Monday, August 28, 2023

చైతన్య భగవద్గీత - 15వ అధ్యాయము - విశ్వరూపసందర్శన యోగము - 15వ శ్లోకము మరియు వ్యాఖ్యానము

 చైతన్య భగవద్గీత - 15వ అధ్యాయము - విశ్వరూపసందర్శన యోగము - 15వ శ్లోకము మరియు వ్యాఖ్యానము 

సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞాన మపోహనం చ I

వేదైశ్చ సర్వై రహమేవ వేద్యో వేదాన్తకృ ద్వేదవి దేవ చాహమ్ ॥ 15

సర్వస్య-చ-అహం-హృది-సన్నివిష్టః-మత్తః - స్మృతిః-జ్ఞానం-అపోహనం-చ

వేదైః-చ-సర్వైః-అహం-ఏవ -వేద్యః- వేదాంతకృత్-వేదవిత్-ఏవ-చ-అహం

అర్జునా! అందరి హృదయాలలో నేను ఉన్నాను. నా వల్లనే స్మృతి, జ్ఞానము, వాటి మరపు కూడా. సమస్త వేదాల చేత తెలియదగిన వాణ్ణి నేనే. నేనే వేదాంత కర్తను. వేదాన్ని తెలిసిన వాణ్ణి కూడా నేనే.

వ్యాఖ్య

విశ్వంలో వెలుగులను ఆరబోస్తున్న సూర్య చంద్రాగ్నుల లోని తేజము, సర్వ ప్రాణులను ధరిస్తున్నభూమి లోని ధారణా శక్తి, భూమి మీద సమస్త ఓషధులను రసపూర్ణం చేస్తున్న సోముని రసాత్మక స్వరూపము,ప్రాణుల లోని వైశ్వానరాగ్ని, అన్న అన్నాద రూపములో విశేషంగా విస్తరించి ఉన్న తన వైభవము - ఇలా భగవానుడు సంక్షేప విభూతులను వివరించడం ద్వారా తన సర్వాత్మకత్వాన్ని నిరూపించడం జరిగింది. విశ్లేషించి అవలోకిస్తే ఇదంతా 'తత్' పదమును నిర్దేశించినట్లు అర్థ మవుతుంది. ఇక వ్యక్తి లోని 'త్వం' పదమును విస్పష్టం చేస్తే జ్ఞానం పరిపూర్ణ మవుతుంది. పురుషోత్తమ తత్త్వము అనుభూత మవుతుంది. కనుక, పన్నెండవ శ్లోకంలో యదాదిత్యగతం తేజః అంటూ ప్రారంభించిన విభూతుల సంక్షేపాన్ని ప్రస్తుత శ్లోకంలో ఆత్మ విభూతిని, జ్ఞాన విభూతిని, సంప్రదాయ విభూతిని దివ్యంగా ప్రవచించి సమాప్తం చేస్తున్నాడు.

హృదయంలో దయానిధి

'అర్జునా! సర్వ ప్రాణుల (సర్వస్య ప్రాణి జాతస్య) హృదయంలో (హృది బుద్ధా) నేను ఆత్మరూపంగా ఉన్నాను ( అహమ్ ఆత్మా సన్ సంనివిష్టః ) '. భగవానుడు ఆత్మరూపంలో ఉండటము అంటే తన స్వరూప మహిమలో శోభించడము అని అర్థము. సచ్చిదానంద స్వరూపంగా భాసించడము అని భావము. ఇదే స్వరూప మహిమ, లేదా స్వరూప వైభవము. అహమస్మి - 'నేను ఉన్నాను' అని ప్రతి మనిషి చెబుతున్నాడు. ఈ విషయాన్ని అందరూ ఒకే విధంగా చెబుతున్నారు. ఎలా ఉన్నావు? అని తిరిగి ప్రశ్నించి నపుడే, పరిస్థితి క్లిష్టంగా మారుతూ ఉంది. ఎవరి మధ్య ఏకాభిప్రాయం లేదు. ఎందుకని? ఏకమైనది ఏదో, దానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం చేత ఏకాభిప్రాయంలేదు.

