నేర్పుతో జీవించు. బుద్ధిమంతుడవై, మంగళ స్వభావంతో మసలుకో! అని పలికి అరవింద సంభవుడు అంతర్హితు డయ్యాడు. చెప్పిన హిత మంతా ఎటు పోయిందో! మరు క్షణమే సుర లోకంపై దండెత్తాడు హిరణ్యకశిపుడు. సురులను జయించాడు. యక్ష, కిన్నర, గంధర్వ, కింపురుషాదులను ఓడించి ఊర్ధ్వ లోకాలను స్వాధీనం చేసుకుంటూ వచ్చి, చివరగా శత్రువైన శ్రీహరిని జయించాలని వైకుంఠం వైపు తిరిగాడు.

మార్గ మధ్యంలో వైకుంఠం నుండి తిరిగి వస్తున్న నారద మహర్షి ద్వారా విష్ణువు వైకుంఠం లోనే ఉన్నాడని తెలుసుకొని పరమోత్సాహంతో ఆ వైపుకు దూసు కెళ్ళాడు. నారద మహర్షి కూడా వెనుదిరిగి హిరణ్యకశిపుని అనుసరించాడు. తీరా అక్కడి కెళ్ళి చూస్తే విష్ణుమూర్తే కాదు, ఆదిశేషుడు కూడా లేడు. ఇక, అమ్మవారు ఎక్క డుంటుంది?

నారదా! ఎక్కడ నీ హరి? అని నారదుని వైపు కళ్ళెర్ర జేసి చూశాడు హిరణ్యకశిపుడు. అయ్యా! వేమ

ఇక్కడే చూశాను. ఈ లోగా ఏమయ్యాడో? అని బిక్క మొగం వేశాడు నారదుడు.

చూస్తాను. ఈ చతుర్దశ భువనాలలో నన్ను ఎలా తప్పించు కుంటాడో చూస్తాను అంటూ విష్ణుదేవుని

కొరకు భువనా లన్నీ గాలిస్తున్నాడు కశ్యపాత్మజుడు.

ఒక వైపు హిరణ్యకశిపుడు క్రోధంతో అన్వేషిస్తూ ఉంటే, మరో వైపు నారదుడు భక్తితో అన్వేషిస్తున్నాడు. అటు హిరణ్యకశిపునికి విష్ణువు కనిపించ లేదు. ఇటు నారద మహర్షికీ విష్ణుదర్శనం కాలేదు. విసిగి వేసారిన దితి నందనుడు రాక్షస లోకాని కెళ్ళాడు.

నారద మహర్షి పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. అచ్యుతుని కోసం వెతికి వెతికి నారదుడు కూడా

అలసి పోయాడు. చివరగా, ఎందుకైనా మంచిది. మళ్ళీ ఒకసారి వైకుంఠానికే వెళ్ళి చూద్దా మని మహర్షి మాధవ సన్నిధానానికి పయన మయ్యాడు. తీరా వెళ్ళి చూస్తే సిద్ధము సుమతీ విష్ణు భగవానుడు సతీ సపరివారసమేతంగా శేషతల్పం మీద పవ్వళించి ఉన్నాడు. మహర్షికి నోట మాట రాలేదు. 'నారదా! అదేమిటి? అదోలా ఉన్నావు? ఏం జరిగింది? అని అమాయకంగా ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి. అయ్యా! మహానుభావా! నా విషయం అలా ఉంచండి. తమరు ఇంతకాలం ఎక్క డున్నట్లు? తమరి మకాం ఎక్కడో అర్థం గాక నేను తిరగని చోటు లేదు అన్నాడు నారద మహర్షి. అదేమిటి? నువ్వు ఒక్కడివే తిరిగినట్లు మాట్లాడుతున్నావు? హిరణ్యకశిపుడు కూడా నీ కన్నా ఎక్కువగానే తిరిగాడు కదా! అన్నాడు విష్ణుమూర్తి.

