Sunday, January 14, 2024
అసలైన నాయకుడు కేటీఆర్
Saturday, January 13, 2024
రాష్ట్రాన్ని బద్నాం చేసేందుకు కుట్ర
Tuesday, January 2, 2024
ఓం
ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులకు, విశ్వమానవాళికి శ్రీ కృష్ణ భగవానుని కృపతో విన్నపము మనము ప్రతినిత్యము భజనలు, స్తోత్రములు, పారాయణములు,ధ్యానము చేయుట వలన మనకు ఆభగవంతుని కృపలభించి అట్టికృపతో మనకు మానసికంగా, శారీరకముగా శక్తి లభించి ఆత్మ విచారణ, మోక్షసాధన చేయగలిగే శక్తిని ఆ భగవంతుడు మనకుకలుగజేయాలని భగవానుని ప్రార్థిస్తూ భగవత్ సేవలో ... మీ ఆత్మబంధువు….
Monday, January 1, 2024
సాధన సోపానాలు - స్వామి సుందర చైతన్యానంద :51 to 100
51 భగవద్దర్శనము లభించలేదని వ్యధ చెందకు. సర్వులలో పరమాత్మను
సందర్శిస్తూ, సేవించడము అలవరచుకో. తీరిక సమయాల్లో ధ్యానమును సాగిస్తూ,
హృదయపు లోతులలోకి వెళ్ళి చూడు. ధ్యానములో అంతర్ముఖ మవుతున్న
నీవు పరమాత్మకు అత్యంత సన్నిహితముగా నున్నట్లు అనుభూతి నొందగలవు.
52 మనస్సును నిగ్రహించే ప్రయత్నములో దానిని నిర్బంధించాలని
చూడకు. సరియైన అవగాహనను అందించాలి. ప్రాపంచిక జీవనము నందలి
మనస్సుతో సదా భాషించే అలవాటును చేసుకో. సద్భావాలతో మనస్సును నింపే
అభ్యాసమును కలిగి యుండుము.
53 కష్టాలెదురయ్యాయని కుమిలిపోకు. గతంలో మన మాచరించిన
దుష్కర్మలు పాపమును అంటగట్టాయి. కష్టాలు వచ్చి పాపాలను దూరం
చేయుచున్నవి. అలాగే గతములో మన మాచరించిన సత్కర్మలు పుణ్యమును
ముందుంచుతున్నవి. సుఖాలు వచ్చి పుణ్యమును హరింపజేయుచున్నవి. మన
పుణ్యమును హరించే సుఖము కన్నా మన పాపమును హరించే దుఃఖమే
శ్రేయోదాయకము కదా!
54 కర్మల మధ్య కలతచెందకు. సర్వకర్మములను భగవానుని యందు
సన్యసించి నిర్మలంగా ఉండు. నీవు పాత్రధారివి. భగవానుడు సూత్రధారి.
ఈ సత్యాన్ని సదా జ్ఞాపక ముంచుకొని జీవించు. తరువాత నీ జీవితము
దేదీప్యమానమై వెలిగిపోగలదు.
55 కర్మలను సన్యసించాలని భావించకు. కర్మలలో సన్యాసమునుదర్శించే
అలవాటు చేసుకో. అహంకార, మమకారాలను వీడి నీవు ఆచరించే ప్రతి
కర్మయును సన్యాసానికి ప్రతిరూపమే అవుతుంది.
56 సూర్యుడు ప్రకాశించుచునే యున్నాడు. మబ్బుయే అడ్డు నిలిచి
ప్రకాశాన్ని ఆటంక పరచింది. మబ్బు తొలిగితే సూర్యదర్శన మవుతుంది. అలాగుననే
అజ్ఞాన మబ్బు తొలగగానే ఆత్మజ్ఞాన భాస్కరుడు స్వప్రకాశచైతన్యమై భాసిస్తాడు.