'నేను ఉన్నాను' అని శరీరం చెబుతుందా? లేదు. శరీరం చెప్పే టట్లైతే, పిచ్చివాడు మొదలుకొని శవం వరకు అన్ని దేహాలు చెబుతాయి 'నేనున్నాను-నేనున్నాను' అని. దేహం ఉంది. కాని, తాను ఉన్నట్లు దేహానికి  తెలియదు. అందుచేత, నేనున్నాను అని దేహం చెప్పదు. పైగా, 'ఇది నా దేహము' అని మనం చెబుతున్నాం. కనుక, 'నేను' అనే భావన (అహం భావన) దేహంలో లేదు. దేహానికి లేదు. దేహానికి అహంభావన ఎలా లేదో ఇంద్రియాలకూ లేదు. అవన్నీవిషయాల్ని మనస్సుకు చేరవేసే  పరికరాలుగా ఉన్నాయే కాని, విషయాలను తెలుసుకొనే స్థితిలో లేవు.అందుచేత 'నేను తెలుసుకున్నాను” (అహం జానామి ) అని ఏ ఇంద్రియమూ చెప్పడం లేదు. 'నేను ఉన్నాను' అనే జ్ఞానం మనోవృత్తికి మాత్రమే ఉంది అని చాలా మంది మేధావులు కూడా భ్రమిస్తూ ఉంటారు. వృత్తి మనస్సులో ఉంటుందే గాని, వృత్తిలో 'నేను' అనే లేదు. స్వరూప జ్ఞానం లేదు. దేహం మొదలు మనస్సు వరకు అన్నీ ఆధేయాలే గాని ఏదీ ఆధారం కాదు. వీటన్నిటికి ఏది అధిష్ఠానంగా ఉందో అదే ఆధారము. సర్వాధారము. స్వప్రకాశము. స్వరూప వైభవము (స్వమహిమ).ఇంద్రియాలు పరవశ మైతే, మనస్సు నిష్క్రియ మైతే, దేహం కొయ్యమొద్దు లాగా పడి ఉంటుంది.

అంతే గాని, 'నేనున్నాను' అని లేచి నడవదు. దేహం స్వతంత్ర శక్తి లేనిది. పరాధీనమై ఉన్నది. ఇంద్రియాలు కూడా విషయాలను గ్రహించ గలవే కాని, విషయాలకు సంబంధించిన జ్ఞానం కలగడానికి అవి మళ్ళీ మనస్సుపై ఆధారపడి ఉన్నాయి. మరైతే, మనస్సుకు స్వయం సత్తా, స్వయం స్ఫూర్తి ఉన్నాయా? లేవు. ఉంటే, గాఢనిద్రలో కూడా మనస్సు విషయ గ్రహణం చేయగలిగి ఉండాలి. మనస్సుకు సత్తా స్ఫురణలు చైతన్యం వల్ల కలుగు తున్నాయి. దేహేంద్రియ మనస్సులు ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. మరి చైతన్యము దేనిపై ఆధారపడి ఉంది? చైతన్యము ఆధార పడటానికి మరొక చైతన్యము లేదు. చైతన్యము ఏకము, అద్వయమే

గాని రెండుగా ఉండలేదు. రెండు చైతన్యాలు ఉండటం అనూహ్యము, అసంభవము, అశాస్త్రీయము. మరొక దానిపై ఆధారపడి లేనందున చైతన్యము స్వతఃసిద్ధము. స్వతఃసిద్ధమైన సత్తారూప చైతన్యాన్ని ప్రకాశింప చేయడానికి మరొక చైతన్యము లేనందున అది స్వప్రకాశము. సత్తా స్ఫురణాత్మకమైన ఈ చైతన్యమే ఆత్మ. అహం స్వరూపము. దేహేంద్రియ మనస్సులకు అధిష్ఠానమైన ఈ చైతన్యాత్మ ప్రతి ప్రాణి హృదయంలో దివ్యంగా ప్రకాశిస్తూ ఉంది 

(హృది సన్నివిష్టః ). ఇప్పుడు తత్త్వం స్పష్ట మైందని భావిస్తాను. 'నేను ఉన్నాను' (అహమస్మి) అని ఎవరు అన్నా. 'నేను ఆత్మ రూపంగా ఉన్నాను' (అహమ్ ఆత్మా సన్ సన్నివిష్టః) అనేదే పరమార్థం. అట్టి జ్ఞానం వ్యక్తికి లేక పోవచ్చు. జ్ఞానం లేని కారణంగా, ఉన్న దానిని మరొక విధంగా భావించ వచ్చు. అంత మాత్రాన వస్తువు వస్తువు కాకుండా పోదు. ఇది రోజా పుష్పము అనే జ్ఞానం లేని వాడు దానిని చేమంతి అన్నంత మాత్రాన అది చేమంతిగా మారిపోతుందా?