నారదా! నేను ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా హిరణ్యకశిపుడు నా జాడ కనిపెట్టేస్తాడు. ఎక్కడ దాగితే అతడు కనిపెట్ట లేడో అక్కడ దాగాను అన్నాడు విష్ణుమూర్తి. అదెక్కడ స్వామీ? మీరు దాగింది ఎక్కడ? అని అడిగాడు నారద మహర్షి.

నారదా! నేను దాగింది హిరణ్యకశిపుని హృదయం లోనే. హిరణ్యకశిపుడు అహంకారి. తన కన్నా వేరైన ప్రదేశాలలో అన్వేషిస్తాడే గాని, తనలో తాను తల వంచి, అంతర్ముఖుడై చూడడు. అందుకనే

దాచుకోవడానికి అదే అనువైన చోటు అని భావించి, అతని హృదయం లోనే ఒదిగి పోయాను అని రహస్యాన్ని విప్పి చెప్పాడు వైకుంఠ పతి.

కృతకృత్యుడు

పరమాత్మ జ్ఞానమును పొందిన వాడు కృతార్థు డవుతున్నాడు. ఆత్మయే పరమాత్మ అనే

జ్ఞానము మహోన్నత మైంది. పరమాత్మ జ్ఞానమును పొందిన వాడు అంతకు మించి పొంద వలసింది ప్రపంచములో మరొకటి ఉండదు. పర అంటే ఉత్కృష్టమైనది అని అర్థము (పరః సర్వ భూతేభ్యః ఉత్కృష్టం బ్రహ్మ ). అట్టి పరమాత్మ జ్ఞానము ప్రాప్తించిన వాడు 

కృతకృత్యుడవుతున్నాడు.

కృత్యము అంటే కార్యము. కృతం అంటే చేయబడింది. ఏది కర్తవ్యమో అదే కృతం. కర్తవ్యము అంటూ మిగలకుండా చేయ వలసిన కార్యము లన్నీ చేసేసిన వాడు కృతకృత్యుడు (కృతం కృత్యం కర్తవ్యం యేన సః కృత కృత్యః). ఎలాగైతే స్వప్నంలో చేయ వలసిన కర్తవ్యా లన్నీ మేలుకోగానే చేసినట్లే అవుతున్నాయో, అలాగే భగవతత్త్వాన్ని  తెలుసుకుంటే చేయ వలసిన కర్తవ్యా లన్నీ చేసినట్లే అవుతున్నాయి. అట్టి వాడు కృతకృత్యుడు అవుతున్నాడు (యత్ కర్తవ్యం తత్ సర్వం భగవత్తత్త్వే విదితే కృతం భవేత్ ఇత్యర్థః). ఈ విధంగా సమస్త కర్మలు జ్ఞానములో లయించి పోతున్నాయి (4 వ అ - 33 వ శ్లో ). ఈ విధమైన అత్యంత రహస్యమైన బ్రహ్మాత్మ జ్ఞానమును బోధించి, అర్జునుణ్ణి కృతార్థుణ్ణి చేశాడు కరుణా సముద్రుడైన భగవంతుడు. ‘అర్జునా! గుహ్యతమ మైన శాస్త్రాన్ని నీకు బోధించాను. పరమార్థ స్వరూపమైన పురుషోత్తమ తత్త్యమును నా ద్వారా శ్రవణం చేసి నువ్వు కృతార్థుడ వయ్యావు, కృతకృత్యుడ వయ్యావు' అని పలుకుతూ పదిహేనవ అధ్యాయాన్ని పరమేశ్వరుడు సమాప్తం చేస్తున్నాడు (ఏతత్ పరమార్థ తత్త్వం మత్తః శ్రుతవాన్ అసి తతః కృతార్థః

త్వం భారత ఇతి ).

ఇతి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం

యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే

పురుషోత్తమప్రాప్తి యోగో నామ పఞ్చదశో ధ్యాయః

ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రము, 

శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీత యందు

పురుషోత్తమప్రాప్తి యోగ మనే పదిహేనవ అధ్యాయము.



నన్ను నేను


No comments:

Post a Comment