57 సహనము ఉత్తమమైన సుగుణము. సహనశీలుడు ఎన్నడైనను
విజయుడే. సహనశీలుడగు వానిని బాధలు కదిలించలేవు. ఈర్ష్యలు అతనికి
అర్థంగావు. అసూయలు తెలిసిరావు. అపకారికి కూడా ఉపకారమును చేయు శక్తి
సహనశీలునికి ఉండును. తనను గునపముతో కొట్టెడి వానిని కూడా భూమి
సమానముగనే భరించును కదా?
58 ప్రేమ చాలా పవిత్రమైనది. అది బ్రతుకునే పావన మొనర్చును.
ప్రేమించడము ఒక కళ. ప్రేమించే నేర్పు నీకు అవగత మయితే నీ ప్రేమ
జడరూపాలను చైతన్యవంతము చేస్తుంది. అజ్ఞానమును జ్ఞానముగా మార్చుతుంది.
ఆవేదనను ఆనందముగా తీర్చుతుంది. ప్రేమజీవియే ధన్యజీవి.
59.బాధల మధ్య సాధకుడు చెదరిపోకూడదు. నిన్ను బాగుచేసేందుకే
బాధ లొస్తున్నాయని భావించు. బాధలలోనే నీ బ్రతుకు శోభాయమానముగా
తయారవుతుంది. మనోహరమైన కాంతిని వెదజల్లే ముందు బంగారు నిప్పుల్లో
ఎంతగా కాలినదో, సమ్మెటపోట్లను ఎంతగా భరించినదో ఆలోచించు.
60 మాటలకన్నా మౌనమే నీ చేత బాగా మాట్లాడిస్తుంది. ఆధ్యాత్మిక
సాధకుడు అధికప్రసంగి కాకూడదు. ఎవరైన ప్రశ్నిస్తేనే మాట్లాడు. నీకు నీవుగా
వ్యర్థప్రసంగాలను చేయకు. అసహ్యకరముగా ఎవరైనా మాట్లాడుచుండినచో,
ఈ ప్రపంచ వైఖరిలో ఇలాంటిది అని సరిపెట్టుకొని స్థిమితముగా,ఉదాసీనముగా ఉండు.
61 నీ గొప్పతనమును చాటుకొనే వచనములను పలుకకు. సామాన్యుని
వలె నమ్రతగా ఉండటము అలవరచుకో. నిన్ను గూర్చి నీవు చెప్పుకొనుచున్నంత
కాలము నీవు చిన్నవాడివే. నీవు గొప్పవాడివి అయ్యావా? ఇతరులే నిన్ను గూర్చి
ప్రశంసిస్తారు.
62 వారానికి ఒక్క రోజు చక్కెర లేకుండా పానీయము తీసుకో. టీ గాని,కాఫీ గాని, పాలు గాని ఏది నీవు తీసుకొన్నను పంచదారను దానిలో మినహాయించు.అప్పుడప్పుడు ఇలా చేయుచు వరుసగా ఒక వారం రోజులు పూర్తిగా పంచదారను వాడుట మానివేయి. మనస్సు తీపిపై మరలగానే మాధవుని నామమును బిగ్గరగా గానము చేయి. నాలుక తియ్యగా మారుతుంది. జిహ్వను జయించలేని జీవికి జీవితములో శాంతి లభించదు.
63 అందరిలోను పరమాత్మను వీక్షిస్తూ జీవించు. దయ నిండిన పలుకులే
నీనుండి కదలనీ. ఈ ప్రపంచము అనిత్యమనెడి భావనను సదా మదిలో కలిగియుండు.
సర్వులను ప్రేమిస్తూ ఉండు. నీవు ప్రేమించినవారు నిన్ను ప్రేమించాలని
ఆశించకు. అనంతుడైన భగవానునికి అనేక శరీరాలు. నీవు ఒకరికి మేలు చేయి.
మరొకరి ద్వారా భగవానుడు నీకు మేలుచేస్తాడు.
64 సదా సత్యమునే భాషించుము. భగవానుడు సత్యరూపుడు. నిత్యము
సత్యమును భాషించు వానికి వాక్షుద్ధి లభించును. వాక్షుద్ధి గలవాడు ఏది
తలచినను, పలికినను నిరాటంకముగా జరిగిపోవును. వాక్షుద్ధి నీకు అలవడినచో
ద్విగుణీకృతముగా నీవు ప్రపంచానికి సేవ చేయగలవు.