రోజా పుష్పానికి సంబంధించిన జ్ఞానం లేక పోవడం చేత ఇది రోజా పుష్పము అని తెలుసుకోలేక

పోయాడు. అంతే. కనుక, అతని వద్ద రోజా పుష్పానికి సంబంధించిన జ్ఞానం లేదు. మరే ముంది? రోజాపుష్పానికి సంబంధించిన అజ్ఞానం ఉంది. అజ్ఞాన కారణంగా రోజా రోజాగా తెలియక పోగా, చేమంతిగా అర్థమైంది. ఇదే అధ్యాస. అది కాని దాని యందు అది అనే బుద్ధి ( అతస్మిన్ తదుద్ధి:). అధ్యాస నివారించ బడదు. అజ్ఞాన నివృత్తి జరిగితేనే అధ్యాస తొలగుతుంది. అజ్ఞానము జ్ఞానమువల్లనే పోతుంది. దేనికి సంబంధించిన జ్ఞానం? ఉన్న దానికి సంబంధించిన జ్ఞానము. అదే ఆత్మజ్ఞానము. సత్యజ్ఞానము. వేదాంత జ్ఞానము. దీనిని తెలుసుకోవాలి. దీనిని దర్శించాలి అన్నది బృహదారణ్యక శ్రుతి ( ఆత్మావా అరె ద్రష్టవ్యః). నీవు చైతన్య రూపుడవు, సర్వాత్మవు అని శాస్త్రం ప్రామాణికంగా బోధిస్తూ ఉంది. అది నీవు కానవసరం లేదు. అది నేను అని తెలుసుకుంటే చాలు. ఇదే అర్థం కావలసిన విషయం. అయ్యా! నువ్వు గాయకుడివి అని గాయకుడు కాని వ్యక్తికి చెబితే, అది విని, ఆసక్తిని పెంచుకొని 'అనగ అనగ రాగ' మంటూ దివారాత్రాలు సాధన చేసి, ఎలాగైతే నేమి సంగీత జ్ఞానాన్ని సముపార్జించుకొని అతడు గాయకుడు కావచ్చు. అదే విధంగా, నువ్వు ఆత్మవు. నువ్వే బ్రహ్మానివి (త్వం బ్రహ్మాసి) అని ఒక వ్యక్తికి చెబితే, అతడు బ్రహ్మము కావడానికి ప్రయత్నించాడనుకోండి. కఠోర సాధన చేశా డనుకోండి. అతడు బ్రహ్మము అవుతాడా?

కానే కాడు. ఎందుకని? అతడు బ్రహ్మము అయ్యే ఉన్నాడు కనుక. ఎవడైనా లేని దానిని పొందగలడు గాని ఉన్న దానిని ఎలా పొందుతాడు? ఉన్నది అని తెలుసుకుంటాడు. అంతే. అదే జ్ఞానం.  నేను ఆత్మగానే ఉన్నాను అనే జ్ఞానం. ఆత్మజ్ఞానం. ఈ విషయం గురువు చెబుతాడు. అది అవునో కాదో నువ్వు విచారించు కోవాలి (అతః విచారః కర్తవ్యః ) శాస్త్ర విచారం చెయ్యాలి. అది కూడా గురూప సదనం లోనే జరగాలి. అప్పుడు తెలిసి వస్తుంది. నేను ఆత్మను. చైతన్యాత్మను. క్రొత్తగా సంభవించే వాణ్ణి కాను. సదా సిద్ధమై ఉన్నాను. సద్రూపంగా ఎప్పుడూ ఉన్నాను 

(సద్రూపేణ అహం సదా అస్మి). చిద్రూపంగా సదా ప్రకాశిస్తూ ఉన్నాను

( చిద్రూపేణ అహం సదా భామి). సద్రూపముగా, చిద్రూపముగా ఉన్న నేను అనంత స్వరూపముగా విరాజిల్లుతున్నాను. అనంతాత్మ సమస్తము తానై ఉంది. మరి బ్రహ్మము? ఆత్మయే బ్రహ్మము. ఈ ఆత్మయే బ్రహ్మము ( అయమాత్మా బ్రహ్మ ). సర్వం ఆత్మైవ, తల్లక్ష్యం శుద్ధాత్మ దృష్ట్యా వా యః పశ్యతి స ఏవ బ్రహ్మ నిష్ఠా భవతి- 'సమస్తమూ ఆత్మయే.

ఈ వాక్యానుసారము పరమాత్మయే లక్ష్యము. ఈ విధంగా ఆత్మ పరమాత్మ స్వరూపము అనే అద్వయ జ్ఞానంతో దర్శించే వాడు బ్రహ్మనిష్ఠుడు' అని మండల బ్రాహ్మణోపనిషత్తు.

అధిష్టానమే సర్వాధారము

సర్వాత్మయే హృదయస్థమై ఉన్నందున, మనిషి మనస్సులో ఏర్పడే స్మృతి, జ్ఞాన, అపోహనాలు ఆత్మ కారణం గానే కలుగు తున్నాయి. అర్జునా! ఈ కారణంగా (అతః) నా వల్లనే సర్వ ప్రాణులకు (మత్తః ఆత్మనః సర్వ ప్రాణినాం ) స్మృతి, జ్ఞానము, అపోహనము కలుగు తున్నాయి

 (స్మృతిః జ్ఞానం తదపోహనం చ).