65 సంసారజీవనము లోని దుఃఖములను సదా దర్శించే అలవాటును
సాధకుడు అలవరచుకోవాలి. మృత్యువును గూర్చి సదా భావన చేయుచూ ఉండాలి.
మహాత్ముల చెంతగాని, లేదా సత్సంగము నందుగాని ఆధ్యాత్మిక స్ఫూర్తిని
పొందుతూ ఉండాలి. అనుక్షణము భగవానుని స్మృతియందుంచుకొని జీవించాలి.
సాధకుడు ఈ నాలుగు విషయాలను మరువరాదు.
66 నిత్యము ధ్యానము చేయు అలవాటును చేసుకో. ధ్యానజీవనమే
ధన్యజీవనము. ధ్యానములో కొద్దిగా ప్రగతిని సాధించగనే బ్రతుకులో మాధుర్యాన్ని
నీవు చూడగలవు. ప్రారంభములో కొన్ని ఒడుదుడుకులు ఏర్పడవచ్చు. ధ్యానములో
అంతర్ముఖ మవుతున్నకొద్దీ ఆవేదనలన్నీ పూలరేకులవలె రాలిపోవును.
67 ప్రపంచము నిత్యమని భావించుచున్నంత కాలము కామధేనువు చెంతనే
యున్నను కష్టాలు తప్పవు. పరమాత్మయే శాశ్వతమని తెలియగనే కౌపీనధారి
కూడా కలిమి గలవాడే యగును. ప్రపంచాన్ని విస్మరించు. పరమాత్మను స్మరించు.
68 శీలం దూరమైన వాడు పండితుడైనను వాసన లేని పూవువలె వ్యర్థ
జీవియే యగును. శీలము అతి పవిత్రమైనది. దానిని కాపాడే ప్రయత్నములో
శరీరము నేలరాలినను ఫరవాలేదు. కీర్తిధృవతార నిలిచియే ఉంటుంది.
69 శుద్ధిపడిన హృదయము అభేదదర్శనము చేయగలుగుతుంది. నిస్వార్థ
ప్రేమ నీ హృదయములో నిండగనే, నీ బ్రతుకును నడిపేందుకు భగవంతుడే దిగి
వస్తాడు. అంతవరకు నీ బ్రతుకును నడుపుతున్నది అహంకారమే నని, తద్వారా
లభించేది వినాశమే నని మరువకు.
70 సత్యరూపుడవు కావలెనని వాంఛించే నీవు సత్యజీవనమును సాగించక
తప్పదు. ముదుసలి కర్రపై ఆధారపడి నడుస్తాడు. తనకు ఆధారమైన కర్రను తాను
మోసినపుడే అది అతనికి ఊతగా నిలుస్తున్నది. నీవునూ సత్యజీవనమును
సాగించినపుడే సత్యరూపమును దర్శించగలవు.
71 నిన్ను భగవంతుడు నడిపించాడా! నీవు ద్వంద్వాలకు అతీతుడవయ్యావనే తెలుసుకో. మనస్సు సున్నిత మవుతుంది. హృదయం విశాల మవుతుంది.
బ్రతుకు ఉజ్వలమై ప్రకాశిస్తుంది.
72 నిద్రనుండి లేవగనే “భగవాన్! ఈనాడు నేను ఎవ్వరినీ బాధించను.
ఎవరి హృదయాన్ని గాయపరచను" అని ప్రతిజ్ఞ చేయి. రాత్రి పరుండే ముందు
“భగవాన్! నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. నేను ఎవరినీ బాధించలేదు.
ఇదంతా నీ అనుగ్రహ ప్రసాదమే" అని నమస్కరించు.
73 “ఆలయానికి వెళ్తున్నాను" అంటావు. ఆలయ మొక్కటియే భగవన్నిలయమని
నీ అభిప్రాయము కాబోలు. విశాలవిశ్వ మంతయూ దివ్యాత్ముని ఆలయమే నని నీకు తెలిసిననాడు నీవు నిలిచినచోటే భగవన్నిలయ మవుతుంది.