మొదటిది స్మృతి, స్మృతులు అంటే జ్ఞాపకాలు. గత అనుభవాలకు సంబంధించిన జ్ఞానమే స్మృతి. రెండవది జ్ఞానము. విషయ ప్రపంచానికి సంబంధించిన పరిజ్ఞాన మంతా జ్ఞానము అని చెప్ప బడింది. అది ఇహ పరాలకు సంబంధించిన ఏ జ్ఞాన మైనా కావచ్చు. ప్రధానంగా జ్ఞానము అంటే వృత్తి రూప జ్ఞానము అని అర్థము. ఇక మూడవది అపోహనము. అంటే వ్యక్తిలో స్మృతి జ్ఞానాలు ఏవైతే ఉన్నవో, అవి లేకుండా పోవడము, స్మృతి జ్ఞానాలను మరచి పోవడము అపోహనము. ఇవన్నీ చైతన్యం వల్లనే సంభవిస్తున్నాయి అంటున్నాడు. చైతన్యం లేనిదే మనస్సు ఆలోచించ లేదు. చైతన్యము లేనిదే చిత్తానికి స్మృతి రాదు. చైతన్యం లేనిదే బుద్ధిలో జ్ఞానం వికసించదు. జ్ఞానాలకు, స్మృతులకే కాదు, మరపుకు కూడా (విస్మృతి) చైతన్యమే ఆధారము. కొందరికి అన్నీ జ్ఞాపక ముంటాయి. కొందరికి కొన్నే జ్ఞాపక ముంటాయి. కొందరికి ఏవీ జ్ఞాపక ముండవు. కొందరికి జ్ఞాపక శక్తి ఉంటుంది గాని, అవసరానికి ఉపయోగ పడకుండా ఉంటుంది. ఒక యువకుడు ఉద్యోగ నిమిత్తం ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ తనకు ఎదురైన ప్రశ్నలకు చక్కని సమాధానాలు చెప్పి, ఉద్యోగాన్ని సంపాదించి సంతోషిస్తాడు. ఆ యువకుని సంతోషానికి అతని లోని జ్ఞానము, స్మృతియే కారణము. ఒక అభ్యర్థి పోటీ పరీక్షలో పాల్గొని, పరీక్ష చక్కగా వ్రాసి ఉత్తీర్ణుడై, పెద్ద ఉద్యోగాన్ని సంపాదించి తృప్తి చెందుతాడు. అతని తృప్తికి అతని లోని జ్ఞానము, స్మృతియే కారణము. ఈ విధమైన జ్ఞానము, స్మృతి బుద్ధిలో ఏర్పడ టానికి ఆత్మ చైతన్యమే కారణము. ఇక మూడవది అపోహనం. దీనినే కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అపోహనం అంటే మరపు. మరచిపోయేది ఉన్న వాటినా, లేని వాటినా? లేని వాటిని మరచే దేముంటుంది? కనుక ఉన్న వాటినే మరచి పోవాలి. బుద్ధిలో ఉన్న వాటినే మరచి పోవాలి. ఉన్న జ్ఞానము జ్ఞాపకం రాదు. పొందిన అనుభవము స్మృతికి అందదు. అదే అపోహనం. జ్ఞాపకం రాదు; స్మృతికి అందదు అంటే, శాశ్వతంగా మరచి పోయాడని కాదు. అది అపోహనం క్రిందికి రాదు. బుద్ధి లోని స్మృతి, జ్ఞానములు అవసరమైన సమయాలలో బుద్ధికి అందవు. అదే అపోహనం యొక్క ప్రభావము. 'ఏదో చెప్పాలనుకున్నా నండి, అదే అర్థం కావడం లేదు!' అని కొందరు అంటూ ఉంటారు. మరి కొందరేమో, 'గొంతు లోనే ఉందండి, జ్ఞాపకం రావడం లేదు!' అంటూ ఉంటారు. గొంతులో ఏముంది? గొంతు లోనే ఉంటే శుభ్రంగా చెప్పొచ్చు కదా, పచ్చి వెలగకాయ అని! అమెరికా వెళ్తున్న ఆత్మీయుణ్ణి కలిసి అతి ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలని ఒక వ్యక్తి విమానాశ్రయానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తరువాత అవీ - ఇవీ మాట్లాడి, చెప్ప వలసిన ముఖ్య విషయాన్ని మరచిపోయి, ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చిన తరువాత జ్ఞాపక మొస్తుంది చెప్పడం మరచి పోయాడని. ఈ లోగా భార్యామణి, “ఏమండీ, చెప్పి వచ్చారు కదా!' అంటుంది. అంతే. ఇక సమాధాన మేముంటుంది, నీళ్ళు నమలడం తప్ప! అప్పుడు గీత - పది హేనవ అధ్యాయం అధ్యయనం చేసినందుకు మనం జ్ఞాపకం చెయ్యవలసి వస్తుంది. అయ్యా! నీళ్ళను నమలరు. నీళ్ళు చోష్యములు కదా! పేయము లైన వాటిని అలా నమలడ మేమిటి? నమలవలసినవి భక్ష్యములు కదా! అని అన్న చతుష్టయాన్ని వివరించ వలసి వస్తుంది. స్మృతికి, జ్ఞానానికి, అపోహనానికి చైతన్యాత్మయే ఆధారము అనేదే ఇక్కడ ప్రధానమైన విషయము. నిజమే, చైతన్యాత్మ అందరిలో సమంగా ఉంది కదా! అలాంటప్పుడు, కొందరికి స్మృతి జ్ఞానాలు చక్కగా ఉండట మేమిటి? కొందరికి అపోహనం ఎక్కువ ఎందుకని? అలా ఉండబట్టే కదా కొందరికి సుఖము, కొందరికి దుఃఖము కలుగుతూ ఉన్నాయి! స్మృతి, జ్ఞాన, అపోహనాల కారణంగా మానవులకు సంభవించే సుఖదుఃఖాలకు చైతన్యమే కారణము అని అంగీకరించ వచ్చా? కూడదు. అది కుదరదు. చైతన్యాత్మ నిష్క్రియము. నిర్మలము. నిష్క్రియాత్మకు కర్తృత్వాన్ని అంటకట్ట డానికి వీలు లేదు. ఆత్మ సదా అసంగము. మరి, వ్యక్తులలో స్మృతి, జ్ఞాన, అపోహనాది భేదాలకు, తత్ఫలితంగా సంభవించే సుఖదుఃఖాలకు హేతు వేమిటి? అనేది శంక. ఈ సందేహానికి భాష్యంలో సమాధానం స్పష్టంగా ఉంది. ఎవరైతే పుణ్య కర్మ లాచరించారో, వారికి పుణ్య ఫలంగా బుద్ధి శుద్ధిపడి ఉన్నందున విస్పష్టమైన స్మృతి జ్ఞానాలు ఉంటాయి. ఎవరైతే పాప కర్మలు లోపించడము అనే అపోహనం ఆచరించారో, వారికి పాప ఫలంగా బుద్ధి దూషితమై ఉన్నందున స్మృతి జ్ఞానాలు కలుగుతూ ఉంటుంది (యేషాం యథా పుణ్య కర్మిణాం పుణ్య కర్మానురోధేన జ్ఞాన స్మృతీ భవతః తథా పాప కర్మిణాం పాప కర్మాను రూపేణ స్మృతి జ్ఞానయోః అపోహనం చ అపాయనం అపగమనం చ).

వేదితవ్యం

వేదము లన్నిటి చేత (వేదైశ్చ సర్వైః) తెలియదగిన వాణ్ణి నేనే (అహమేవ వేద్యః వేదితవ్యః) అంటున్నాడు. భగవంతుడు. వేదము అనేది జ్ఞాన భాండాగారము. వేదములు అనేక విషయాలను ప్రతిపాదిస్తాయి. ద్రవ్య సంబంధమైన యజ్ఞ యాగాదులు వేదంలో చెప్ప బడ్డాయి. కర్మకాండ ఉంది. అలాగే ఉపాసనా కాండ కూడా ఉంది. ఇవి అన్నీ కర్మ ప్రధానంగా ఉంటాయి. ఫలసంగంతో కూడి ఉంటాయి. కర్మఫల ప్రాధాన్యంగా ఉంటాయి. కాని, వేదాల లోని ఉపనిషత్తులు కేవలం జ్ఞాన ప్రధానంగా ఉంటాయి. వేదాలలో ఇదే శ్రేష్ఠమైన జ్ఞానము. పరమాత్మకు సంబంధించిన జ్ఞానము. కనుక ఇదే వేదితవ్యం, అంటే తెలియ దగింది. అట్టి వేదితవ్యుడు తానే అంటున్నాడు గీతాచార్యుడు (వేద్యః). మోక్షమును పొంద గోరే ముముక్షువులు తెలుసుకోదగిన వాడు పరమాత్మ ఒక్కడే కనుక ఆయన వేదితవ్యుడు. వేద్యుడు ( నిశ్రేయసార్థిభిః వేదనార్హాత్వాత్ వేద్యః). మోక్షము అనేది అమృతత్వస్థితి అయినందున మోక్షమును పొందిన జీవులు జననమరణాల నుండి విముక్తులై తరిస్తారు. అట్టి మోక్షము జ్ఞానరూపంలో ఉంది. అది పరమాత్మకు సంబంధించిన జ్ఞానము. అదే వేద్యము, వేదితవ్యము, జ్ఞేయము. అర్జునా! దేనిని తెలుసుకుంటే నీవు మృత్యువు నుండి విడిపడి అమృతత్వమును పొందుతావో అట్టి జ్ఞేయమును నీకు బోధిస్తున్నాను అన్నాడు భగవంతుడు (13 వ అ - 12 వ శ్లో). అక్కడ ఏదయితే జ్ఞేయంగా చెప్ప బడిందో అదే ఇక్కడ వేద్యంగా చెప్పబడుతూ ఉంది. పరమాత్మ జ్ఞానమును పొందిన తరువాత మరొక జ్ఞానమును పొంద వలసిన అవసరం ఉండదు. కారణం, దానికి మించిన జ్ఞానం లేక పోవడమే ( 6 వ అ - 22 వ శ్లో).