74 నీవు అసంఖ్యాకమైన గ్రంథములను రచించవచ్చు. అనర్గళముగా
ఉపన్యసించవచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలివియని పదుగురిచే స్తుతించబడవచ్చు.
హృదయంలో ప్రేమను పోగొట్టుకొన్నచో ఇవి యన్నియు శవసౌందర్యములే కదా!
75 చింతలలో చరించే వింతజీవనానికి స్వస్తి చెప్పు. సాధకుడవైన నీవు
నిత్యము ఆనందరూపుడవై ఉండాలి. చితి మృతకళేబరాలను దహిస్తే, చింత
ప్రాణమున్న దేహాలనే దహించివేస్తుంది.
76 పరిస్థితులను గూర్చి పలవరించకు. విషమ పరిస్థితుల మధ్య కూడా
విమలచిత్తుని వలె జీవించు. భిన్న పరిస్థితులు తలఎత్తినపుడు, నీ మానసిక
ప్రపంచములో నీవు ఉండేందుకు ప్రయత్నించు. భగవంతుడు పంపగా నిన్ను
మలిచేందుకు వలచి వచ్చినవే విపత్తులని మరచిపోకు.
77.“నేను చట్టబద్ధముగా, న్యాయసమ్మతముగా, ధర్మయుతముగా జీవించుచున్నాను. మరి నాకు కష్టాలెందుకు సంభవిస్తున్నాయి?" అంటావు.
మిత్రమా! నీ చట్టాలు, ధర్మాలు వ్యక్తిపరంగా నడిచే నియమాలు. సమిష్టపరంగా,
దైవపరంగా ఆలోచించి చూడు. నీ బాధలకు నీవే ఎలా కర్తవో నీకు బోధపడుతుంది.
78.రుచి చూడని నీకు రుచి తెలిసే అవకాశము లేదు. రుచి తెలియని నీకు
రుచిని తెలిపే హక్కు అసలేలేదు. అనుభవమునకు అందని విషయాన్ని ఇతరులకు
అందించే ప్రయత్నము ప్రమాదకరము. మిత్రమా! ఆత్మరుచిని అనుభవించు. ఆ
తరువాత ఇతరులకు అందించుదువు గానీ! రుచి చూడని నీకు రుచి చూపాలనే
అభిరుచి ఎందులకు?
79.వ్యక్తిభావన ముక్తిని ఆటంకపరుస్తుంది. వ్యక్తిభావనను విశ్వభావములో
లయింపజేయి. విశ్వభావములో విశ్వచైతన్యము నిండియున్నందున నీకు విశ్వనాథుడు
గోచరిస్తాడు. అప్పుడు భిన్నత్వములో ఏకత్వాన్ని దర్శించగలవు.
80.భగవంతుని దయ నీపై వర్షించనంతవరకు దానిని గూర్చి నీవు
గ్రహించలేవు. భగవత్కృప నీపై పడగానే అప్పుడు నీకు సత్యం తెలిసివస్తుంది. "ఆ
దయకు నేను అర్హుడనా?” అన్న సందేహం కూడా కలుగుతుంది. మిత్రమా!
భగవత్కృప కర్మకు ఫలితం కాదు. ఆ దయామయుని అనంత ప్రేమకు నిదర్శనం.
81 భగవానుడు అందరిలోను దాగియున్నాడు. నీతో భాషించే ప్రతి
ఒక్కరి పలుకు వెనుక భగవానుడు కులుకుతూనే ఉన్నాడు. నీ హృదయాన్ని సదా
తెరచియే ఉంచు. పసిబిడ్డ వలె నిర్మలంగా ఉండు. ప్రతి జీవిని భగవత్స్వరూపముగా
దర్శించుచూ ప్రేమించే అలవాటును అలవరచుకో.
82 భగవంతుని ధ్యానించగనే నీవు విశ్వచైతన్యముతో ముడిపడి ఉంటావు.