వేదము - వేద్యము

వేదము జ్ఞానమయం. పరమాత్మ జ్ఞానమయుడు. జ్ఞానమును తెలియ చేసేది వేదము. జ్ఞానము ద్వారా తెలియబడే వాడు పరమాత్మ. పరమాత్మ, పరమాత్మ జ్ఞానము వేరు కానందున వేద్యుడైన పరమాత్మ వేదరూపుడు. కనుకనే, 'వేద' నామధేయుడు (వేద రూపత్వాత్ వేదః ). అంతే కాదు. పరమాత్మ అనుగ్రహం చేతనే వేదజ్ఞానము ప్రాప్తిస్తుంది. అందువలన కూడా ఆయన వేద నామధేయుడు (వేదయతీతి వా వేదః). వేద నారాయణుడు. భగవానుడు వేద స్వరూపము. వేదము భగవత్స్వరూపము. సృష్టికి పూర్వము పరమాత్మ ఒక్కడే సద్రూపంగా, ఏకంగా, అద్వితీయంగా భాసించాడు. సృష్టికి పూర్వం పరమాత్మ ఉంటే, ఆయన జ్ఞానం కూడా సృష్టికి పూర్వమేఉంది. అదే వేదం. పరమాత్మ తన జ్ఞానం తోనే ఈ సృష్టి కార్యాన్ని నిర్వర్తించాడు. కనుక, సృష్టి లోని జ్ఞానమంతా వేద జ్ఞానమే. ఈ కారణం చేతనే వేదములు అపౌరుషేయములు. జ్ఞానము అనేది తెలియ బడేదే గాని సృష్టింప బడేది కాదు. అందుచేత వేదము ప్రమాణమై మోక్షమును అనుగ్రహించే స్థితిలోఉంది.

హైలెస్సా! హైలెస్సా! వేదము నే నని తెలుసా

ఎన్నో ఎన్నో చెప్పి ఊరిస్తా మరుక్షణమే బ్రతుకంతా మారుస్తా

సంసార తిమిరాలు చీలుస్తా అజ్ఞాన జలములు పీలుస్తా

రాగద్వేషాలు రాల్చేస్తా శాంతి ప్రేమలు నింపేస్తా

హైలెస్సా! హైలెస్సా!

స్వర్గం నీకు చూపిస్తా మోక్షం నీకు అందిస్తా

అంద మంతా చిందిస్తా ఆనందం నీవే అనిపిస్తా

హైలెస్సా! హైలెస్సా!

అని వేద విజ్ఞాన నౌకలో మనలను కూర్చో పెట్టి, వేద నాదాన్ని వినిపిస్తూ శాంతి విహార యానం చేయించింది చైతన్య గీతిక.

వేదాంత  కర్త 

వేదాంతము అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల లోని ఆత్మజ్ఞానమే వేదాంత జ్ఞానము. జ్ఞానము ఏదైనా బోధ ద్వారానే అందుతుంది. ఈ విషయంలో వేదాంతము విలక్షణంగా లేదు. జ్ఞానము కలిగిన వ్యక్తి తన జ్ఞానమును తాను అందించి నపుడే మరొకరికి అది అందుతుంది. జ్ఞానము అంటే బోధ. బోధను అందించాలంటే బోధనా విధి కూడా తెలిసి ఉండాలి. ఈ విషయాన్ని ఇప్పటికే మనం విస్తరించి చెప్పుకున్నాం. బోధ ఎంత ప్రధానమో బోధనా విధి కూడా అంత ప్రధానము. విధానము తెలిసి బోధించి నపుడే బోధ శ్రోతకు అందుతుంది. వేదాంతము విషయంలో దీనినే సంప్రదాయము అంటారు. అదలా ఉంచితే, ఇక్కడ వేద్యమైన పరమాత్మను వేదాంత కర్తగా కూడా అభివర్ణిస్తున్నాడు (వేదాంతకృత్). వేదాంతము అంటే జ్ఞాన మని చెప్పుకున్నాం. జ్ఞానము సృష్టింప బడేది కాదు. పరమాత్మ విశ్వాన్ని సృష్టించి నట్లు జ్ఞానాన్ని సృష్టించాడా? లేదు. ఆయనే జ్ఞాన స్వరూపుడు. మరి, అటువంటి పరమాత్మను 'వేదాంత కర్త' అనడంలో అర్థ మేమిటి? వేదాంత కృత్, వేదాన్తార్థ సంప్రదాయ కృత్ ఇత్యర్థః - వేదాంత కర్త అంటే, వేదాంతార్థ సంప్రదాయాన్ని నడిపించడములో కర్త అని భావము. సంప్రదాయ రక్షకుడు అని అర్థము. మరి, సంప్రదాయ కర్తలు ఋషులు అని తెలుసుకొని ఉన్నాం. అందుచేతనే కదా బోధను ప్రారంభించే ముందు సంప్రదాయ కర్త లైన ఋషులను బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్త్యభ్యో అంటూ స్మరించు కుంటున్నాము. ఋషులు సంప్రదాయ కర్త లైనపుడు (ఋషిభిః సంప్రదాయ కర్తారః), భగవంతుని సంప్రదాయ కర్తగా చెబుతూ వేదాంతకృత్ శబ్దానికి అర్థం చెప్పడం పొసగుతుందా? సంప్రదాయ కర్తలు జ్ఞాను లైన ఋషులే అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే, పరమేశ్వరుని అనుగ్రహం చేతనే ఋషులకు సంప్రదాయ స్పృహ కలుగుతుంది కనుక భగవంతుని వేదాంత సంప్రదాయ కృత్ అనడం జరిగింది. ఈశ్వర కృప చేతనే ఋషులు వేదాంత ఉపదేశ కర్త లయ్యారు (వేదాంత ఉపదేశ కృత్). పైగా తనకు, జ్ఞానికి తేడా లేదని, జ్ఞాని తన ఆత్మే నని గీతాచార్యుడే బోధించాడు కదా! 