వెంటనే అపరిమిత శక్తిమంతుని వలె మారుతావు. ధ్యానము శక్తిని, ప్రకాశాన్ని నీకు
అందించి నిన్ను ప్రభావితుడ్ని చేస్తుంది. ధ్యాన జీవితాన్ని ఎన్నడూ దూరం చేసుకోకు.
83 సోదరా! శాంతియే నీ జన్మహక్కు. బలమే నీ కులము. పిరికితనాన్ని,
అశాంతిని పారద్రోలు. "అహం బ్రహ్మాస్మి" అని సింహకిశోరము వలె గర్జించు.
అమృతస్వరూపుడవైన నిన్ను మృత్యువు కూడా కదిలించలేదు.
84 నేస్తమా! నీవు ముక్తస్వరూపుడవు. నీ స్వేచ్ఛను అమ్ముకోకు. ఇతరుల
భావాలకు నీ మనస్సును ధారబోయకు. నీమీద నీవు ఆధారపడు. నీవు నమ్మిన
దానినే ఆచరించు. గొర్రెలన్నీ గుంపుగా వెళ్ళనీ సింహకిశోరమైన నీవు నీకంటూ
ఒక దారిని ఏర్పరచుకో.
85 పాపము చేసినందులకు వగచకు. పాపమొక భూతము కాదు.
పొరపాటు మాత్రమే. సరిచేసుకుంటే సరిపడిపోతుంది. జ్ఞానజాగరణలో సర్వసమస్యలు,
సమస్త పాపములు లయించిపోతాయి. పాపము జరిగిందని స్వప్నప్రపంచములో
కూర్చొని విలపిస్తావెందుకు? మేలుకొని చూడు. అయ్యోపాపమని
పాపాన్ని ఓదార్చేవాడివి నీవే అయివుంటావు.
86 సాధకా! అభిరుచుల్ని దూరం చేసుకో. అహంకారాన్ని ఆవల నుంచు.
అర్హులైన వారికి సేవల నందించు. సర్వులను సమముగా వీక్షించు. ధ్యానహృదయముతో
కదులుతూ ఉండు. శాంతి నీ స్వరూపమై మిగులుతుంది.
87 వస్తువులను దహించే శక్తి అగ్నికి ఉన్నట్లు, పాపాలను దహించే శక్తి
భగవన్నామాని కుంది. విరామసమయాల్లో విచారముతో సాగక, భగవన్నామాన్ని
ఆంతర్యములో కొనసాగించే అభ్యాసమును కలిగియుండు. నీ హృది సదా
ఆనందముతో నిండుతుంది.
88 ప్రేమచే క్రోధాన్ని జయించు. నమ్రతచే అభిమానాన్ని దూరం చేసుకో,
శరణాగతిచే అహంకారాన్ని అంత మొందించు. సేవచే ద్వేషాన్ని రూపుమాపు. ఇవన్నీ
జరిగాయా! ఇక నిన్ను మించిన భాగ్యవంతుడు ఈ ప్రపంచములో మరొకడుండడు.
89 ఎక్కువగా ఆలకించు; తక్కువగా ఆలపించు. ఎక్కువగా ఇచ్చుకో;
తక్కువగా పుచ్చుకో. ఎక్కువగా ఆచరించు; తక్కువగా ప్రవచించు. ఎక్కువగా
ఆలోచించు; తక్కువగా చదువు. ఆ తరువాత నీలో తరిగేదేమిటో పెరిగేదేమిటో
నీకే అర్థమవుతుంది.
90 మృత్యువంటే నీకు భయమా? మృత్యువును చూసి నీవు పారిపోతావా?
అయితే విను. నిజమైన మృత్యువేమిటో చెప్పనా? మమకారమే మృత్యువు.
నిర్మమకారమే అమృతత్వము. ....... ఇంకా చూస్తావేం? మృత్యువుకు దూరంగా
వెళ్ళు.
91 నిష్కామ్యభక్తిని కలిగియుండు. కోరికలను మదిలో నింపుకొని గుడి కెళ్ళకు.
అడగనవసరము లేకనే అందించువాడు అచ్యుతుడు. నీ అవసరాలు నీకన్నా
అతనికే బాగా తెలుసు. భక్తి చేయుట ఒక్కటియే నీవు చేయవలసిన పని.
92 గురుబోధలో బ్రతుకును పండించుకో. గురువైనవాడు మహిమలు
చేస్తాడని, చేయాలని అభిప్రాయపడకు. అవన్నియు చౌకబారు ప్రదర్శనలు. నీగురువు నీహృదిలో నిలవడమే గొప్ప మహిమయని మరువకు.
93 ఓ సాధకా! ఇతరులు వాడిన చెప్పులను ఎట్టి పరిస్థితులలోను వాడకు.
ఇతరుల పడకపై పరుండకు. తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా ఆలోచించే
సదలవాటును తప్పక కలిగియుండు.
94 కోరికలు నిన్ను అశాంతికి గురిచేస్తాయి. లభించిన దానితో
తృప్తిపడటము అలవరచుకో. నీవు సక్రమమార్గములో నడచునపుడు అన్యుల
విమర్శలను లెక్కచేయకు. అలాగని అన్యులుచేయు స్తుతులు నీకు ఉపకరిస్తాయని
భ్రమపడకు. అవి మరీ నీ బ్రతుకును కృంగదీస్తాయి.
95 ఎవరైనా నిన్ను నిందించినపుడు వ్యథచెందకు. ఉద్రేకమును ప్రదర్శించకు.
చక్కగా విచారణను కొనసాగించు. వారు చేసింది పదముల గారడియే
కదా! వారినుండి కదిలినది శబ్దతరంగమే కదా! అని సరిపెట్టుకో.
96 నీలోని చెడును, ఇతరులలోని మంచిని గాలించి గ్రహించే సదలవాటును
కలిగియుండు. నీకు చెడు చేసిన వారిని ప్రేమించు చేసిన మంచిని గూర్చిమాట్లాడకు.
97 భగవంతుని విషయంలో నీవు సుముఖతను చూపవచ్చు.విముఖతను
చూపవచ్చు.కానీ భగవానుడు మాత్రము నిన్ను ఎన్నడూ వదలి పెట్టడు.
ఈ సత్యమును గ్రహించి మనస్సును సదా భగవంతుని యందే విలిపెడి
అలవాటును చేసుకో.
98 అన్వేషిస్తే సత్యము అవగత మవుతుంది. విచారిస్తే సత్యము
చేరువవుతుంది. అభ్యసిస్తే సత్యము అనుభవముగా మారుతుంది. ధ్యానిస్తే
అనుభూతి స్థిరమై ఉంటుంది.
99 అహంకారాన్ని త్యజించి, వైరాగ్యమును ధరించి, నిష్కాముడుగా ఆసీనుడవై,
ఇంద్రియ ద్వారములను మూసివేసి, కళ్ళు మూసి, హృదయాన్ని తెరిచి
అవలోకించు. నిన్ను నీవు చూసుకొనేందుకు ఇదియే సూటియైన దారి.
100 పూర్ణమైన సాగరము చంద్రోదయము కాగానే పరిపూర్ణమై గోచరించు
నట్లు, భక్తుడవైన నీవు గురుదర్శనముతో సాగరము వలె నిండిపోవాలి. ప్రేమలో
పండిపోవాలి. నీకు, భగవంతునికి మధ్య గురువు వంతెనయై ఉన్నాడని మరువకు.
#చింతన#గీతాజయంతి_సందర్భంగా_గీతామృతస్నానం#DR_VAISHNAVANGRI_SEVAK_DAS #9821914642
చింతన - గీతా జయంతి సందర్భంగా .. గీతామృత స్నానం ' సకృద్ గీతామృత స్నానం సంసార మలనాశనం ' అని ' గీతా మహాత్మ్యం ' పల...
-
51 భగవద్దర్శనము లభించలేదని వ్యధ చెందకు. సర్వులలో పరమాత్మను సందర్శిస్తూ, సేవించడము అలవరచుకో. తీరిక సమయాల్లో ధ్యానమును సాగిస్తూ, హృదయపు లోతులల...