(7 వ అ - 18వ శ్లో).

వేద విదుడు

వేదవిదుడు అంటే వేదము తెలిసిన వాడు. అంతే కాదు వేదార్థమును తెలిసిన వాడు (వేదవిత్ వేదార్థ విదేవ చాహమ్ ). వేదమును, వేదార్థమును తెలిసిన వారు ఎందరైనా ఉండొచ్చు. కాని, వేదమును, వేదార్థమును యథావిధిగా, సంపూర్ణంగా, స్పష్టంగా, నిస్సంశయంగా తెలిసిన వాడు భగవాను డొక్కడే (యథావత్ వేదం వేదార్థం వేత్తి ఇతి వేదవిత్). వేద సారాన్ని, వేదాంత సారాన్ని విచారించి అమృతమయ మైన గీతా జ్ఞానమును అందించడం చేత కూడా ఆయన వేదవిదుడు. వేదాన్ వినే విచారయతి ఇతి వేదవిత్ వేద విచారము చేసి సార భూతంగా భగవద్గీతను ప్రసాదించిన వాడు కావడం చేత కూడా భగవానుడు వేదవిదుడు. చివరగా, సంక్షేప విభూతుల లోని ఈ చివరి శ్లోకంలో ఊర్ధ్వమూలం అనే అధ్యాయారంభ శ్లోక తత్త్వార్థం సంపూర్ణంగా ఆవిష్కరించ బడింది. శ్లోక పూర్వార్ధం 'త్వం' పద నిర్దేశం కాగా, శ్లోకం యొక్క ఉత్తరార్ధం 'తత్' పద నిర్దేశమై, అఖండార్థ బోధ సఫల మైంది. ఆత్మయే బ్రహ్మము (అయమాత్మా బ్రహ్మ ) అనే వాక్యము అనుభూత మైంది. సర్వ ప్రాణుల హృదయాలలో ఆత్మరూపంగా తానున్నానని ప్రకటించుకొనిన పరమాత్మ, సర్వభూతాల హృదయాలలో ఈశ్వర స్వరూపంగా తానే ఉన్నట్లు మళ్ళీ పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఒకటవ శ్లోకంలో ప్రకటించి జీవేశ్వరుల మధ్య అభేదాన్ని, అఖండత్వాన్ని స్పష్టం చేస్తాడు. భగవంతుడైన ఈశ్వరుని యొక్క విశిష్టమైన ఉపాధుల ననుసరించి విభూతుల సంక్షేపాన్ని గడచిన నాలుగు శ్లోకాలలో బోధించిన గీతాచార్యుడు, ఇప్పుడు క్షరాక్షర ఉపాధుల నుండి వేరు చేయడం ద్వారా, నిరుపాధిక మైన శుద్ధ బ్రహ్మమును నిర్ధారణ చేయాలనే అభిప్రాయంతో తరువాత మూడు శ్లోకాలను చెబుతున్నాడు.


No comments:

Post a Comment

AYYAPPA SONGS VIDEOS LATEST

\ ANNAMAYYA SONG